
ప్యాలెస్ ఆన్ వీల్స్’ లోపలి దృశ్యాలు
ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో వారం రోజుల ప్రయాణం. ఇది ప్రయాణం మాత్రమే కాదు... ఒక అనుభూతి. రాజస్థాన్ కోటలను చూడాలి... థార్ ఎడారిలో విహరించాలి. రాజపుత్రులు మెచ్చిన జానపద కళల ప్రదర్శనలను ఆస్వాదించాలి.ఇవన్నీ మామూలుగా కాదు... సకల మర్యాదలతో రాజసంగా ఉండాలి.పర్యటన ఆద్యంతం కాలు కింద పెట్టకుండా సౌకర్యంగా ఉండాలి. రాజస్థాన్ టూరిజం... సామాన్యులకు రాజలాంఛనాలను అందిస్తోంది. ఇందుకోసం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక రైలునే సిద్ధం చేసింది. ఇది టూర్ మాత్రమే కాదు... ఇది ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్.ఇంకెందుకాలస్యం... ట్రైన్ నంబర్ 123456... ప్లాట్ మీదకు వస్తోంది... లగేజ్‌తో సిద్ధంగా ఉండండి.
రాజస్థాన్ పర్యాటకం రాజసంగా ఉంటుంది. సాధారణ ప్యాకేజ్‌లు క్లస్టర్‌లుగా కొన్ని ప్రదేశాలనే కవర్ చేస్తుంటాయి. పింక్‌సిటీ, బ్లూ సిటీ, గోల్డెన్ సిటీ, లేక్ సిటీలన్నింటినీ కవర్ చేయాలంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ సౌకర్యంగా ఉంటుంది. 7 రాత్రులు 8 రోజుల ప్యాకేజ్‌లో రైలు న్యూఢిల్లీ సఫ్దర్ గంజ్ స్టేషన్‌లో మొదటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుంది. 8 రోజు ఉదయం ఏడున్నరకు అదే స్టేషన్‌లో దించుతుంది.
ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్‌లో జయ్‌పూర్, సవాయ్ మాధోపూర్, చిత్తోర్‌ఘర్, ఉదయ్‌పూర్, జై సల్మీర్, జో«ద్‌పూర్, భరత్‌పూర్, ఆగ్రాలు కవర్ అవుతాయి. ఈ పర్యాటక రైలు 1982, జనవరి 26 నుంచి నడుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో టూరిజమ్ ప్రమోషన్ కోసం ఇండియన్ రైల్వేస్– రాజస్థాన్ టూరిజమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టూర్ విదేశీయులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పర్యటిస్తున్నారు.
తొలిరోజు: ఢిల్లీ టూ జయ్‌పూర్
పర్యాటకులకు రాజపుత్రుల సంప్రదాయ రాచమర్యాదలందిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రైల్వే స్టేషన్‌కి చేరగానే రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతారు. పూలమాల వేసి, బొట్టు పెట్టి, గంధం రాస్తారు. షెహనాయ్ రాగం, కచ్చీఘోదీ నాట్యం, ఏనుగు అంబారీల మధ్య రిఫ్రెష్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింకులు, బార్) తో వెల్కమ్ చెబుతారు. పర్యాటకులు ఎవరికి కేటాయించిన గదిలోకి వాళ్లు వెళ్లిన తర్వాత ఆరున్నరకు రైలు ఢిల్లీ స్టేషన్ నుంచి పింక్‌సిటీ జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు రైల్లో విందు భోజనం ఇస్తారు.
రెండవ రోజు: జయ్‌పూర్ టూ సవాయ్ మాధోపూర్
అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ట్రైన్ జయ్‌పూర్‌కి చేరుతుంది. పర్యాటకులు నిద్రలేచి రిఫ్రెష్ అయిన తర్వాత ఏడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ఎనిమిది గంటలకు రైలు దిగి (లగేజ్ రైల్లోనే ఉంటుంది) సైట్ సీయింగ్ కోసం ఏర్పాటు చేసిన వాహనాల్లోకి మారాలి. నగరంలో ఆల్బర్ట్ హాల్, హవామహల్, సిటీ ప్యాలెస్, జంతర్‌మంతర్ (ఖగోళ పరిశోధనాలయం)ని చూడడం. మధ్యాహ్నం లోహగర్ ఫోర్ట్‌లోని రిసార్ట్‌కు తీసుకెళ్తారు. లంచ్ అక్కడే. ఆ తర్వాత సూర్యాస్తమయంలోపు అమేర్ ఫోర్ట్ విజిట్, షాపింగ్ పూర్తి చేసుకుని ఆరు గంటలకు ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. ఏడు గంటల తర్వాత రాజస్థాన్ సంప్రదాయ వంటకాలతో డిన్నర్. ప్రయాణం సవాయ్ మాధోపూర్‌కు సాగుతుంది.
మూడవ రోజు: మాధోపూర్ టూ చిత్తోర్‌ఘర్
తెల్లవారు జామున ఐదు గంటల లోపు సవాయ్ మాధోపూర్ చేరుతుంది. రిఫ్రెష్ అయి ఆరు గంటలకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్క్, రణతంబోర్ ఫోర్ట్ విజిట్‌కి వెళ్లాలి. నేషనల్ పార్క్ పర్యటన పూర్తి చేసుకుని పదింటికి ట్రైన్ ఎక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. రైలు చిత్తోర్‌ఘర్ వైపు సాగిపోతుంది. లంచ్ రైల్లోనే. సాయంత్రం నాలుగు గంటలకు చిత్తోర్‌ఘర్ చేరుతుంది. రైలు దిగి సైట్ సీయింగ్‌కి వెళ్లాలి. ఆరు గంటలకు కోట లోపల టీ తాగి, లైట్ అండ్ సౌండ్ షో ను ఆస్వాదించి ఏడున్నరకు రైలెక్కాలి. ఎనిమిది గంటలకు రైల్లోనే డిన్నర్.
నాలుగవ రోజు: చిత్తోర్‌ఘర్ టూ జై సల్మీర్ వయా ఉదయ్‌పూర్
రెండు గంటలకు చిత్తోర్‌ఘర్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకు లేక్‌సిటీ ఉదయ్‌పూర్ చేరుతుంది. రైలు దిగి తొమ్మిదింటికి వాహనంలోకి మారి సైట్‌సీయింగ్, షాపింగ్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒకటిన్నరకు బోట్ రైడ్, ఫైవ్ స్టార్ హోటల్‌లో భోజనం. మూడు గంటలకు తిరిగి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగు గంటలకు జై సల్మీర్‌కు ప్రయాణం. రాత్రి భోజనం రైల్లోనే ఎనిమిది గంటలకు.
ఐదవ రోజు: జై సల్మీర్ టూ జోద్‌పూర్
రైలు ఉదయం తొమ్మిదిన్నరకు జై సల్మీర్‌కి చేరుతుంది. రైలు దిగి గడిసిసార్ సరస్సు. జై సల్మీర్ కోట, నగరంలోని హవేలీలు చూసుకుని షాపింగ్ చేసుకుని తిరిగి రైలెక్కాలి. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత నాలుగు గంటలకు రైలు దిగి ఎడారిలో విహారం, క్యామెల్ రైడ్ ఆస్వాదించాలి. రాజస్థాన్ సంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాల వినోదం, రాత్రి భోజనం కూడా అక్కడే చేసుకుని రాత్రి పది గంటలకు రైలెక్కాలి. పన్నెండు గంటలలోపు రైలు జై సల్మీర్ నుంచి బ్లూ సిటీ జో«ద్‌పూర్‌కు బయలుదేరు
తుంది.

ఆరవ రోజు: జో«ద్‌పూర్ టూ భరత్‌పూర్
రైలు ఉదయం ఏడు గంటలకు జో«ద్‌పూర్‌కు చేరుతుంది. ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎనిమిదిన్నరకు సైట్ సీయింగ్ కోసం రైలు దిగాలి. మెహరాన్‌ఘర్ ఫోర్ట్, జస్వంత్ థాడా, ఉమైద్ భవన్ ప్యాలెస్ మ్యూజియం చూసుకున్న తర్వాత షాపింగ్. ఒకటిన్నరకు బాల్ సమంద్ లేక్ ప్యాలెస్‌లో రాజలాంఛనాలతో విందు భోజనం చేసిన తర్వాత ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగన్నరకు రైలు జో«ద్‌పూర్ నుంచి భరత్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.
ఏడవ రోజు: భరత్‌పూర్ టూ ఆగ్రా
రైలు ఉదయం ఆరు గంటలకు భరత్‌పూర్‌కి చేరుతుంది. వెంటనే సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. ఘనా బర్డ్ సాంక్చురీ విజిట్ తర్వాత ఎనిమిది గంటలకు మహల్ ఖాజ్ ప్యాలెస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి రైలెక్కాలి. పది గంటలకు రైలు ఆగ్రాకు బయలుదేరుతుంది. పదకొండు గంటలకు ఆగ్రా రెడ్ ఫోర్ట్ చూసుకుని ఫైవ్ స్టార్ హోటల్‌లో లంచ్ తర్వాత మూడు గంటలకు తాజ్‌మహల్ వీక్షణం. ఐదున్నర నుంచి షాపింగ్, ఏడున్నరకు రైలెక్కి డిన్నర్ తర్వాత ఎనిమిది ముప్పావుకి ఢిల్లీకి బయలుదేరాలి.
ఎనిమిదవ రోజు: ఆగ్రా టూ ఢిల్లీ
ఉదయానికి రైలు ఢిల్లీకి చేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి, లగేజ్ సర్దుకుని ఏడున్నరకు దిగి ప్యాలెస్ ఆన్ వీల్స్‌కి వీడ్కోలు పలకాలి.
తరగతుల వారీగా ట్రైన్ టికెట్ వివరాలు:
⇒ ప్రెసిడెన్షియల్ సూట్‌లో క్యాబిన్‌కి... 2,67,509 రూపాయలు
⇒ సూపర్ డీలక్స్‌లో క్యాబిన్‌కి... 2,18,207 రూపాయలు
⇒ డీలక్స్ క్యాబిన్ సింగిల్ ఆక్యుపెన్సీ... 1,10,224 రూపాయలు
⇒ డీలక్స్ క్యాబిన్ డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి... 71,712 రూపాయలు
⇒ ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితం. పన్నెండేళ్ల లోపు పిల్లలకు సగం చార్జ్.
⇒ ఒక క్యాబిన్‌లో ఇద్దరికి అనుమతి. పిల్లలను పేరెంట్స్‌తోపాటు అదే క్యాబిన్‌లో అనుమతిస్తారు.
ప్యాలెస్ ఆన్ వీల్స్ మరిన్ని వివరాల కోసం...
Email : palaceonwheels.rtdc@rajasthan.gov.in
Website: Palaceonwheels.rajasthan.gov.in
పులి కనిపించిందా!
ఈ టూర్‌లో రాజస్థాన్ సంప్రదాయ సంగీతం, స్థానిక ఘూమర్, కల్బేలియా జానపద నృత్యాలను ఆస్వాదిస్తూ సాగే కామెల్ సఫారీ, డెజర్ట్ సఫారీలు, క్యాంప్‌ఫైర్ వెలుగులో ఇసుక తిన్నెల మీద రాత్రి భోజనాలను ఆస్వాదించవచ్చు. భరత్‌పూర్‌లోని కెలాడియా నేషనల్ పార్క్‌కి సైబీరియా నుంచి వచ్చిన కొంగలను చూడవచ్చు. ఈ పక్షులు ఏటా సైబీరియా నుంచి ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నవంబర్‌లో ఇక్కడికి వలస వస్తాయి.
మార్చి వరకు ఇక్కడ ఉండి ఏప్రిల్ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి. ఈ కొంగలతోపాటు వందల రకాల పక్షులుంటాయి. రణతంబోర్ నేషనల్ పార్క్‌కు వెళ్లి జీప్ సఫారీ లేదా ఎలిఫెంట్ సఫారీ చేస్తూ పులి కనిపిస్తుందేమోనని రెప్పవేయకుండా కళ్లు విప్పార్చి బైనాక్యులర్‌లో చూసి చూసి... దూరంగా ఎక్కడో పులి అలికిడి కనిపించగానే భయంతో కూడిన థ్రిల్‌తో బిగుసుకు పోవచ్చు.
ఏడు హెరిటేజ్ సైట్‌లను చూడవచ్చు
ప్యాలెస్ ఆన్ వీల్స్ ప్యాకేజ్‌లో యునెస్కో గుర్తించిన ఏడు వరల్డ్ హెరిటేజ్ సైట్‌లు కవర్ అవుతాయి. అవేంటంటే... జయ్‌పూర్‌లోని జంతర్ మంతర్, రణతంబోర్‌లో రణతంబోర్ కోట, చిత్తోర్‌ఘర్‌లో చిత్తోర్‌ఘర్ కోట, జై సల్మీర్‌లో జై సల్మీర్ కోటతోపాటు థార్ ఎడారి, భరత్‌పూర్ కెలాడియో నేషనల్ పార్క్, ఆగ్రాలో తాజ్ మహల్. ఇవన్నీ యునెస్కో గుర్తింపు పొందిన హెరిటేజ్ సైట్‌లు. ఈ గౌరవంతోపాటు తాజ్‌మహల్‌కి ప్రపంచంలోని ఏడు వింతల జాబితాలో కూడా స్థానం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment