
నిస్సంకోచంగా, తడుముకోకుండా, సాహసికంగా చేసిన ఊహలే.... సరికొత్త ఆవిష్కరణకు మూలం అవుతాయి అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ మాటలు 29 సంవత్సరాల నిశాంత్, సిద్ధార్థ్‌లకు నచ్చడమే కాదు...వారి ఆలోచన విధానంలో కొత్త మార్పు తీసుకువచ్చాయి.దాని ఫలితమే న్యూటన్ స్కూల్....
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని చిన్నపట్టణాలకు చెందిన నిశాంత్ చంద్ర, సిద్ధార్థ్ మహేశ్వరీ ఐఐటీ–రూర్కీ(ఉత్తరాఖండ్)లో కలిసి చదువుకున్నారు. ఒకే హాస్టల్లో నాలుగు సంవత్సరాలు ఉన్నారు. ‘చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక జాబ్‌లో స్థిరపడాలి అని కాకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం’ అని తరచుగా మాట్లాడుకునేవారు. చదువు పూర్తయిన తరువాత... ‘ఇప్పుడు కావల్సింది ఉద్యోగం కాదు. జీవితాన్ని మార్చేసే ఒక ఐడియా’ అనుకున్నారు. ఆలోచించగా, ఆలోచించగా వారికో ఐడియా తట్టింది.
సమాచారం కోసం వెదకడానికి గూగుల్‌ను ఆశ్రయించడం మామూలే. అయితే కొత్తగా యూట్యూబ్‌లోకి కూడా వెళుతున్నారు. ఇది గమనించినప్పుడు ఈ మిత్రద్వయానికి ఒక ఐడియా తట్టింది. సందేహాలకు వీడియో ఫార్మట్‌లో సమాధానం ఇస్తే ఎలా ఉంటుందని! కంటెంట్ స్ట్రక్చర్ చేయడం, సప్లై చేయడం కష్టమే అయినా చాలా ఇష్టంతో చేశారు.
అదే...‘బోలో’ షేరింగ్ కమ్యూనిటి యాప్. బెంగళూరు కేంద్రంగా 2018లో దీన్ని ప్రారంభించారు. దీనిలో షార్ట్ వీడియో ఫార్మట్‌లో యూజర్ల ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతోపాటు యూజర్లు డైరెక్ట్‌గా ఎక్స్‌ప్టర్‌లతో మాట్లాడే అవకాశం ఉంటుంది. బ్యూటీ,ఫ్యాషన్,కుకింగ్, కెరీర్ కౌన్సిలింగ్...మొదలైన విభాగాల్లో తక్కువ రుసుముతో ఎక్కువ సమాచారం, నాణ్యమైన సమాచారం అందించే వేదికగా గుర్తింపు పొందింది బోలో.
∙∙∙
‘మా అబ్బాయి చదువు పూర్తయ్యి రెండు సంవత్సరాలు దాటింది. ఇంకా ఉద్యోగం రాలేదు. ఎక్కడెక్కడో ప్రయత్నిస్తూనే ఉన్నాడు’ ‘ఇప్పటికి ఇది ఆరో ప్రయత్నం. ఇప్పుడు ఉద్యోగం రాకపోతే ఇక ఎప్పుడూ ప్రయత్నించను’....ఇలాంటి మాటలు నిశాంత్, సిద్ధార్థ్‌లు ఎన్నోసార్లు విని ఉన్నారు. జీరో–స్కిల్స్ ఉన్న ఎంతోమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను దగ్గరి నుంచి గమనించారు.
వీరికి సరిౖయెన దిశానిర్దేశం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి, వారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో టెక్నాలజీ జాబ్స్ కోసం ‘బోలో’ వెంచర్‌ను ‘న్యూటన్ స్కూల్’గా మార్చారు. ‘పే ఆఫ్టర్ ప్లేస్‌మెంట్’ ‘జీరో ఫీ టిల్ ప్లేస్‌మెంట్’ నినాదాలతో రంగంలోకి దిగారు. ఆరునెలల పాటు నిర్వహించే లైవ్ ఆన్‌లైన్ క్లాస్‌లలో సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనింగ్, లైవ్‌ప్రాజెక్ట్‌లు....మొదలైనవి ఉంటాయి.
‘సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే కలను న్యూటన్ స్కూల్ ద్వారా కొంతైనా నెరవేర్చుకోగలిగాము’ అంటాడు నిశాంత్. ‘న్యూటన్ స్కూల్’లో వివిధ విషయాల్లో శిక్షణ తీసుకున్న వెయ్యిమంది వరకు విదార్థులు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందగలిగారు. వీరెవరు పేరు మోసిన విద్యాలయాల్లో చదువుకోలేదు.
‘చాలామంది చీకట్లో రాయి విసురుతున్నారు. అది తగిలితే తగులుతుంది. లేకుంటే లేదు. లక్ష్యం కనిపించాలంటే చీకటి తొలగాలి. వెలుగు కనిపించాలి. వెలుగు కనిపించేలా చేయడమే మా పని’ అంటున్నాడు సిద్ధార్థ్. ఐయూ జర్మనీ, ఎంఐఏ స్పెయిన్ యూనివర్శిటీలతో భాగస్వామ్య ఒప్పదం కుదుర్చుకుంది న్యూటన్ స్కూల్.
చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు
Comments
Please login to add a commentAdd a comment