కొందరిని గమనిస్తే... కుర్చీలో కూర్చుని కాళ్లు రెండూ కదుపుతూ ఉంటారు. వాళ్లు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా... అలా కదిలించడం వారికి ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ వారు బలవంతంగా దాన్ని నియంత్రించుకుంటే... అది వారికి అనీజీగా అనిపించి... కాసేపటి తర్వాత తమ ప్రమేయం లేకుండానే మళ్లీ కదిలించడం మొదలుపెడతారు. జనాభాలో దాదాపు 3 శాతం మందిలో ఇది ఉంటుంది. ఇలా కాళ్లు కదుపుతూ ఉండే సమస్యను ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’ (ఆర్‌ఎల్‌ఎస్) అంటారు. చాలామందిలో ఉండే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.
కాళ్లు రెండూ అదేపనిగా కదుపుతూ ఉండే ఈ సమస్య కూర్చుని ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... ఇలాంటివారిని జాగ్రత్తగా గమనిస్తే... ఈ ధోరణి సాయంత్రాలూ, రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా ఉంటుంది. వైద్య పరిభాష లో దీన్ని ‘విల్లిస్ ఎక్‌బామ్ డిసీజ్’ అని కూడా అంటారు. ఇది ఏ వయసువారిలోనైనా కనిపించినప్పటికీ... వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కనిపించే అవకాశాలు పెరుగుతాయి. కొందరిలో ఇది ఎంత ఎక్కువ అంటే... వారి నిద్రకు సైతం ఇది అవరోధంగా మారుతుంది. కుటుంబ చరిత్రలో ఈ సమస్య ఉన్నవారి పిల్లల్లోని చాలామందిలో అనువంశికంగా ఈ సమస్య కనిపిస్తుంది.
కారణాలు: ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు... త్వరగా ఉద్వేగాలకు లోనయ్యేవారు, అతిగా ఆందోళన పడేవారు, యాంగై్జటీకి గురయ్యేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇది ఎక్కువ. .
లక్షణాలు: ∙కొందరిలో కాళ్లలో ఇబ్బంది పైకి పాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ∙కాళ్లు కదుపుతూ ఉంటారు. కాళ్లు కదపడం ఆపితే చాలా ఇబ్బందిగానూ, అలా కదుపుతుంటే హాయిగాను ఫీలవుతారు. ∙ఇలా కదిపే వాళ్లలో రాత్రి నిద్రలో అకస్మాత్తుగా కాలి కండరాలు పట్టేస్తాయి. దాంతో అకస్మాత్తుగా నిద్రలేస్తారు. ఒక్కోసారి రాత్రంతా బాధపడతారు. తరచూ నిద్రాభంగాలు, దాంతో వచ్చిన నిద్రలేమితో జీవన నాణ్యత దెబ్బతింటుంది. ∙ఈ లక్షణాలున్న కొందరిలో కాళ్లలాగే భుజాలూ కదపడం కనిపిస్తుంది. కానీ ఇది చాలా అరుదు.
అపోహ... వాస్తవం: రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌ను కొందరు మానసిక సమస్యనూ, మెదడు లేదా నాడీమండల సమస్యగానూ భావిస్తారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. కాకపోతే యాంగై్జటీతో పాటు కొన్ని మానసిక సమస్యలు ఉన్నవారిలో ఇది కనిపిస్తుండటం అనే అంశమే ఈ అపోహకు తావిస్తోంది. అంతే తప్ప ఇది మెదడు, నాడీ సంబంధమైన సమస్య లేదా మానసిక సమస్య కాదు. కొంతమంది ఇది నరాల్లోని సమస్యగా భావిస్తారు. ఇది సరి కాదు.
నివారణ / నియంత్రణ
రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్నవారిలో హీమోగ్లోబిన్‌లో ఐరన్ లోపం ఉందేమో చెక్ చేసుకుని, ఒకవేళ ఉంటే దాన్ని భర్తీ చేయాలి. ∙కెఫిన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి లేదా పరిమితంగా తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ∙కాళ్లు రెండూ గోరువెచ్చగా ఉన్న వేణ్ణీళ్ల టబ్‌లో ఉంచి, మెల్లగా మసాజ్ చేయడం. ∙సమస్య తీవ్రత ఉన్నవారు ‘ఫుట్ ర్యాప్ లేదా వైబ్రేటింగ్ ప్యాడ్స్’ వంటి ఉపకరణాలను డాక్టర్ల సూచన మేరకు వాడటం.
-డాక్టర్ కె. శివరాజు,సీనియర్ ఫిజిషియన్
(చదవండి: మీలో ఏకాగ్రత ఎంత ఉంది? అందుకోసం ఏం చేయాలంటే)
Comments
Please login to add a commentAdd a comment