ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి | old memories of college days | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి

Published Sat, Aug 3 2024 10:06 AM | Last Updated on Sat, Aug 3 2024 10:06 AM

old memories of college days

‘పక్కింట్లో సుజాత నాతో కాలేజ్‌కొచ్చేది ఇప్పుడు ఎక్కడుందో’ ‘డిగ్రీ లాస్ట్‌ ఎగ్జామ్‌లో చూశాను సంధ్యను. మళ్లీ కాంటాక్ట్‌ లేదు’ ‘పెళ్లయ్యాక రెండుమూడుసార్లు మాట్లాడింది మాలతి. చూసి ఎన్నాళ్లయ్యిందో’స్త్రీల మధ్య ఏర్పడే గాఢమైన స్నేహాలు ఎప్పుడో ఒకసారి తెగిపోవడమే జరుగుతుంది. ఫ్రెండ్‌షిప్‌ డే నాడు స్త్రీలు తమ ఆత్మీయ స్నేహితురాళ్లను తలుచుకోవడమే తప్ప కలుసుకునే వీలెక్కడ? కాని నాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి కదా.

చిన్నప్పుడు ఆడపిల్లలు జట్టు కడతారు. అరుగుల మీద ఆటలాడతారు. స్కూల్‌ నుంచి రాగానే గబగబా స్నానాలు ముగించి కూడబలుక్కుని ట్యూషన్లకు నడుస్తారు. ఆదివారం వస్తే కలిసి పూలు కోసుకుంటారు. రేడియోలో ΄ాటలు... దూరదర్శన్‌లో చిత్రహార్‌లు ...స్నేహితురాలి కుటుంబంతో సినిమా కు వెళ్లడం లేదా తన కుటుంబంతో స్నేహితురాలిని తీసుకెళ్లడం... ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత కబుర్లు.. రహస్యాలు... వెంటబెట్టుకెళ్లి చేసే బట్టల సెలక్షన్‌లు... జామెట్రీ బాక్స్‌లో దాచిన చిరుతిండ్ల పంపకాలు... ఇవన్నీ గొప్ప ఆనందాలు... శాశ్వతం అనిపిస్తాయి. కాని కుదరదు. చాలామందికి ఆ స్నేహం అసంపూర్ణమే.

వివాహం ఒక పునరావాసం
పెళ్లయ్యాక స్త్రీ భర్త ఇంటికి చేరుతుంది. భర్తది అదే ఇల్లు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా. కాని అమ్మాయికి పెళ్లికి ముందు ఒక ఇల్లు. పెళ్లి తర్వాత ఒక ఇల్లు. పుట్టింటి వాళ్లు తమ కూతురి స్నేహాలను ప్రోంత్సహిస్తారు. ఆమె స్నేహితురాళ్లను తమ ఇంటి ఆడపిల్లల్లా చూస్తారు. వారికి ఎప్పుడూ స్వాగతం ఉంటుంది. కాని పెళ్లి అమ్మాయిని ‘పరాయి ఇంటి’కి చేరుస్తుంది. ఆ పరాయి ఇంట్లోకి పెళ్లికూతురి స్నేహితురాలు స్వతంత్రించి వెళ్లలేదు. అందుకు భర్త అనుమతి అత్తామామల అనుమతి కావాలి. అది అంత సులభం కాదు.

కుటుంబమే ముఖ్యం
స్త్రీ ఇంటి పట్టున ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా కుటుంబం మొదటి ప్రాధాన్యం అవుతుంది. పిల్లలు పుట్టాక స్త్రీ అన్నీప్రాధాన్యాలనూ వెనక్కు నెట్టి పిల్లల బాధ్యత ప్రథమంగా తీసుకుంటుంది. ఆమెకు సమయం చిక్కదు. ఆమె తన స్నేహితురాళ్లతో ఫోన్‌ మాట్లాడటం ఒకోసారి అభ్యంతరకరం కూడా కావచ్చు. ‘ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. కాని ఎప్పుడు చెప్పుకోవడం. ఎన్నోసార్లు కలవాలని 
ఉంటుంది. కాని ఎలా కలవడం?’

అతడిలా ప్రయాణం కట్టడం
భర్తకు విసుగు కలిగితే తన స్నేహితులను తీసుకొని అలా ఒక టూర్‌కు వెళతాడు. భార్య అలా తన స్నేహితురాళ్లతో వెళ్లలేదు. సామాజిక భద్రత సంగతి ఒక కారణమే అయినా అసలు అలాంటి వీలు కూడా ఉండదు చాలాసార్లు. తన స్నేహితులు వస్తే భార్యను పరిచయం చేసి వారికి టీలు కాఫీలు భోజనాలు భార్య చేత ఏర్పాటు చేయించే భర్త ‘నీ స్నేహితురాళ్లను నువ్వూ ఆహ్వానించుకోవచ్చు’ అని అనడం చాలా తక్కువగా జరుగుతుంది. విచిత్రమేమంటే మధ్య వయసు దాటాకే స్త్రీలు తమ పాత స్నేహితురాళ్లను కలిసే అనుమతి ΄÷ందుతారు. లేదా పిల్లల ద్వారా స్నేహాన్ని పునరుద్ధరించుకుంటారు.

స్నేహం అవసరం
ప్రతి మనిషికీ స్నేహం అవసరం. భర్త, పిల్లలు, బంధువులు ఎందరు ఉన్నా ప్రతి స్త్రీకి తన చిన్ననాటి, కాలేజీ నాటి, ఊరి స్నేహితురాళ్లు తప్పక అవసరమే. వారితో పంచుకునే విషయాలు. వారి ద్వారా ΄పోందే ఓదార్పు, వారి నుంచి పోందే సలహాలు, వెళ్లబోసుకోవడాలు... ఇవన్నీ స్త్రీలు అలసిపోకుండా చూస్తాయి. కాని దురదృష్టవశాత్తు మన దేశంలో స్నేహమంటే పురుషుల స్నేహమే. స్నేహగాథలన్నీ వారివే. కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉండే స్త్రీ కూడా తన పాత స్నేహితురాలు కనిపిస్తే నవ్వే నవ్వు, కార్చే ఆనందబాష్పాలు పూర్తిగా ప్రత్యేకం. ఆ నవ్వు ఆనందబాష్పాలు వారికి దక్కాలని ఈ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా కోరుకుందాం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement