కనువిందు చేసే కొన్ని దృశ్యాలు ఎంతగా ఆకట్టుకుంటాయో.. అంతే బెదరగొడతాయి. ప్రపంచంలో కొన్ని ఆసక్తికరమైన నిర్మాణాల వెనుక ఉన్న రహస్యమైన కథలే అందుకు ప్రతీకలు. జర్మనీ, సాక్సోనీ రాష్ట్రం, గోర్లిట్జ్ జిల్లా, గబ్లెంజ్ సమీపంలోని రాకోట్జ్ సరసుపైనున్న వంతెన అలాంటిదే.
ఇది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అయిన కుమ్లౌ అజేలియా రోడడెండ్రన్ పార్క్‌కి ఆనుకుని ఉంది. ఇక్కడి ప్రకృతి అందం.. కనురెప్పలను క్షణం కూడా వాల్చనివ్వదు. ఎటు తిరిగి చూసినా స్వప్నలోకంలో విహరిస్తున్నట్లే అనిపిస్తుంది. ఈ వంతెనకు.. సర్కిల్ బ్రిడ్జ్, బసాల్ట్ బ్రిడ్జ్, కుమ్లౌ బ్రిడ్జ్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. సుందరమైన ఈ వంతెన.. సరసులో ప్రతిబింబిస్తూ.. ఎటు నుంచి చూసినా.. కచ్చితమైన కొలతలతో.. వృత్తాకారంలో కనువిందు చేస్తుంది.
చలికాలంలో కిందున్న నీరంతా గడ్డకట్టి.. ఓ ఆర్చ్‌లా ఆకట్టుకుంటుంది. అగ్నిపర్వతాల శిల నుంచి ఏర్పడిన ‘బసాల్ట్’ అనే రాతితో పాటు మరిన్ని సహజమైన రాళ్లతో ఇది నిర్మితమైందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. అయితే ఇది జనజీవనాన్ని కలిపే వారధి కాదని, కేవలం వీక్షకుల అహ్లాదం కోసం నిర్మించిన కట్టడం మాత్రమేనని కొందరు నిపుణుల ఉద్దేశం. దీన్ని 19వ శతాబ్దంలో ఓ మోతుబరి దగ్గరుండి కట్టించాడని స్థానికంగా కొన్ని కథనాలున్నా వాటికి సరైన ఆధారాల్లేవు.
వైవిధ్యమైన ఒంపుతో మలచిన ఈ వంతెన.. ఎలాంటి వారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద కొన్ని కొనలు.. ముళ్ల కిరీటాన్ని తలపిస్తాయి. ఇంత గొప్ప కట్టడం మనుషులకు సాధ్యంకాదని, దెయ్యాలు దీన్ని నిర్మించాయని, సైతాను ఆదేశంతో ఇది ఏర్పడిందని, ఈ వారధి సమీపంలో ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే దీన్ని ‘డెవిల్స్ బ్రిడ్జ్’ అని పిలిచేవారు ఎక్కువయ్యారు. ఇక్కడ ప్రత్యేకమైన కలువ పువ్వులు, అరుదైన వృక్షజాతులు.. రకరకాల రంగులతో ఆకట్టుకుంటాయి.
మరోవైపు కొందరు దైవచింతన కలవారు.. ఈ వంతెన నిర్మాణానికి ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తారు. ఇది మరొక ప్రపంచానికి మార్గమని సూచిస్తారు. దాన్నే బలంగా నమ్ముతుంటారు. ఇక్కడి అందాలను చూడటానికి చాలామంది ఔత్సాహికులు ఎగబడుతుంటారు. కానీ ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు. చుట్టూ ఉన్న అందాలను మాత్రం తరించొచ్చు. ఏది ఏమైనా ఈ బ్రిడ్జ్‌ని నిర్మించింది ఎవరు? ఎందుకు నిర్మించారు? ఎందుకు దెయ్యం పేరుతో భయంకరమైన కథలు పుట్టుకొచ్చాయి? అసలు ఆ కాలంలో ఇంత గొప్ప నిర్మాణం ఎలా సాధ్యమైంది లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు దొరకలేదు.
--సంహిత నిమ్మన
(చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..)
Comments
Please login to add a commentAdd a comment