చదివిన చదువే కాదు మన అభిరుచులూ ఉపాధి వైపుగా కొత్త అడుగులు వేయిస్తాయి. కొంగొత్త ఆలోచనలకు రూపమిస్తాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పూన్‌గోడి రవి విషయంలో ఇదే జరిగింది. పెళ్లయి, పిల్లలు పుట్టాక ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ తయారీని ఎంచుకుంది. ఆశించిన స్థాయిలో బిజినెస్ లేక నిరాశపడినా తర్వాత బొమ్మల తయారీని ఎంచుకుంది. బెంగళూరులో నివాసం ఉంటున్న పూన్‌గోడి దేవతామూర్తులను అందమైన బొమ్మలుగా రూపుకట్టి, అందరి ప్రశంసలతో పాటు ఉపాధినీ పొందుతోంది.
చాలామందిని బార్బీడాల్స్ ఆకట్టుకుంటాయి. బార్బీ డాల్‌ని ఇండియన్ వెర్షన్‌లోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది... అని ఆలోచన చేసింది పూన్‌గోడిరవి. క్లే, రబ్బర్, క్విల్టింగ్ పేపర్ మెటీరియల్‌తో దేవతామూర్తులు, పెళ్ళి, స్త్రీల వేడుకల థీమ్‌తో అందమైన బొమ్మలుగా రూపుకట్టి, మార్కెట్ చేస్తోంది. బొమ్మల తయారీని ఇంట్లోనే స్వయంగా నేర్చుకున్నాను అని చెప్పే ఈ 35 ఏళ్ల గృహిణి మాట్లాడుతూ ‘‘ఆభరణాలు, బొమ్మల తయారీ ఇంట్లోనే నేర్చుకున్నాను.
దేవతామూర్తుల బొమ్మలు తయారు చేసి, దుర్గానవరాత్రులప్పుడు బొమ్మల కొలువు ఏర్పాటు చేశాను. మా బొమ్మల కొలువు చూడటానికి వచ్చిన వారందరూ బొమ్మల గురించి ఎన్నో వివరాలు అడిగారు. అడగడంతో ఈ బొమ్మల తయారీనే వ్యాపారం గా మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది. దీంతో ‘విషురోష్’ పేరుతో దేవతామూర్తుల బొమ్మల తయారీని చేపట్టాను’’ అని వివరించే పూనుగోడి రవి రోజూ నాలుగైదు గంటల సమయాన్ని బొమ్మల తయారీకి కేటాయిస్తుంది.
ఒకటి నుంచి వందలు
దశావతారాలు, అర్ధనారీశ్వరులు, రాధాకృష్ణులు, శేషతల్ప శాయి... ఇలా ఒకటేమిటి అన్ని దేవతా రూపాలు ఆమె చేతిలో అపురూపంగా ఒదిగి పోతాయి. ‘మా కుటుంబంలో ఎవరికీ హస్తకళలపట్ల ఆసక్తి లేదు. నాకూ మూడేళ్ల క్రితం వరకు ఈ ఆలోచనే లేదు. ఒకటి ట్రై చేద్దాం అని మధుర మీనాక్షి అమ్మవారి బొమ్మను రూపొందించాను. చాలా సంతృప్తిగా అనిపించింది. అందుకు తగినట్టు ప్రశంసలూ వచ్చాయి. అటు తర్వాత ఒకదాని వెంట మరొకటి బొమ్మ నా చేతుల్లో రూపుదిద్దుకుంటూనే ఉంది. రెండేళ్లలోనే ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి 300 కు పైగా బొమ్మలు అమ్ముడు పోయాయి. రెండు రోజుల్లో ఏ బొమ్మనైనా సృష్టించి, అలంకరణ పూర్తి చేసే నేర్పు వచ్చేసింది. ఎవరికైనా నచ్చితే ఆన్‌లైన్ ద్వారానే అమ్మకాలు కొనసాగిస్తాను’ అని వివరించింది.
–నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment