ప్రాచీన నాగరికతలలో రకరకాల రత్నాలు వినియోగంలో ఉండేవి. సాధారణంగా సానుకూల ఫలితాలను ఇస్తాయనే నమ్మకంతోనే ప్రాచీనులు రత్నాలను ధరించేవారు. దోషభరితమైన రత్నాలను ధరించినప్పుడే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని నమ్మేవారు. దోషాలు లేకుండా ఎలాంటి రత్నమైనా ధరించదగ్గదేనని భావించేవారు. దోషాలతో నిమిత్తం లేకుండా ప్రాచీనులలో కొందరిని భయపెట్టిన రత్నం ఒకటి ఉండేది. అదే ‘ఓనిక్స్’. పురాతన సంస్కృత గ్రంథాలు దీనిని గోమేధకభేదంగా, శివధాతువుగా, పీతరత్నంగా పేర్కొన్నాయి. ‘ఓనిక్స్’ జాతికే చెందిన ‘హేసొనైట్ సార్డోనిక్స్’ను మన ప్రాచీనులు ‘గోమేధికం’గా నవరత్నాల జాబితాలో చేర్చారు.
‘ఓనిక్స్’ గోమేధికం కంటే కొంత భిన్నమైన రత్నం. అంతర్గతంగా సూక్ష్మస్ఫటికాలు కలిగిన క్వార్ట్, సిలికా, మోగనైట్ ఖనిజాలతో కూడిన ఖనిజ శిలల నుంచి ‘ఓనిక్స్’ రత్నాలు ఏర్పడతాయి. మోహ్స్ స్కేలుపై ‘ఓనిక్స్’ దారుఢ్యం 6.5–7.0 వరకు ఉంటుంది. ఇవి రకరకాల రంగుల్లో దొరుకుతాయి. అయితే, వీటిలో నలుపురంగులోనివి కొంత విరివిగా దొరుకుతాయి. ఓనిక్స్ రత్నాలను సానబెడితే చాలా నునుపుగా తయారవుతాయి. వీటిని కోణాలుగా తీర్చిదిద్ది సానబెట్టడం కొంత తక్కువే. ముడి ఖనిజం నుంచి కాస్త పెద్దసైజు రత్నాలుగా కూడా ఇవి దొరుకుతాయి. అందువల్ల శిల్పాలు చెక్కడానికి, వీటి ఉపరితలంపై చిత్రాలు చెక్కడానికి, తొలిచి పాత్రలు వంటి గృహోపకరణాలను తయారు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతల ప్రజలు వీటితో మలచిన శిల్పాలను, రకరకాల గృహోపకరణాలను తయారుచేసుకుని వినియోగించేవారు.
ప్రాచీన చైనా ప్రజలు ‘ఓనిక్స్’ రత్నాలను దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. ముఖ్యంగా గాఢమైన నలుపు రంగులోని ఓనిక్స్ రత్నాలను ధరించడానికి వెనుకాడేవారు. విశేషమేమిటంటే, విదేశాలకు నౌకలలో వెళ్లే చైనా వర్తకులు మిగిలిన రత్నాలతో పాటు ఓనిక్స్ రత్నాలతోనూ వ్యాపారం చేసేవారు. మిగిలిన రత్నాలను తిరిగి వచ్చేటప్పుడు స్వదేశానికి తీసుకొచ్చేవారు గాని, ఓనిక్స్ రత్నాలను స్వదేశానికి రాక ముందే అయినకాడికి అమ్మేసేవారు. నలుపు రంగు ఓనిక్స్‌కు అరబిక్ భాషలో ‘ఎల్ జజా’ అనే పేరు ఉంది. అంటే, విషాదం అని అర్థం. విక్టోరియన్ కాలంలో బ్రిటన్‌లో ప్రముఖుల అంత్యక్రియలకు హాజరయ్యేవారు జెట్‌తో పాటు నలుపు రంగు ఓనిక్స్‌తో తయారైన ఆభరణాలను సంతాప సూచకంగా ధరించేవారు.
ప్రేమ తాపాన్ని ఉపశమింపజేసేందుకు ప్రాచీన భారతీయులు ఓనిక్స్ రత్నాలను ధరించేవారని పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి గిరొలామో కార్దానో తన గ్రంథంలో రాశాడు. విపరీతమైన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచడానికి ఓనిక్స్ రత్నం బాగా పనిచేస్తుందని కొందరు ప్రాచీనులు నమ్మేవారు. అయితే, ఇది జీవనోత్సాహాన్ని కూడా తగ్గించి, దిగులు గుబులు పెంచుతుందని చాలామంది ఈ రత్నాన్ని ధరించడానికి భయపడేవారు. నల్లని ఓనిక్స్ రత్నాలకు ప్రేతాత్మలను ఆకర్షించే లక్షణం ఉందనే నమ్మకం కూడా అప్పట్లో బలంగా ఉండేది. ఓనిక్స్ రత్నాలకు సంబంధించి కొన్ని సానుకూల నమ్మకాలు కూడా ఉండేవి.
ప్రాచీన రోమన్ సైనికులు ఓనిక్స్ రత్నాలపై యుద్ధాలకు అధిష్ఠాన దేవుడైన ‘మార్స్’ రూపాన్ని చెక్కించి, లాకెట్‌లా ధరించేవారు. దీనివల్ల యుద్ధంలో గెలుపు సాధించగలమని వారు నమ్మేవారు. నలుపురంగు ఓనిక్స్ రత్నాన్ని ధరించడం వల్ల మూర్ఛవ్యాధి తగ్గుతుందని పర్షియన్లు నమ్మేవారు. ప్రాచీనకాలం నుంచి వివిధ దేశాల్లో ఓనిక్స్ రత్నాలు వాడుకలో ఉన్నప్పటికీ, వీటి శిల్పాలు, గృహోపకరణాలతో పోల్చితే, ఆభరణాల్లో వీటి వినియోగం చాలా తక్కువగానే ఉండేది. నల్లని ఓనిక్స్ రత్నాలకు పూసల్లా రంధ్రాలు చేసి, వాటిని కూర్చిన దండలను ప్రాచీన, మధ్యయుగాల కాలంలో ఎక్కువగా మంత్రగాళ్లు, మంత్రగత్తెలు ధరించేవారు. ఆధునిక ఫ్యాషన్‌రంగంలో మార్పులు మొదలైన తర్వాతనే జనాలు ఓనిక్స్ రత్నాలను కాస్త ధైర్యంగా ఆభరణాల్లో ధరించడం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment