విటమిన్‌ ట్యాబ్లెట్లు వాడితే మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి? | Over Vitamins Can Cause Health Issues | Sakshi
Sakshi News home page

విటమిన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి?

Published Sun, Feb 12 2023 1:28 AM | Last Updated on Sun, Feb 12 2023 8:54 PM

Over Vitamins Can Cause Health Issues - Sakshi

ఇటీవల మనందరిలో పెరిగిన ఆరోగ్యస్పృహ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రయత్నంలో ‘విటమిన్ల’ కోసం సప్లిమెంట్లు అతిగా తీసుకునేవారూ ఉన్నారు. జీవక్రియల కోసం విటమిన్లు కీలకమే. కానీ ‘ఆరోగ్య స్పృహ’ అంటూ అతిచేయడంతో విటమిన్ల మోతాదు పెరిగి ‘హైపర్‌ విటమినోసిస్‌’ కు గురయ్యే ప్రమాదమూ ఉంది. ఆ  అనర్థాలేమిటో తెలిపే కథనమిది. 

మోతాదుకు మించి విటమిన్లు తీసుకోవడం వల్ల ‘హైపర్‌ విటమినోసిస్‌’ అనే కండిషన్‌ వస్తుందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కండిషన్‌ను ‘విటమిన్‌ టాక్సిసిటీ’గా కూడా పేర్కొంటున్నారు. 

నీటిలో కరిగేవాటికంటే... ఫ్యాట్‌లో కరిగేవే డేంజర్‌
విటమిన్లలో ఏ, బీ కాంప్లెక్స్, సీ, డీ, ఈ, కే అనే విటమిన్లు ఉంటాయి. వీటిల్లో  ‘ఏ, డీ, ఈ, కే’ అనేవి కొవ్వు (ఫ్యాట్‌)లో  కరిగితేనే దేహంలోకి ఇంకుతాయి. ఇక విటమిన్‌ ‘బీ–కాంప్లెక్స్‌’తో పాటు విటమిన్‌ ‘సీ’ మాత్రం నీళ్లలో కరుగుతాయి.  ఈ బీ కాంప్లెక్స్, సీ విటమిన్లు నీళ్లలో కరగడం వల్ల కాస్త ఎక్కువైనా...  మూత్రంతో పాటు బయటకు తేలిగ్గా వెళ్తాయి. దాంతో హానికి పెద్దగా అవకాశం ఉండదు. కానీ సమస్యల్లా విటమిన్‌ ఏ, డీ, ఈ, కే లు కొవ్వుల్లో కరగడం వల్ల... వీటి మోతాదు పెరిగినప్పుడు అంత తేలిగ్గా బయటకు వెళ్లడం సాధ్యపడదు. దాంతో ఎక్కువైనప్పుడు కొన్ని అనర్థాలు తెచ్చిపెడతాయి. 

విటమిన్‌–ఏ పెరిగితే...
విటమిన్‌–ఏ లోపిస్తే రేచీకటి వంటి సమస్యలు వస్తాయి. విటమిన్‌– ఏ పెరగడం వల్ల ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), వికారం లేదా వాంతులు, తలనొప్పి, కండరాల–కీళ్ల  నొప్పులు, మరీ మోతాదు ఎక్కువైతే కాలేయం తన విధులు నిర్వర్తించలేకపోవడం వంటి అనర్థాలు వస్తాయి. 

విటమిన్‌–డీ ఎక్కువైతే...
ఆరుబయట చేసే ఉద్యోగాలు బాగా తగ్గడం, దాదాపుగా అందరూ ఆఫీసుల (ఇన్‌డోర్స్‌)కే పరిమితం కావడంతో ఇటీవల మన దేశంలో విటమిన్‌ ‘డీ’ లోపం బాగానే పెరిగింది. ఒక దశలో విటమిన్‌–డీ లోపం కేసులు చాలా పెద్ద సంఖ్యలో రావడంతో చాలామంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విటమిన్‌–డీ సప్లిమెంట్లను ఇవ్వడం మొదలుపెట్టారు. డీ–విటమిన్‌ ఎక్కువైతే అది రక్తంలో క్యాల్షియమ్‌ మోతాదుల్ని పెంచుతుంది ఫలితంగా కుంగుబాటు (డిప్రెషన్‌) వంటి కొన్ని మానసిక సమస్యలు కనిపించవచ్చు.

అలాగే తలనొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ, జీర్ణవ్యవస్థకు (గ్యాస్ట్రో ఇంటస్టినల్‌) సమస్యలు రావచ్చు. అంటే ఉదాహరణకు వికారం, వాంతులు, మలబద్ధకం, కడుపునొప్పి వంటివి కనిపించే అవకాశాలున్నాయి. ఇక మూత్ర వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు... అంటే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం, మూత్రపిండాల్లో క్యాల్షియమ్‌ ఎక్కువగా చేరే ‘నెఫ్రోక్యాల్సినోసిస్‌’ వంటి సమస్యలూ రావచ్చు. ఫలితంగా కిడ్నీ పనితీరు దెబ్బతినేందుకు అవకాశాలుంటాయి.

విటమిన్‌–ఈ పెరగడం వల్ల
దేహాన్ని అందంగా ఉంచడంతో పాటు కొంతమేరకు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే ఇదే విటమిన్‌ దేహంలో పెరగడం వల్ల... అది మరో విటమిన్‌ అయిన విటమిన్‌–కే చేయాల్సిన విధుల్ని దెబ్బతీస్తుంది. దాంతో తేలిగ్గా రక్తస్రావం జరగడానికీ, అంతర్గత రక్తస్రావాలకూ అవకాశం ఏర్పడుతుంది.

విటమిన్‌–కే పెరుగుదలతో దుష్ప్రభావాలివి... 
దేహంలో విటమిన్‌–కే పెరగడం అన్నది చాలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అయితే ఇలా పెరగడం వల్ల కామెర్లు, హీమోలైటిక్‌ అనీమియా వంటి కండిషన్లు ఏర్పడతాయి. 

చికిత్స : సమస్య నిర్ధారణలో హైపర్‌ విటమినోసిస్‌ వల్ల వచ్చిన అనర్థమే అన్నది చాలా కీలకం. దేహంలో ఏ విటమిన్లు ఎక్కువయ్యాయో దాన్ని బట్టి నిర్దుష్టమైన చికిత్స ఉంటుంది. ఉదాహరణకు విటమిన్‌–ఏ ఎక్కువైతే... దానికి విరుగుడుగా మూత్రం ఎక్కువగా వచ్చేందుకు ఉపకరించే ‘ఎసెటజోలమైడ్‌’ వంటి మాత్రలు సూచిస్తారు. ∙విటమిన్‌–డీ పెరిగినట్లు తెలిస్తే... దానికి విరుగుడుగా దేహంలోని క్యాల్షియమ్‌ మోతాదులు తగ్గించేందుకు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్‌ ఇవ్వడం, చాలా ఎక్కువ మోతాదులో మూత్రం వచ్చేందుకు వాడే ‘లూప్‌ డైయూరెటిక్స్‌’ వంటివి వాడతారు.

అలాగే క్యాల్షియమ్‌ మోతాదులు తగ్గించేందుకు కల్సిటోనిన్‌ వంటి ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రేలు, బిస్ఫాస్ఫోనేట్‌ వంటివి ఇస్తారు.

► విటమిన్‌–ఈ పెరిగినట్లు నిర్ధారణ అయితే రక్తస్రావాలు, అంతర్గత రక్తస్రావాలు నివారించేందుకు విటమిన్‌–కే, ఎఫ్‌ఎఫ్‌పి (ఫ్రెష్‌ ఫ్రోజెన్‌ ΄్లాస్మా) వంటి ప్రక్రియలు చేస్తారు.

► విటమిన్‌–కే పెరిగినట్లు తెలిస్తే... దాని అనర్థాలు నివారించేందుకు వార్‌ఫేరిన్‌ వంటి మందులు లేదా కామెర్లకు వాడే మందులు ఉపయోగిస్తారు.

నివారణ : దేహంలోని జీవక్రియలకు ఎంతో కీలకమైన విటమిన్లు చాలావరకు మనం తీసుకునే సమతులాహారంతోనే సమకూరుతుంటాయి. నిర్దుష్టంగా ఏవైనా విటమిన్‌ లోపాల వల్ల వచ్చే లక్షణాలను కనుగొంటే డాక్టర్లు వీటిని సూచిస్తారు. అంతేతప్ప... విటమిన్లు పెరిగితే ఆరోగ్యమూ పెరుగుతుందనే అపోహతో ‘ఆన్‌ కౌంటర్‌ మెడిసిన్‌’లలా విటమిన్‌ సప్లిమెంట్లు వాడటం ఎంతమాత్రమూ సరికాదు. 
- డాక్టర్‌ కె. శివరాజు ,సీనియర్‌ ఫిజీషియన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement