నూడుల్స్ సమోసా
కావలసినవి:
మైదా పిండి – పావు కిలో, ఉడికించిన నూడుల్స్ – 2 కప్పులు, వాము – అర టీ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, సోయాసాస్ – 2 టీ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత
తయారీ:
ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, ఉల్లికాడ ముక్కలుతె పాటు వాము కూడా వేసుకుని, గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి తిప్పుతూ ఉండాలి. అవి వేగాక ఉడికించిన నూడుల్స్ కూడా వేసుకుని కాసేపు వేయించి, బయటికి తీసి ప్లేటులో పరిచినట్లుగా వేసి... కాస్త ఆరనివ్వాలి. తర్వాత మరో గిన్నె తీసుకుని, అందలో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు వేసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ ఇలాగే చేసుకుని... వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
పుచ్చకాయ హల్వా
కావలసినవి: పుచ్చకాయ జ్యూస్ – 2 కప్పులు(వడకట్టుకుని రసం మాత్రమే తీసుకోవాలి), పంచదార పొడి – రుచికి సరిపడా, మొక్కజొన్న పొడి – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ ముక్కలు – అభిరుచిని బట్టి(నేతిలో వేయించినవి)
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో పుచ్చకాయ రసంలో పంచదార పొడి, మొక్కజొన్న పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్‌లో ఆ మిశ్రమాన్ని వేసుకుని.. చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. బాగా దగ్గర పడే సమయంలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ.. మరింత దగ్గరపడే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి.. ఒక బౌల్‌కి అడుగు భాగంలో నెయ్యి లేదా నూనె రాసి.. అందులోకి ఆ మిశ్రమాన్ని మొత్తం తీసుకుని, దానిపైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు గార్నిష్ చేసుకుని, 2 గంటల తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
బనానా ఎగ్ కేక్
కావలసినవి: అరటిపండ్లు – 2(మీడియం సైజ్‌వి తీసుకుని, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), చిక్కటి పాలు – 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు – 4, పంచదార, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండుద్రాక్ష, జీడిపప్పు – గార్నిష్‌కి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని గుడ్లు, పాలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, వేడి చేసి, అందులో ఎండుద్రాక్ష, జీడిపప్పు వేయించి పక్కకు తియ్యాలి. ఇప్పుడు ఆ పాన్‌లో అరటిపండ్ల ముక్కలు వేసుకుని చిన్న మంట మీద 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని పాలు–గుడ్ల మిశ్రమంలో వేసి గరిటెతో అటు ఇటుగా తిప్పి.. పంచదార, ఏలకుల పొడి వేసుకుని మరో సారి అలానే కలపాలి. ఇప్పుడు పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. గుడ్లు–అరటిపండ్ల మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసుకుని.. నేతిలో వేయించిన ఎండుద్రాక్ష, జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని, చిన్న మంట మీద మూతపెట్టి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే బనానా ఎగ్ కేక్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment