గుండెబరువు దించుకోవాలి.. పలకరిద్దాం పదండి | Nurturing Our Relationships During Corona Virus Pandemic | Sakshi
Sakshi News home page

గుండెబరువు దించుకోవాలి.. పలకరిద్దాం పదండి

Published Wed, Jun 9 2021 2:48 AM | Last Updated on Wed, Jun 9 2021 4:52 AM

Nurturing Our Relationships During Corona Virus Pandemic - Sakshi

కోవిడ్‌ తుఫాను కొద్దిగా తెరిపి ఇస్తోంది.. అది కురిపించిన శోకవృష్టి అంతా ఇంతా కాదు. ఎవరికీ ఎవరితో మాట్లాడ బుద్ధి కాలేదు.. ఎవరికీ ఎవరూ సాయం చేయ వీలు కూడా లేదు. ప్రతి ఇల్లు తన సొంత బాధల్లో మునిగిపోయింది. భయంతో బెదిరిపోయింది. వాట్సప్‌ పలకరింపులు తప్ప ఫోన్లు కూడా చేయని నిరాసక్తత ఏర్పడింది.. ఇది కొనసాగకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడదీసుకోవాలి.. ఒకరిని ఒకరు పలకరించుకోవాలి. నేరుగా కాకపోయినా సరే మనసారా మాట్లాడుకుని గుండెబరువు దించుకోవాలి. ‘ఒకరికి ఒకరం ఉన్నాం’ అని ఓదార్చుకోవాలి. పలకరిద్దాం పదండి.

సందర్భం–1:
రామలక్ష్మి కాలేజీ లెక్చరర్‌. భర్త బ్యాంక్‌ ఎంప్లాయీ. ఇద్దరు పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు. కోవిడ్‌ మహమ్మారి చెలరేగిన ఏప్రిల్‌–మే నెలల్లో ఆమె కుటుంబంలో ఎవరికీ కోవిడ్‌ రాలేదు. కాని ఆమె పెదనాన్న కొడుక్కి కోవిడ్‌ వచ్చింది. 50 ఏళ్లు. చాలా ఖర్చు పెట్టినా మరణించాడు. ‘అక్కా అక్కా’ అని నోరారా పిలిచేవాడు. ఆమె అతన్ని చివరి చూపులు చూడలేకపోయింది. అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడి పిల్లల భవిష్యత్తు తలచుకుంటే ఆమెకు విషాదమే విషాదం. స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఆమే ఆమె కుటుంబం బాగుంది కదా అనుకోవచ్చు. కాని ఇది కుటుంబానికి మాత్రమే సంబంధించిన వేదన కాదు. ఇలా అటాచ్‌మెంట్‌ ఉన్నవారు దూరమైనా వేదన ఉంటుంది. అయినా సమస్య ఏమిటంటే ఇది ఎవరి తో చెప్పుకుంటాం అందరూ ఇలాగే ఉన్నప్పుడు అని ఆమె అనుకోవడం. కాని ఆమె మాట్లాడాలి. ఆమెతో మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవాళ్ల మనసు లోపల ఏముందో తెలుసుకోవాలి. కోవిడ్‌ తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఆమె వంటి ఎందరికో పలకరింపు అవసరం ఉంది.

సందర్భం›– 2:
మురళీకృష్ణకి 70 ఏళ్లు. భార్య మరణించింది. కుమారుడు, కోడలు విదేశాలలో స్థిరపడ్డారు. తండ్రి ని తన దగ్గరకు రమ్మంటే ఇండియా వదిలి ఏం వస్తానని వెళ్లలేదు. దాంతో కొడుకే అక్కడి నుంచి ఇండియాకు రెండేళ్ల క్రితం షిఫ్ట్‌ అయ్యి తండ్రితోనే ఉంటున్నాడు. మొన్న మే మొదటివారం ఆ కొడుక్కి కరోనా వచ్చింది. ఎంత డబ్బు ఖర్చు చేసినా బతకలేదు. మరణించాడు. ఆ తండ్రికి అదెంత పెద్ద దెబ్బ. ఎంత భారం. ఎందరో బంధువులు. అయితే ఒక్కరూ వచ్చి ఆయనను గట్టిగా హత్తుకొని మనసారా ఏడ్వలేని స్థితి. ఆయన కూడా ఎవరితోనూ మాట్లాడలేకపోయారు. ఆయన కోలుకోవాలి. కోడలికి స్థయిర్యం ఇవ్వాలి. పిల్లలు ధైర్యం తెచ్చుకోవాలి. ఎంతోమంది కలిసి ఎన్నోసార్లు పలకరిస్తూ, మాట్లాడుతూ, కలుస్తూ గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఈ పని జరగదు. కోవిడ్‌ చాలా నిర్లిప్తతను ఇస్తోంది. కాని నిర్లిప్తత వల్ల చనిపోయినవారు తిరిగి రారు. బతికి ఉన్నవారు నష్టపోతారు. ఒక్క పలకరింపు దీనికి సరైన వేక్సిన్‌.

