ఇటీవల ఆస్కార్ వేడుకలలో నటుడు విల్ స్మిత్ భార్య జాడా స్మిత్ పై వేసిన జోక్ ఎదురు తిరిగింది. స్త్రీలకు వచ్చే అరుదైన సమస్య బట్టతల. జాడా స్మిత్ ఆ సమస్యతో బాధ పడుతోంది. ఇండియాలో కూడా ఈ సమస్యతో బాధ పడుతున్న స్త్రీలు ఉన్నారు. ఆ స్థితిని స్వీకరించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్న వారు ఉన్నారు. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల పరోతిమ గుప్తా తమ జీవితం ఎదుటి వాళ్లకు జోక్ కాదని హెచ్చరిస్తున్నారు.
ఇది ఆమె కథ.
ఆడుతూ పాడుతూ ఉండే పదేళ్ల అమ్మాయి ఉదయాన్నే నిద్ర లేచే సరికి దిండంతా ఆ అమ్మాయి జుట్టుతో నిండిపోయి ఉంటే ఎలా ఉంటుంది?
పరోతిమ గుప్తాకు అలా జరిగింది. అప్పుడు ఆమె వయసు పదేళ్లు. డార్జిలింగ్‌లో బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటోంది. వాళ్ల నాన్న, అమ్మలది కోల్‌కటా. నాన్న టీ ప్లాంటేషన్‌లలో పని చేసేవాడు కాబట్టి ఒక్కోసారి ఒక్కోచోట ఉండాలి కాబట్టి పరోతిమను, ఆమె చెల్లెల్ని బోర్డింగ్ స్కూల్లో ఉంచి చదివించేవారు. పరోతిమ క్లాసులు బాగా చదివేది. డిబేట్‌లు గెలిచేది. స్టేజ్ మీద భయం లేకుండా ఉండేది. అలాంటిది ఒక ఉదయం ఇలా జరిగే సరికి బెంబేలెత్తిపోయింది. తల్లిదండ్రులు వచ్చారు. డాక్టర్ల దగ్గరకు తిరిగారు. ‘ఇలా టైఫాయిడ్ వల్ల జరుగుతుంది’ అన్నాడో డాక్టరు. కాని అప్పటికి పరోతిమకు టైఫాయిడ్ రాలేదు. మరేంటి? చివరకు సిలిగురిలో ఒక డాక్టరు దీనిని ‘అలోపేసియా అరెటా’ (పేనుకొరుకుడు/ఆటోఇమ్యూన్ డిసీజ్) అని కనిపెట్టి వైద్యం మొదలెట్టాడు. అలా పదేళ్ల వయసు నుంచి పరోతిమ జీవితంలో ఒక పెద్ద యుద్ధం మొదలైంది.
మందే లేని జబ్బు
అలోపేసియా వల్ల హఠాత్తుగా జుట్టు రాలిపోతుంది. ఇది తల మీద కొన్ని ప్రాంతాల్లో జరగొచ్చు. పూర్తిగా కూడా జరగొచ్చు. కొన్నిసార్లు కొన్నాళ్ల తర్వాత మళ్లీ జుట్టు వస్తుంది. కొందరికి రాదు. ‘పదేళ్ల వయసు నాకు. ఏమీ అర్థం కాలేదు. డాక్టరు ఎన్నో మందులు రాశాడు. లెక్కలేనన్ని ఇంజెక్షన్లు పొడిచాడు. కొందరేమో ఆయుర్వేద తైలాలు అని, హోమియోపతి మందులు అని. ఎప్పుడూ నా తల మీద అల్లం, వెల్లుల్లి గుజ్జు రాసి ఉండేవారు. ఇంకేవో కంపు కొట్టే నూనెలు. ఎప్పుడూ వాసన కొడుతూ ఉండేదాన్ని. కొన్నాళ్లకు స్కూలుకు వెళ్లాను. అది ఇంకా ఘోరమైన అనుభవం. పిల్లలు నన్ను వెక్కిరించేవారు. కొందరు నాకొచ్చింది అంటువ్యాధి ఏమోనని దగ్గరకు వచ్చేవారు కాదు. స్టేజ్ ఎక్కి నేను ఏదైనా మాట్లాడాలంటే వెళ్లలేకపోయేదాన్ని. మగపిల్లలు నాతో అసలు మాట్లాడేవాళ్లు కాదు. ఇంట్లో బాత్‌రూమ్‌లో దూరి గంటలు గంటలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్, టీచర్లు నాకు గట్టి ధైర్యం చెప్పారు. వాళ్ల వల్ల నిలబడ్డాను’ అంటుంది పరోతిమ.
ఇంటర్‌లో వెలుగు
అయితే పరోతిమ ఇంటర్‌కు వచ్చేసరికి జుట్టు మళ్లీ రావడం మొదలెట్టింది. లోపల ఒకటి రెండు పాచెస్ ఉన్నా కొంచెం కవర్ చేసుకునే విధంగా ఉండేది. పరోతిమ కోల్‌కటాలో డిగ్రీ, పి.జి. చేసింది అక్కడే ఒక డాక్టర్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటూ. ఆ వైద్యం కఠినతరంగా ఉండేది. ఇంజెక్షన్లు ఉండేవి. వాటన్నింటిని ఆమె భరించింది. ఇప్పుడు ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా మారింది. కొత్త ఉద్యోగం. స్ట్రెస్. 2007లో మళ్లీ పూర్తిగా జుట్టు రాలడం మొదలయ్యింది. ‘ఇక ఈ హింస చాలు. నాకు జట్టు లేదు... రాదు అనే స్థితిని నేను స్వీకరించి మిగిలిన జీవితం సాధారణం గా గడపడానికి నిశ్చయించుకున్నాను’ అంటుంది పరోతిమ. ‘నేను నా చెల్లెల్ని తోడు పిలిచాను.
పద నేను గుండు గీయించుకోవాలి అన్నాను. శిరోజాలు లేని నా ముఖాన్ని చూసి తట్టుకోవడానికే నా చెల్లెల్ని తోడు చేసుకున్నాను. కాని శిరోముండనం అయ్యాక నాకు హాయిగా అనిపించింది. ఇక మీదట ఇలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను.’ అందామె. అయితే ఈ ఆకారాన్ని చూసి సానుభూతి, అనవసర ప్రశ్నలు రాకుండా ఉండేందుకు తాను పని చేసే చోటులో అందరికీ ఈమెయిల్ ద్వారా తన అరుదైన జబ్బు గురించి తెలిపి ఆ చర్చను ముగించింది. ‘ఇప్ప టికీ కొందరు వింతగా చూస్తారు. గాంధీలా ఉన్నావ్ అంటారు. ఇలా ఉన్నా నీ లుక్స్ బాగున్నాయి అంటారు. కొందరు నీ తల తాకి చూడమంటావా అంటారు. అందరికీ తగిన సమాధానం చెప్పి ముందుకు పోతుంటాను’ అంటుంది పరోతిమ.
ఆస్కార్ అవార్డ్స్‌లో జాడా స్మిత్ మీద జోక్ వేయడాన్ని ఆమె తప్పు పట్టింది. ‘మా జీవితం ఏ మాత్రం జోక్ కాదు’ అంది. ఎదుటి వాళ్ల వెలితిని హాస్యం చేయకూడని సంస్కారం అందరం అలవర్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment