ఆస్ట్రేలియాలోని ఆ ఊళ్లోకి అడుగుపెడితే, పాతాళలోకంలోకి ప్రవేశించినట్లే ఉంటుంది. అక్కడి కట్టడాలన్నీ నేలకు దిగువన నిర్మించుకున్నవే! ఇళ్లు, హోటళ్లు, పబ్బులు, ప్రార్థన మందిరాలు– అన్నీ నేలకు దిగువనే ఉంటాయి. బయటి నుంచి చూస్తే, వాటి పైకప్పులన్నీ చిన్న చిన్న గుట్టల్లా కనిపిస్తాయి. అక్కడ నేల మీద నడవాలంటే, ఆచి తూచి అడుగులేయాలి. ఎందుకంటే అడుగడుగునా గోతులు ఉంటాయి. ఆ గోతులకు రక్షణగా ఎలాంటి కంచెలు ఉండవు. కాకుంటే, అక్కడక్కడా ఆచి తూచి నడవాలనే హెచ్చిరిక బోర్డులు కనిపిస్తాయి.
ఈ విచిత్రమైన ఊరు దక్షిణ ఆస్ట్రేలియాలో అడిలాయిడ్ నగరానికి వాయవ్యాన 846 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరి పేరు కూబర్ పెడీ. పాతాళ గృహాలు మాత్రమే కాదు, ఈ ఊరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది ‘ఓపల్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అత్యంత విలువైన ‘ఓపల్’ రత్నాలు దొరుకుతాయి. ఈ ఊరి పరిధిలో దాదాపు డెబ్భైకి పైగా ఓపల్ గనులు ఉన్నాయి. ఊరి జనాభాలో ఎక్కువ మంది ఈ గనుల్లో పనిచేసే వారే! గని కార్మికులు, ఇంజినీర్లు, వారి అవసరాల కోసం ఏర్పడిన దుకాణాలు, హోటళ్లు, పబ్బులు, చర్చిలు ఈ ఊళ్లో కనిపిస్తాయి. ఇక్కడి గనుల్లో అత్యంత నాణ్యమైన ఓపల్ రత్నాలు దొరుకుతాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది.
గనులు ఉన్న ఊళ్లు ప్రపంచంలో ఎన్నో ఉన్నా, ఇక్కడ ఉన్నట్లుగా మరెక్కడా పాతాళగృహాలు ఉండవు. మరి ఇక్కడి జనాలు ఎందుకలా నేల అడుగున ఇళ్లు కట్టుకున్నారనే అనుమానం ఎవరికైనా రావచ్చు. కూబర్ పెడీ ఎడారి ప్రాంతంలో వెలసిన ఊరు. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మరీ దుర్భరంగా ఉంటాయి. సాధారణంగా 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంటాయి. ఒక్కోసారి 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎండల ధాటిని తట్టుకుని, బతికి బట్టకట్టడానికే ఇక్కడి జనాలు ఇలా నేల అడుగున కట్టడాలను నిర్మించుకున్నారు.
ఈ ఊరి ఉపరితలం కంటే, నేల అడుగునే చల్లగా ఉంటుంది. దాదాపు శతాబ్దకాలంగా ఇక్కడ ఓపల్ గనుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఊరి జనాభా రెండున్నర వేలకు పైగా ఉంది. వీరిలో ఎనభై శాతం మంది గనులకు సంబంధించిన వారే! ఆస్ట్రేలియాలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే, ఇక్కడి ఇళ్ల ధరలు కారుచౌక. ఈ ఊళ్లో మూడు పడక గదుల పాతాళగృహం ధర 41 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.21.83 లక్షలు) మాత్రమే! అయితే, ఇక్కడి వాతావరణం కారణంగా ఈ ఊళ్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడానికి ఎవరూ ఇష్టపడరు.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment