మంగళా నార్లికర్
స్త్రీలు వివాహం అయ్యాక తమకు వచ్చిన విద్యలను, చదువును ‘సున్నా’ చేసేస్తారు... సున్నా చేయడానికా మనం ఇంత కష్టపడి చదివింది అంటారు డాక్టర్ మంగళా నార్లికర్. లెక్కలు అనగానే అందరికీ శకుంతలా దేవి గుర్తుకొస్తారు. కాని లెక్కల్లో అద్భుత ప్రతిభ కనపరిచి పిల్లలకు లెక్కలు సులువు చేయడానికి విస్తృతంగా సరదా లెక్కల పుస్తకాలు రాసి గణిత మేధావిగా గుర్తింపు పొందారు డాక్టర్ మంగళ. ఇదంతా ఆమె పెళ్లయ్యాకే చేశారు. 1970లలోనే నేను ఈ పని చేశాను... కాని నేటికి చాలామంది స్త్రీలు పెళ్లయ్యాక అన్నీ ముగిసినట్టే అని భావించడం బాధాకరం అంటున్నారామె.
77 ఏళ్ల ఈ లెక్కల చుక్క పరిచయం.
‘లెక్కలు మగవాళ్ల సబ్జెక్ట్ అని అంటారు. లెక్కల మాష్టార్లందరూ మగవారే. కాని లెక్కలకు ఆన్సర్ సాధిస్తున్నవారు పురుషులా స్త్రీలా అనేది పట్టదు. సబ్జెక్ట్ ఎవరికైనా ఒకటే. నేను లెక్కల్లో వెరవక విజయం సాధించాను. అలాగే కుటుంబం కూడా మగవాడి సొంతం అనుకుంటారు. కాని నేను నా ఉనికిని చాటుకున్నాను’ అంటారు డాక్టర్ మంగళా నార్లికర్. 77 ఏళ్ల ఈ గణిత మేధావి ప్రస్తుతం పూణెలో నివసిస్తున్నారు. కాని విశ్రాంతిగా మాత్రం లేరు. ఈ లాక్‌డౌన్ కాలంలో టాబ్‌ను వాడటం తెలుసుకుని యూనివర్శిటీ విద్యార్థులకు స్పెషల్ ఆన్‌లైన్ క్లాసులు చెబుతుంటారు. స్పెషల్ లెక్చర్లు ఇస్తుంటారు. ‘నా దాహం తీరలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేయాల్సిందే’ అంటారామె. మంగళా నార్లికర్ భర్త జయంత్ నార్లికర్ ప్రఖ్యాత సైంటిస్ట్. గురుత్వాకర్షణపై ఆయన మరో శాస్త్రవేత్తతో కలిసి ఒక విలువైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నిజమే. ఆయన గొప్పవాడే. కాని ఆయన ఇంట్లో అంతే గొప్ప గణిత మేధావి ఉంది. ఆమె తన మేధావితనం చాటుకోవడానికి 1970ల కాలంలోనే ప్రయత్నించి విజయం సాధించింది.
తల్లి ఆదర్శం
మంగళా నార్లికర్‌ది పూణె. ఆమె కుటుంబం చదువుకు బాగా విలువిచ్చేది. అయితే మంగళా పుట్టిన కొద్దికాలానికే తండ్రి కేన్సర్‌తో మరణించాడు. ఆ సమయంలో మంగళ తల్లి వయసు 21 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. ‘మా అమ్మను అందరూ ఇంకో పెళ్లి చేసుకోమన్నారు. మరికొందరు ఆడవాళ్లు చేయదగ్గ పని టీచరు కావడమే కనుక అలాంటి పని వెతుక్కోమన్నారు. కాని మా అమ్మ పట్టుదలగా డాక్టర్ అయ్యింది. మమ్మల్ని మా అమ్మమ్మ వాళ్ల దగ్గర ముంబైలో వదిలి ఆమె ఆ డిగ్రీ సాధించి మమ్మల్ని చదివించింది. స్త్రీ తలుచుకుంటే సాధించగలదు అని నాకు స్ఫూర్తి ఇచ్చింది. నేను కూడా బాగా చదువుకుని ఎం.ఏలో మేథ్స్ చేసి గోల్డ్‌మెడల్ సాధించాను’ అంటారు మంగళ. పెళ్లికి ముందు ఆమె ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్’ లో రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశారు. అయితే 1966లో ఆమె వివాహం జయంత్ నార్లికర్‌తో జరిగింది. జయంత్ కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నారు.
పెళ్లయ్యాక అక్కడే ఉద్యోగానికి భార్యను తీసుకెళ్లారు. అక్కడ మూడేళ్లు ఉండే ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం, వంట చేయడం తప్ప మంగళ వేరే ఏమీ చేయలేకపోయారు.. కొన్ని ట్యూషన్లు చెప్పడం తప్ప. కాని వాళ్లు అక్కడి నుంచి 1980 లో తిరిగి ఇండియాకు వచ్చే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఒక స్నేహితురాలు ‘ఎందుకే పెళ్లికి ముందు ఎగిరెగిరి చదివావు. పెళ్లి తర్వాత అంతా ఇలా వదులుకొని బతడానికా’ అంది. ఆ మాటలు ఆమెలో సంచలనం రేపాయి. ‘నేను భారత్‌కు రాగానే తిరిగి ఉద్యోగం చేస్తానన్నాను. నా భర్త అడ్డు చెప్పలేదు. ముంబైలో మేము కాపురం పెట్టగానే మా అత్తామామలు మా దగ్గరకు వచ్చేశారు. ఇంటి పని, పిల్లల పని, అత్తామామల పని.. అసలు పని లేని క్షణం లేదు.. కాని అంత పని మధ్యలోనే నేను ఉద్యోగం చేశాను.. ఇంకో పాపకు జన్మనిచ్చాను.. పిహెచ్‌డి చేశాను... గొప్పగా ఉద్యోగం కూడా చేశాను. పనులు పెరిగితే మనకు ఎంత శక్తి ఉందో తెలుస్తుంది’ అంటారామె.
పిల్లల పుస్తకాలు
మంగళా నార్లికర్ గణితంలో కీలక శాఖలైన కాంప్లెక్స్ అనాలిసిస్, అనలిటిక్ జామెట్రీ, నంబర్ థియరీ, ఆల్‌జీబ్రాలలో విశేష కృషి చేశారు. యూనివర్సిటీలు ఆమె చేత క్లాసులు చెప్పించేవి. అదే సమయంలో మరో విశేషం జరిగింది. ఆమె తన దగ్గర పని చేసే పని మనిషి పిల్లలకు లెక్కలు నేర్పిస్తున్నప్పుడు వారిని నవ్విస్తూ సరదా ఉదాహరణలతో పాఠం చెబుతుంటే వారికి తొందరగా లెక్కలు వస్తున్నట్టు ఆమె గ్రహించారు. ‘లెక్కలంటే కష్టంగా ముఖం పెట్టే పిల్లల కోసం పుస్తకాలు రాయాలన్న ఆలోచన అప్పుడు వచ్చింది’ అన్నారామె. ఆమె మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణ సంస్థ ‘బాలభారతి’తో కలిసి పిల్లల కోసం విశేషంగా సులభ లెక్కల పుస్తకాలు రాశారు. అవి అందరు పిల్లలకు అందాలని తను రాసిన ప్రతి పుస్తకం కేవలం పది రూపాయల ధర మాత్రమే ఉండాలన్న షరతు పెట్టారు. ఆ తర్వాత బాలభారతి డైరెక్టర్ అయ్యి పాఠాలలో సులభ పద్ధతులు ప్రవేశపెట్టారు.
‘పెళ్లయ్యాక కుటుంబం అనే ప్రపంచం వస్తుంది స్త్రీకి. కాని కెరీర్ అనే ప్రపంచం కూడా కావాలంటే ఆ రెండు ప్రపంచాలను నిర్వహించుకోగల సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యం కోసం ప్రయత్నించండి. అంతే తప్ప సున్నాలా మారకండి’ అంటారు డాక్టర్ మంగళా నార్లికర్.
ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ముగ్గురూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. మంగళ తన భర్త జయంత్‌తో కలిసి పూణెలో వాకింగ్‌కు వస్తే దారిన వెళ్లే వారు గౌరవంగా నమస్కారం పెడతారు. అయితే ఆ నమస్కారం ఒక్కరికి కాదు. ఇద్దరికీ. దానిని పొందే హక్కు ప్రతి స్త్రీకి ఉంది.
జయంత్ నార్లికర్, మంగళా నార్లికర్
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment