అమ్మాయిలు విజయాలు సాధించటంలో మెరుపు వేగంతో ముందుముందుకు పరుగులు తీస్తూ, లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాలు తెస్తున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కొత్త పరికరాన్ని కనిపెట్టిన ప్రేరణ వాడేకర్ భారతీయ మహిళల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. బెంగళూరుకు చెందిన ప్రేరణ వాడేకర్ పవర్ బ్యాంక్‌ని పోలిన లిథీనియమ్ అయాన్ పోర్టబుల్ బ్యాటరీ కనిపెట్టి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం ఇచ్చే ‘వైస్ చాన్సెలర్స్ సోషల్ ఇంపాక్ట్’ అవార్డును అందుకున్నారు. 2010లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రూ హ్యామిల్టన్ ప్రారంభించిన ఈ అవార్డును, ఆ విశ్వవిద్యాలయంలో ప్రతిభ కనపరుస్తూ, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే విద్యార్థులకు అందిస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డును ప్రేరణ వాడేకర్ అందుకున్నారు.
నేను ఊహించుకున్నాను...
ప్రేరణ వాడేకర్ ‘జీవ గ్లోబల్’ ప్రారంభించి, ఆ సంస్థ ద్వారా ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కి వలస వచ్చిన వారికి పది సంవత్సరాలుగా అండగా ఉంటున్నారు. వారికి వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను కావలసిన సహాయసహకారాలు అందిస్తున్నారు. ‘‘జీవ అంటే శక్తిని ఇచ్చేది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలలో బలహీనపడిన వారికి శక్తినిస్తుంది మా సంస్థ. ఎనర్జీ (కరెంట్) అతి తక్కువ ధరలో, అందరూ వాడుకునేలా, అందరికీ అందుబాటులో ఉండే ప్రపంచాన్ని నేను చాలా సంవత్సరాలుగా ఊహించుకుంటున్నాను’’ అంటున్న ప్రేరణ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు (ఐఐఎం) నుంచి ‘పబ్లిక్ పోలసీ’లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
ఇప్పుడు తాను తయారుచేసిన పరికరం గురించి, ‘‘ఈ బ్యాటరీ ద్వారా కేవలం అరవై నిమిషాలలో మూడు గ్యాడ్జెట్స్‌ని ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఒక వస్తువును బ్యాటరీ ద్వారా చార్జింగ్ చేయటానికి కనీసం ఐదు గంటల సమయం పండుతుంది. కరెంటు సప్లయి ఉన్న ఏ ప్రదేశంలోనైనా ఈ పరికరం పనిచేస్తుంది’’ అంటూ ఎంతో సంబరంగా చెప్పారు ప్రేరణ వాడేకర్. ఈ పరికరం సహాయంతో, హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఉన్న రిఫ్రిజిరేటర్‌ని సైతం చార్జింగ్ చేసుకోవచ్చు. లైట్లు, చిన్న చిన్న టేబుల్ ఫ్యాన్లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. సుదూర ప్రాంతాలలో ఉండేవారు, గిరిజనులు సైతం దీని ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు.
అమ్మ చెప్పింది..
ప్రేరణ తల్లి నీనా వాడేకర్. ఆవిడ కూడా బాగా చదువుకున్నారు. సమాజ అభివృద్ధికి సైన్స్ ఎంతగానో తోడ్పడుతుందని తల్లి చిన్ననాటి నుంచి ప్రేరణకు తరచుగా చెప్పేవారు. ‘‘అమ్మ నన్ను కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేయమంది. నా వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలని చిన్నతనం నుంచి చెప్పేది. అహ్మదాబాద్ ఐఐఎంలో చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్ అనిల్ గుప్తా భారతీయులలో దాగి ఉన్న ప్రతిభను ప్రశంసించేవారు. ఆయన మాటలు నాలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పెంచాయి’’ అంటూ ఎంతో ఆనందంగా చెబుతారు ప్రేరణ.
తోపుడు బండి వారి నుంచి...
కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సమయంలో, తోపుడు బండివారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్నారు. వారికి ఎలాగైనా నా వల్ల సహాయం జరగాలనుకున్నాను’’ అంటున్న ప్రేరణకు పది సంవత్సరాలుగా వివిధ చిరు వ్యాపారుల గురించి పూర్తి అవగాహన ఉంది. తాను తయారుచేసిన పరికరాన్ని ముందుగా తోపుడు బండి వారికి అందచేసి, వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా పరికరాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ, వారు సౌకర్కయంగా వాడుకునే స్థాయికి తీసుకువచ్చారు.
త్వరలో మార్కెట్‌లోకి...
బెంగళూరు బేస్‌డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అయిన లివా ఇన్నొవేషన్స్ సంస్థ ఈ ప్రొడక్ట్‌ను కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకు రావడానికి ముందుకు వచ్చారు. ‘‘నేను కనిపెట్టిన ఈ పరికరం అందరికీ అంటే ఆర్థికంగా దిగువస్థాయి వారికి కూడా అందుబాటులోకి రావాలన్నదే నా లక్ష్యం’’ అంటున్నారు ప్రేరణ వాడేకర్. ఈ పరికరాన్ని అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తే ఒక సోలార్ చార్జిబుల్ పరికరం తక్కువ ధరకి అందరికీ అందుబాటులోకి రాగలదని, అంతర్జాతీయంగా దీనిని అందరూ వాడుకోగలుగుతారని ఇందు కోసం ప్రభుత్వ కార్పొరేట్ రంగాలు సహకారం అందించాలని ప్రేరణ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment