నదీరా జహీర్... కొన్ని హిందీ సినిమాల్లో కనిపించినా థియేటర్‌తోనే ఆమెకు ఎక్కువ అనుబంధం. నదీరాకు రాజ్‌తో పరిచయం అయిందీ ఆ వేదిక మీదే. ఈ ఇద్దరూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విద్యార్థులు. నదీరా గోల్డ్ మెడలిస్ట్ కూడా. అయితే ఆమె అతనికన్నా నాలుగేళ్లు సీనియర్. నదీరా నాటకాలు రాసి, దర్శకత్వం వహించే నాటికి రాజ్ బబ్బర్ గుర్తింపు కోసం తాపత్రయం పడ్తున్నాడు. అప్పుడే రాజ్ లీడ్‌రోల్‌గా ఓ నాటకాన్ని రచించి దర్శకత్వం వహించింది నదీరా. ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి సందర్భమూ అదే అయింది. నదీరాలోని స్నేహ స్వభావం, నిర్మొహమాటత్వం రాజ్‌ను ఆమెకు దగ్గర చేస్తే రాజ్‌లోని పట్టుదల నదీరా అతణ్ణి ఇష్టపడేలా చేసింది. ఆ ప్రేమ ఆ ఇద్దరినీ పెళ్లితో ఒక్కటి చేసింది. వాళ్ల బసను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా క్యాంపస్ నుంచి ఢిల్లీలోని నదీరా వాళ్ల తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు చేర్చింది. ఆమె తల్లిగారింట్లో ఒక గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారిద్దరూ.
ముంబై
ఏడాది దాటేసరికి(జుహీ బబ్బర్‌కు) తల్లిదండ్రులయ్యారు. రాజ్ బబ్బర్ యాక్టింగ్ కెరీరే ముందుకు సాగలేదు. ఆర్థిక ఇబ్బందులూ తొలగలేదు. ఆ సమయంలో నదీరా సహనం, సంయమనమే రాజ్‌లో ధైర్యాన్ని పెంచింది. సినిమాల్లో రాణించాలనే కలను వీడకుండా చేసింది. తన స్కూటర్ అమ్మేసి.. వచ్చిన ఆరువేల రూపాయలను నదీరా చేతిలో పెట్టి ముంబై చేరుకున్నాడు రాజ్. అక్కడతను అవకాశాల కోసం చాలానే పోరాడాల్సి వచ్చింది. కుటుంబ భారాన్ని భర్త మీద వేయకుండా థియేటర్ పనితో ఆ బాధ్యతను తీసుకుంది నదీరా. నాలుగేళ్లు గడిచాయి. బాలీవుడ్‌లో బ్రేక్ సాధించాడు రాజ్. ‘కూతురిని తీసుకొని ముంబై వచ్చేయ్’ అని నదీరాకు చెప్పాడు. వెళ్లింది. తర్వాత యేడాదికి ఆ జంట కొడుకు (ఆర్య బబ్బర్)ను కన్నది.
ఏక్‌జుట్
ఒక్కసారికే ఇరవై నాలుగు సినిమాలను సైన్ చేసేంత స్టార్ అయిపోయాడు రాజ్ బబ్బర్. నదీరా కూడా పని కల్పించుకుంది ‘ఏక్‌జుట్’ అనే థియేటర్ గ్రూప్ పెట్టి. ఆ బిజీ షెడ్యూల్‌లోనే రాజ్‌ను ఆకర్షించి.. అతని మదిని ఆక్రమించింది స్మితా పాటిల్. ఆ ప్రేమ సహజీవనమూ మొదలుపెట్టింది. ఆ కబుర్లను మీడియా మోస్తున్నా భర్త మీదున్న నమ్మకంతో వాటిని వదంతులుగానే వదిలేసింది నదీరా. కాని స్మిత, రాజ్‌ల పెళ్లి వార్తతో మాత్రం షాక్ అయింది, షేక్ అయింది నదీరా. లేమి కూడా తెప్పించని కన్నీళ్లని ఆ కలత తెప్పించింది. భర్తను నిలదీసింది. ‘నిజమే’ అని ఒప్పుకున్నాడు రాజ్. మౌనంగా పక్కకు తప్పుకుంది నదీరా. ఆ ఇంట్లోంచి, ఆ కుటుంబంలోంచి వెళ్లిపోయాడు రాజ్ బబ్బర్.
హోమ్ బ్రేకర్.. డోర్‌మ్యాట్
‘అమ్మా..’ అంటూ రెండూ కాళ్లను పట్టేసుకున్న ఆ పిల్లలే ఆమె నవ్వులయ్యారు. వాళ్ల సహాయంతోనే మనసులోని శూన్యాన్ని పూరించుకుంది. వాళ్ల కోసం నిలబడింది. రాజ్ బబ్బర్‌ను పెళ్లి చేసుకున్నందువల్ల కాపురం కూల్చేసిన స్త్రీగా స్మితను ఎలా ముద్రేశారో.. కాపురం నిలబెట్టుకోలేని బలహీనురాలిగా నదీరానూ చూశారు. ‘ఆ టైమ్‌లో ఆ కామెంట్లను తట్టుకోవడానికి నాకు ఊరటగా, ఓదార్పుగా పిల్లలైనా ఉన్నారు. స్మితకు అదీ లేకుండింది’ అని చెప్పింది నదీరా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. నదీరా అన్నట్టుగా స్మితకు ఆ ఊరట దొరొకలేదు. ప్రాణంలా ఆమెను రాజ్ ప్రేమించనైతే ప్రేమించాడు కాని ఓదార్పు కాలేకపోయాడు. దాంతో స్మితను అభద్రత చుట్టముట్టేసింది. ఆ ప్రభావం తమ దాంపత్యం మీద పడకుండా చూసుకోవడం స్మితకు పెద్ద సవాలుగా మారింది. అందుకే ఓ బిడ్డను కని ఆ బంధాన్ని భద్రం చేసుకోవాలనుకుంది. బిడ్డను భర్తకు అందించి శాశ్వతంగా సెలవు తీసుంది. రాజ్ జీవితంలో స్మిత ఓ కలగా మిగిలిపోయింది.
మళ్లీ చెంతకు..
రెండు వారాల పసిగుడ్డు ప్రతీక్‌ను స్మిత తల్లిదండ్రుల ఒళ్లో పెట్టి మళ్లీ నదీరా ఇంటి తలుపు తట్టాడు రాజ్ బబ్బర్. ఆహ్వానించింది నదీరా. ఆ చర్యే అందరినీ నిర్ఘాంతపరిచింది. ఇటు సంప్రదాయవాదులను, అటు స్త్రీవాదులనూ. నదీరా మీద విమర్శల వర్షం మళ్లీ మొదలైంది.
‘స్మిత మరణంతో ఒంటరైన రాజ్‌ను నేను యాక్సెప్ట్ చేస్తానని ఎవరూ ఊహించలేదు. ఫెమినిస్ట్‌లు నన్ను డోర్‌మ్యాట్ అన్నారు. ఆయనలా చేశాడని నేనూ అలాగే చేసి ఉంటే వాళ్లంతా నన్ను పొగిడేవాళ్లు. ఈ దశాబ్దపు మహిళ అంటూ నా మెడలో బంగారు పతకం వేసేవారేమో! కాని ఆ పొగడ్తలు, ఆ గోల్డ్‌మెడల్స్ నా సమస్యలను తీరుస్తాయా? పిల్లల మనసుకు అయిన గాయాలను మాన్పిస్తాయా? ఉన్నవాటిల్లో ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకున్నాను’ అంటూ స్పందించింది నదీరా.
రాజ్ బబ్బర్ నటించిన ‘ప్రేమ్ గీత్’ సినిమాలో జగ్జీత్ సింగ్ ఆలపించిన గజల్ ఉంటుంది ‘హోఠోంసే ఛూలో తుమ్ .. మేరా గీత్ అమర్ కర్ దో’ అని. ఇందులో చివరగా ‘తుమ్ హార్ కే దిల్ అప్నా మేరీ జీత్ అమర్ కర్ దో.. ’ అని వస్తుంది.
నదీరా చేసింది అదే.. ప్రేమించిన రాజ్ బబ్బర్ కోసం.. తన మనసును ఓడించి.. అతణ్ణి గెలిపించింది.
∙ఎస్సార్
∙మొహబ్బతే
Comments
Please login to add a commentAdd a comment