పంట ఏదైనా.. ఎత్తుమడులే మేలు! | Sagubadi Agriculture News Crop Cultivation | Sakshi

పంట ఏదైనా.. ఎత్తుమడులే మేలు!

Jun 4 2024 8:08 AM | Updated on Jun 4 2024 8:08 AM

Sagubadi Agriculture News Crop Cultivation

భరించలేని ఎండలతో జనాన్ని భీతిల్లజేసిన ఎల్‌నినో ముగిసింది. అధిక వర్షాలతో కూడిన లానినాప్రారంభం కానున్న నేపథ్యంలో అధిక వర్షాలకు పంటలు తట్టుకునే వ్యూహాలు అవసరం. అందులో ముఖ్యమైనది.. ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్‌డ్‌ బెడ్స్‌)పై పంటలు విత్తుకోవటం. అది ఎర్ర నేలైనా, నల్ల నేలైనా.. పత్తి, కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో టు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే నీటి ముంపు నుంచి, ఉరకెత్తటం, అతివృష్ఠి/ అనావృష్ఠి బాధల నుంచి రక్షణ పొందవచ్చని ఆదిలాబాద్‌ కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్‌ రైతులకు సూచిస్తున్నారు.

వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మేలని డా. ప్రవీణ్‌ కుమార్‌ గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు చెబుతూ వస్తున్నారు.

పత్తి సాగులో ఎత్తు మడి లాభాలు..
అతివృష్ఠి సమయాల్లో పంటల సంరక్షణకు సమర్థవంతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ కీలకం. ఎత్తు మడుల పద్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ఎత్తుమడులు చేసుకోవడానికి ట్రాక్టర్‌తో అనుసంధానం చేసే రిడ్జర్‌ లేదా బెడ్‌ మేకర్‌ను ఉపయోగిస్తారు. పత్తికి ఉద్దేశించిన మడి 15–20 సెం.మీ.ల ఎత్తు ఉంటుంది. మడి వెడల్పు నేల స్వభావం, ఆప్రాంతంలో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు.

ట్రాక్టర్‌ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలి

పత్తి సాళ్ల మధ్య 180/ 150/ 120 సెం.మీ., మొక్కల మధ్య 30/20/30 సెం.మీ.ల దూరంలో పత్తి పంటను సాగు చేయవచ్చు. సాధారణంగా ఒక ఎకరంలో ఎత్తు మడులు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం పడుతుంది.  ఎత్తు మడుల మీద విత్తిన విత్తనం సాధారణ ΄÷లంలో కన్నా ఒకటి రెండు రోజులు ముందే మొలకెత్తుతుంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే, మొలక శాతం ఎక్కువ. దాదాపు 90 శాతం విత్తనాలు మొలుస్తాయి.

ఎత్తు మడుల వలన మురుగు నీటి వ్యవస్థ మెరుగవుతుంది. వర్షపు నీరు ΄÷లంలో నిలవకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లిపో తుంది. దీనివలన తొలిదశలో మొక్క పెరుగుదల కుంటుపడదు. భారీ వర్షాలు కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో వరద పారుతుంది. ఆ ప్రవాహంలో మొక్కలు కొట్టుకుపోకుండా ఎత్తు మడులు కాపాడుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో మడుల్లో నిల్వ ఉండే తేమ పంటకు ఉపయోగపడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో పత్తి మొక్కల కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5 నుండి 10 కాయలు కుళ్లాపోతూ ఉంటాయి.

ఎత్తుమడులు చేయడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి కాయకుళ్లు, ఇతర చీడడీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. యాంత్రీకరణ ద్వారా కలుపు యాజమాన్యం సులభమవుతుంది. సాధారణ పద్ధతితో పోలిస్తే ఎత్తు మడుల పద్ధతిలో 10–20 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చు. నల్లరేగడి నేలలు, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తు మడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే, ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే, మరో పంట రైతును ఆదుకుంటుంది.

ఇతర వివరాలకు డా. ప్రవీణ్‌ కుమార్‌ను 99896 23829 నంబరులో సంప్రదించవచ్చు. ఎత్తు మడులపై పత్తి పంటను విత్తుకునే మెళకువలను తెలిపే వీడియో ‘కేవీకే ఆదిలాబాద్‌’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఉంది. ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్మార్ట్‌ ఫోన్‌తో స్కాన్‌ చేసి చూడొచ్చు.  


– డా. ప్రవీణ్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement