వంటలూ వడ్డింపులతో క్యాన్సర్‌ నివారణ | Prevention of Cancer With Coockings And Servings | Sakshi
Sakshi News home page

వంటలూ వడ్డింపులతో క్యాన్సర్‌ నివారణ

Published Thu, Feb 11 2021 12:36 AM | Last Updated on Thu, Feb 11 2021 12:38 AM

Prevention of Cancer With Coockings And Servings - Sakshi

క్యాన్సర్‌ ఎందుకు, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కారణాలేమిటో ఎవరూ చెప్పలేరు. కానీ కొన్ని ఆహార అంశాల్లోనూ, వండటంలోనూ కొన్ని అంశాలు క్యాన్సర్‌ వచ్చేందుకు దోహదం చేస్తాయని తెలుసు. ఆ అంశాలేమిటో తెలుసుకుని వాటిని చేయకుండా ఉంటే క్యాన్సర్‌ను నివారించినట్లే. ఆహారం వంటల పరంగా క్యాన్సర్‌కు దోహదం చేసే అంశాలేమిటో తెలుసుకోండి. వాటినుంచి వీలైనంత దూరంగా ఉండండి.

వీటిని అనుసరించండి
► ఆహారంలో పీచు ఉంటే అది పేగుల లోపలి భాగాన్ని శుభ్రంగా చేస్తుంది. పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఇలాంటి పీచులేని పదార్థాలు గతంలో పాశ్చాత్యులు విస్తృతంగా తీసుకునేవారు. దాంతో వారిలో పెద్దపేగు, కోలోరెక్టల్, రెక్టల్‌ క్యానర్లు ఎక్కువ. ఇటీవల మనం కూడా మారిన మన జీవనశైలి అలవాట్లలో పీచు ఎక్కువగా లేని ఆహారాలవైపు మళ్లాం. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, పొట్టు పుష్కలంగా ఉండే అన్ని రకాల ముడిధాన్యాల (హోల్‌ గ్రెయిన్స్‌)లో పీచు పుష్కలంగా ఉంటుంది.  కేవలం పెద్ద పేగు క్యాన్సర్‌నే గాక... అనేక పెద్ద పెద్ద క్యాన్సర్లూ పీచుతో నివారితమవుతాయి. అందుకే వడ్డించే పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉందా లేదా అని చూసుకోవడం క్షేమదాయకం.

► విటమిన్‌–సి, ఫోలేట్, నియాసిన్‌ వంటి విటమిన్లు నీళ్లలో కరుగుతాయి. అలా విటమిన్లు ఊరిన నీటితో వంట చేస్తున్నప్పుడు... ఆ నీటిని చాలాసేపు వేడిచేస్తే... అందులోని విటమిన్లు ఇగిరిపోతాయి. మనం ఆకుకూరలతో వంట చేసే సమయంలో ఎక్కువ సేపు వండుతూ ఉంటే మొక్కల నుంచి లభ్యమయ్యే పోషకాలు, ఫైటోకెమికల్స్‌ తరిగిపోతాయి. ఈ ఫైటోకెమికల్స్‌ క్యాన్సర్లతో ఫైట్‌ చేస్తాయి. అందుకే వంట ప్రక్రియలో విటమిన్లూ, పోషకాలు ఆవిరయ్యేలా కాకుండా అవి ఉండిపోయేంతగానే ఉడికించాలి. ఆకుపచ్చ, ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఉండే కూరగాయలను ఆలివ్‌ నూనెలో వండటం మేలు. దీనివల్ల నూనెలో కరిగే విటమిన్లు ఒంటికి సమర్థంగా అందుతాయి.  

► ఘాటుగా ఉండే ఉల్లి, వెల్లుల్లి క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. వాటిని నేరుగా అలాగే వంటల్లో వేసేయడం కంటే... కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా కొద్దిగా నలగ్గొట్టి వేస్తే... రుచికి రుచీ పెరుగుతుంది. క్యాన్సర్‌ తో ఫైట్‌ చేసే పోషకమైన అలిసిన్‌ వెలువడేందుకూ ఇది దోహదపడుతుంది. ఎర్రగా ఉండే టొమాటోలలో, ఎర్రటి రంగులో ఉండే ద్రాక్షల్లో... ఇలా ఎరుపు రంగులో ఉండే అనేక పండ్లలో లైకోపిన్‌ అనే క్యాన్సర్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్‌ పుష్కలంగా ఉంటుంది. నేరుగా టొమాటోను తినడం కంటే కాస్తంత ఉడికించాక దాన్ని తింటే... అలా ఉడికించడం ద్వారా వెలువడ్డ లైకోపిన్‌ను మన జీర్ణకణాలు చాలా తేలిగ్గా స్వీకరిస్తాయి. ఇదీ ఆరోగ్యకరంగా వండటానికీ, వడ్డించడానికి ఓ మంచి ఉదాహరణ.

► తాజాపండ్లు క్యాన్సర్‌ను సమర్థంగా నివారించే వాటిల్లో ఒకటి. వీటిల్లోనూ తొక్కతో తినగలిగే జామ, ఆపిల్‌ వంటి పండ్లను కాస్త కడుక్కుని తొక్కతోనే తినడం మేలు. ఉదాహరణకు ఒక ఆపిల్‌ను తొక్కతో తింటే... మొత్తం పండులో లభ్యమయ్యే దానికంటే... కేవలం ఆ తొక్కలోనే 75% క్వెర్సిటిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ ఉంటుంది.
ఇది క్యాన్సర్‌తో పోరాడే ఒక అమృతప్రాయమైన జీవరసాయనం.

మనం వంటల్లోనూ, వడ్డింపుల్లోనూ ఆహారాల్లో పైన పేర్కొన్న సూచనలు పాటిస్తే అవి క్యాన్సర్‌ ముప్పునుంచి మనల్ని కాపాడతాయి.

ఇవి చేయకండి...
► ఒకసారి వాడిన నూనెను మరోసారి వేడి చేసి ఉపయోగిస్తే క్యాన్సర్‌కు దోహదం చేసే అవకాశం ఉంది.

► కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉండే ఆహార పదార్థాలు క్యాన్సర్‌ వచ్చేందుకు దోహదం చేసేవే.

► సాధారణంగా రెడ్‌మీట్‌ కూడా క్యాన్సర్‌ కారకమే. రెడ్‌ మీట్‌ ఎక్కువ గా తినే దేశాల్లో కొలోన్‌ క్యాన్సర్, కొలోరెక్టల్‌ క్యాన్సర్లు ఎక్కువగా రావడం డాక్టర్లు చూస్తుంటారు.  మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారితో పోలిస్తే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్‌మీట్‌ తినేవారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 17 శాతం పెరగడం నిపుణుల పరిశీలనతో తేలింది. అంతేకాదు... రెడ్‌ మీట్‌తో ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, పొట్ట క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. అయితే కొంతమంది మాంసాహార ప్రియులు మటన్‌ తినకుండా తమాయించుకోలేరు. ఇలాంటివాళ్లు కేవలం రుచికోసం కొద్దిగా అంటే ఉదాహరణకు... రోజుకు 90 గ్రాములకు బదులు మీ రెడ్‌మీట్‌ను 70 గ్రాములకే పరిమితం చేసుకోవడం మంచిది. దీనివల్ల పూర్తిగా కాకపోయినా... కొంతలో కొంత క్యాన్సర్‌ ముప్పు తప్పుతుంది.

► క్యాన్సర్‌ నివారణలో ఏం వండారన్నది కాదు... ఎలా వండామన్నది కూడా ముఖ్యమే. మనం ఏదైనా పదార్థాన్ని వండుతుంటే దాన్ని ఎంత ఉష్ణోగ్రత వద్ద ఉడికేలా చేస్తున్నారన్నదీ క్యాన్సర్‌ నివారణలో చాలా కీలకమైన అంశం. ఒక వంటకాన్ని (రెసిపీని) చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండుతుంటే కొన్నిసార్లు క్యాన్సర్‌ కారకమైన రసాయనాలు వెలువడేందుకు అవకాశమిస్తున్నామా అని కూడా చూసుకోవాలి. మాంసాన్ని మితిమీరిన ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నా... అంటే గ్రిల్డ్‌ మాంసంగా వేపుడుగానూ చేస్తున్నామంటే, ఆ మాంసాహారంలోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్‌ అరోమాటిక్‌ అమైన్స్‌ (హెచ్‌ఏఏ) అనే రసాయన రూపాలుగా మారిపోవచ్చు. అవి క్యాన్సర్‌ కారకాలు. ఇటీవల విదేశాల్లోలాగా మన దగ్గర కూడా స్మోక్‌డ్‌ ఫుడ్‌ తినడం పెరిగింది. ఇలా స్మోకింగ్‌ ప్రక్రియకు గురైనా, నేరుగా అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న మంట తగిలేలా చేసినా... అప్పుడా ఆహారపదార్థాల్లోంచి ‘పాలీ సైక్లిక్‌ అరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌’ అనే (పీఏహెచ్‌స్‌) అనే రసాయనాలు ఏర్పడతాయి. అవి కూడా క్యాన్సర్‌ను తెచ్చిపెట్టగల అవకాశం ఉన్నవే.  

► క్యాన్సర్‌ నివారణలో ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోవడం కూడా కీలక భూమిక వహిస్తుంది. ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోకపోవడం లేదా నిల్వ చేసుకోవడంలో ఉపయోగించే పదార్థాల వల్ల క్యాన్సర్‌ వచ్చే ముప్పు పెరుగుతుంది. చాలామంది ఆహారపదార్థాలను పాడైపోకుండా ఉంచడానికి ‘ఉప్పు’లో చాలాకాలం పాటు ఊరబెడుతుంటారు. ఇలా ఉప్పులో దీర్ఘకాలం ఊరిన పదార్థాల వల్ల పొట్ట లోపలి పొరలు (లైనింగ్‌) దెబ్బతిని అది ఇన్‌ఫ్లమేషన్‌కు (వాపు, నొప్పి, ఎర్రబారడం) గురయ్యే అవకాశం ఉంది. అలా పొట్ట లోపలి పొరలు (లైనింగ్‌) దీర్ఘకాలం ఒరుసుకుపోతూనే ఉండటం జరుగుతుంటే అక్కడ అలా ఒరుసుకు పోయిన లైనింగ్‌లలో నైట్రేట్ల వంటి క్యాన్సర్‌ కారక రసాయనాల ప్రభావానికి గురయ్యే అవకాశముంది. అలాంటి చోట్ల హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే సూక్ష్మజీవి నివసిస్తూ ఉంటే... ఆ ప్రాంతాల్లో  పుండ్లు పడేలా చేస్తుంది. వీటినే స్టమక్‌ అల్సర్స్‌ అంటారు. ఈ స్టమక్‌ అలర్స్‌ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అది కేవలం ఉప్పు వాడే పచ్చళ్లకు మాత్రమే కాదు... చిప్స్, సాల్టెడ్‌ పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌లో కూడా ఉప్పు ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి వాటిని చాలా చాలా పరిమితంగా తీసుకోవాలి. క్యాన్సర్‌ మాట అటుంచి... మనం తినే ఆహారంలో ఉప్పు పరిమాణం పెరుగుతున్న కొద్దీ హైబీపీ కూడా పెరుగుతూ పోతుంది. అందుకే ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ 6 గ్రాములకు మించి ఉప్పు వాడకూడదు.

శ్వేత బిరలి
సీనియర్‌ డైటీషియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement