‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’ అని అప్పుడెప్పుడో గిరీశం సెలవిచ్చాడు కానీ... అదెంత అబద్ధమో... పొగ ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవైపు పొగాకు వినియోగంపై అవగాహన పెరుగుతున్నా... ఇంకా అజ్ఞానంలో ఉన్నవారూ కొనసాగుతున్నారు. ఒకరకంగా చూస్తే పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిలోనూ ధూమపానం వ్యతిరేక ప్రభావాలపై అవగాహన పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నాటి పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ లక్ష్యాన్ని సాధించామనుకోండి... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 80 లక్షలుగా ఉన్న పొగాకు సంబంధిత మరణాలను గణనీయంగా తగ్గించవచ్చున్నమాట!
ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..
1987లో, డబ్యూహెచ్‌ఓలోని సభ్య దేశాలు ఏప్రిల్ 7ని ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవంగా గుర్తించాయి. అయితే పొగాకు సంబంధిత సమస్యలన్నింటిపై అవగాహన పెంపొందించే ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని 1988లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి డబ్యూహెచ్‌ఓ దాని సభ్య దేశాలు ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
పొగాకు వినియోగ గణాంకాలు:
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఏటా పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా దాదాపు 8 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దాదాపు 1.3 మిలియన్ల మంది ధూమపానం చేయనివారు సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కి గురయ్యి, అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు ప్రపంచంలోని దాదాపు 1.3 మిలియన్ల పోగాకు వినియోగదారుల్లో సుమారు 80% మంది మధ్య ఆదాయ దేశాల్లో నివశిస్తున్నారు.
కేవలం 2020లో ప్రపంచ జనాభాలో 22.3% మంది పొగాకును ఉపయోగించినట్లు అంచనా. వారిలో 36.7% మంది పురుషులు, 7.8% మంది మహిళా వినియోగదారులు ఉన్నాట్లు వెల్లడయ్యింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మంది యువకులు ధూమాపానాన్ని సేవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఏడాది థీమ్:
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ “పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం”. ఈ థీమ్‌ని ఇతివృత్తంగా చేసుకుని పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన పెంచడం, ధూమపానం దూరంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించేలా చేయడం వంటివి చేస్తారు అధికారులు. అంతేగాదు ఈ పొగాకు అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి వంటి అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతారు.
ఈ పొగాకులో దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల రసాయనాలు ఉంటాయి. అవి సుమారు 50 నుంచి 60 రకాల కేన్సర్ కారకాలని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం డోపమైన్, అసిటైల్‌కోలిన్, నోర్‌పైన్‌ఫ్రైన్, సెరోటోనిన్ వంటి ఆనందకరమైన హార్మోన్‌లను విడుదల చేసి వ్యసపరుడిగా మారుస్తుంది. ఇది క్రమేణ అధిక రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పొగాకు అడిక్షన్ నుంచి బయటపడాలంటే..
మన వంటింటిలో ఉపయోగించే వాటితోనే పొగాకు అడిక్షన్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..
ధూమపానం సేవించాలనే కోరిక గలిగనప్పుడూ ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకోండి. ఆ కోరికను అదుపులో పెట్టుకోలేనట్లు అనిపించనప్పుడూ ఈ క్రింది ఆహార పదార్థాలను పత్యామ్నాయంగా ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు.
పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీళ్లు తాగడం.
పండ్లు, పచ్చి కూరగాయలు తినడం
నీళ్లు ఎక్కువగా తాగడం
దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వంటివి నమలడం
గోరు వెచ్చని పాలు తాగడం
నిమ్మకాయ నీళ్లు వంటివి తాగాలి
పైవాటిలో మీకు నచ్చినవి తాగేందుకు ప్రయత్నిస్తూ ఆ కోరికను నియంత్రించడం వంటివి చేస్తే సులభంగా పొగాకు అడిక్షన్ నుంచి బయటపడతారు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. రాను మీకు తెలియకుండానే మంచి ఆహారపు అలవాట్లకు అలవాటు పడతారు. దీంతో పాటు చక్కటి వ్యాయమం లేదా ఏదైనా వర్కౌట్‌లతో మైండ్‌ని డైవర్ట్ చేస్తూ.. ఉంటే శారీకంగానూ, మానిసకంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!)
Comments
Please login to add a commentAdd a comment