సందర్భం – 3:
శ్రీలత ఐటి ఎంప్లాయి. భర్త కూడా అదే రంగం. కోవిడ్‌ వచ్చినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇరువురికీ రాలేదు. కాని రోజూ పేపర్‌లో వార్తలు శ్రీలత మీద చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన పసిపిల్లలను చూస్తే ఆమె కళ్లు ధారాపాతంగా కారేవి. ఏమిటి ఈ జీవితం అని ఆమెకు అనిపించేది. ఇంతటి విషాదం ఆ పిల్లలకు దేవుడు ఎందుకిచ్చినట్టు అని విరక్తి అనిపించేది. ఆమె చాలా డిప్రెస్‌ అయిపోయింది. చుట్టూ ఉన్న సమాజం ఇంత కష్టాల్లో ఉంటే నిస్సహాయంగా చూడాల్సి వస్తోందని చాలా ముభావం అయిపోయింది. పైకి ఆమె ఉద్యోగం చేసుకుంటోంది.. కుటుంబం బాగుంది అనుకోవచ్చు. మానసికంగా ఇలా తీవ్రమైన వేదన అనుభవించేవారు ఉంటారు. వారిని కూడా సరిగ్గా పలకరించడం, భవిష్యత్తు మీద ఆశ కల్పించడం అవసరం. ‘ఎలా ఉన్నావు?’ అని అడిగితే ‘బానే ఉన్నాను’ అని చెప్పాక ఫోన్‌ పెట్టేయడం పలకరింత కాదు. లోలోపలి గడ్డకట్టిన నెగెటివ్‌ భావనలను బద్దలు కొట్టగలగాలి. ఇందుకు సమయం పెట్టాలి. కన్సర్న్‌ చూపించాలి. లేకుంటే ఆ నిర్లిప్తత బావి లోపలికి లాగుతూనే ఉంటుంది.

ఫోన్లు కలిసి మాట్లాడుకునే సందర్భాలను ఎలా అయితే తగ్గించాయో వాట్సప్‌ వచ్చి ఫోన్‌ మాట్లాడుకునే సందర్భాలను తగ్గించాయి. కోవిడ్‌ సమయంలో సమాజంలో అత్యంతగా మాటల ముభావం నడిచిందని చెప్పాలి. ఏదైనా పలకరింతకు వాట్సప్‌ను ఎక్కువగా ఉపయోగించారు. కోవిడ్‌ బారిన పడిన వారు ఓపిక లేక ఫోన్లు ఎత్తలేదు. ఆ పేషెంట్స్‌ను అటెండ్‌ చేస్తున్నవాళ్లు ఆందోళన వల్ల బిజీ వల్ల ఫోన్లు ఎత్తలేదు. మాటకు మాట వినిపిస్తే వచ్చే ధైర్యం వేరు. కోవిడ్‌ ఉధృతి ఉన్న రోజుల్లో కనీసం ఈ మాట్లాడుకునే ఉత్సాహం కూడా పరస్పరం కరువైందన్నది వాస్తవం. ఎలాగూ కోవిడ్‌ వల్ల ఒకరి ఇంటికి మరొకరు రావడం లేదు. ఒకరి స్పర్శ మరొకరికి అంటడం లేదు. మనిషి కనిపించినా ముఖం కనిపించక ‘మాస్క్‌’ అడ్డం కావడం వల్ల ఆ ఆత్మీయత తాలుకు గాఢత సగం తగ్గిపోతోంది. దానికి తోడు ‘మాట’ కూడా తగ్గిపోతే అందరం ప్రమాదంలో పడతాం. 


బాధ్యతే బంధం
కోవిడ్‌ అనంతరం మనం ఎవరినైనా పలకరిస్తున్నాం అంటే వారి బాధ్యత మనం తీసుకుంటున్నట్టు. లేదా మన బాధ్యత వారికి అప్పజెప్తున్నట్టు. ఆ స్థాయి స్నేహితులుగా, బంధువులుగా, ఆత్మీయులుగా మనం మారకపోతే సమాజం పూర్తిగా కోలుకోవడం కష్టం. పైపై పెదాల మాటలు ఇప్పుడు వృధా. ప్రతి ఒక్కరికి లోతైన కష్టం ఉంది. మానసిక, భౌతిక, ఆరోగ్యపరమైన నష్టాలు ప్రతి కుటుంబం చవిచూసింది. దానికి ఏ విధంగా చేయూతనివ్వొచ్చో పరస్పరం తప్పనిసరిగా ఆలోచించాలి. మనం డబ్బు సహాయం చేయలేకపోతే మాట సహాయం తప్పనిసరిగా చేయగలగాలి. ఇంట్లోకి వెళ్లలేకపోతే గడప దాకా వెళ్లి డజను అరటిపండ్లు ఇవ్వగలగడం కూడా సంజీవిని కంటే తక్కువ కాదు. మనిషికి మనవాళ్లు ఉన్నారు మన కోసం నిలబడతారు అనే భావనే సగం బలం. చాలామందిమి అలా నిలబడలేకపోవచ్చు... కాని అలా నిలబడతామన్న భరోసా అన్నా ఇవ్వాలి. ముఖ్యంగా కరోనా బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన వారిని కచ్చితంగా గమనించుకోవాలి. వారికి అప్పు ఇచ్చినవారు ఎవరు, వారు రేపెప్పుడైనా వొత్తిడి పెడతారా, వీరు దానిని తీర్చడం గురించి ఏం మార్గాలు ఉన్నాయి... చర్చించి వీలైన సలహా సహకారం అందించగలిగే స్థాయిలో మన వారితో మన అనుబంధం ఉండాలి. థర్డ్‌ వేవ్‌ రాకూడదనే ఆశిద్దాం. ఇప్పుడు ఒక నెల రెండు నెలల విరామం దొరికేలా ఉంది. కనుక కోవిడ్‌ తుఫాను తాకిడికి చెల్లాచెదురైన స్నేహితులు, ఆత్మీయులు, బంధువులలో మనకు విలువైనవారిని, మనం విలువైనవారుగా భావించేవారిని ‘పూర్తిగా పలకరించే’ బాధ్యతను మనం తీసుకోవాలి.లేకుంటే కోవిడ్‌ చేసిన నష్టం కంటే కోవిడ్‌ అనంతర పరిస్థితులు చేసే నష్టం ఎక్కువగా ఉంటుంది. అది మంచిది కాదు.
– సాక్షి ఫ్యామిలీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement