సారా ఛిపా
ఒకప్పుడు ఎవరి ఫోన్ నంబర్ అయినా తడుముకోకుండా టకటకా చెప్పేవాళ్లం. స్మార్ట్ ఫోన్‌లు వచ్చాక ఇంట్లో వాళ్ల నంబర్లు కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో.. ప్రపంచ దేశాల పేర్లు, వాటి రాజధానులు, అక్కడ వినియోగించే కరెన్సీ పేర్లను గుక్కతిప్పుకోకుండా చెబుతోంది పదేళ్ల సారా ఛిపా. భారతసంతతికి చెందిన సారా ఇటీవల జరిగిన వరల్డ్ రికార్డ్స్ పోటీలో పాల్గొని.. 196 దేశాల పేర్లు, రాజధానులు, ఆయా దేశాల్లో వాడే కరెన్సీ పేర్లను అవలీలగా చెప్పి వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.
ఇప్పటిదాకా ఈ రికార్డు సాధించిన వారంతా దేశాల పేర్లు వాటి రాజధానుల పేర్లు మాత్రమే చెప్పగా.. సారా వీరందరికంటే ఒక అడుగు ముందుకేసి ఆయా దేశాల కరెన్సీల పేర్లు కూడా చెప్పడం విశేషం.
గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓఎమ్‌జీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఈవెంట్‌లో పాల్గొన్న సారా అన్ని దేశాల కరెన్సీ, రాజధానుల పేర్లు కరెక్టుగా చెప్పి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకుంది. కాగా ఈవెంట్‌ను యూట్యూబ్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ మాధ్యమాలలో లైవ్ టెలికాస్ట్ చేశారు.
రాజస్థాన్‌లోని భిల్వారా.. సారా స్వస్థలం. తల్లిదండ్రులు ఇద్దరూ వృత్తిరీత్యా గత తొమ్మిదేళ్లుగా యూఏఈలో ఉంటున్నారు. సారాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. జెమ్స్ మోడరన్ అకాడమీలో ఆరోతరగతి చదువుతోన్న సారా 1500 గంటలకు పైగా సాధన చేసి ఈ కేటగిరీలో గెలిచిన తొలి భారతసంతతి వ్యక్తిగా నిలిచింది.
అనుకోకుండా..
సారా వరల్డ్ రికార్డులో పాల్గొనాలని మెమరీ టెక్నిక్స్ నేర్చుకోలేదు. లాక్‌డౌన్ సమయంలో జ్ఞాపకశక్తి, సృజనాత్మకు పదును పెట్టేందుకు ముంబైకు చెందిన ‘బ్రెయిన్ రైమ్ కాగ్నిటివ్ సొల్యూషన్’ వ్యవస్థాపకులు సుశాంత్ మీసోర్కర్ వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. కొన్ని సెషన్ల తరువాత సారాలో చురుకుదనం గమనించిన సుశాంత్ ఆమెకు మరింత ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు పోటీలో పాల్గొనేందుకు ప్రేరేపించారు. ప్రారంభంలో 585 పేర్లను గుర్తు పెట్టుకోవడానికి సారాకు గంటన్నర పట్టేది. సాధన చేస్తూ చేస్తూ కేవలం 15 నిమిషాల్లోనే పేర్లను చెప్పగలిగేది. మూడు నెలల పాటు ఎంతో కష్టపడి క్రియేటివ్ లెర్నింగ్, మెమరీ టెక్నిక్‌ల ద్వారా దేశాల రాజధానులు, కరెన్సీ పేర్లను గుర్తుపెట్టుకుంది.
షైన్ విత్ సారా
సారా జ్ఞాపకశక్తిపరంగా చురుకైన అమ్మాయే కాకుండా మంచి డ్యాన్సర్ కూడా. వివిధ కార్యక్రమాల్లో స్టేజిపై నాట్యప్రదర్శనలు ఇచ్చింది. జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు యోగా, బ్రీతింగ్ టెక్నిక్‌లను సాధన చేస్తోంది. ఇంకా ‘షైన్ విత్ సారా’ అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతూ..‘‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’’ పేరుతో వీక్లి సిరీస్‌లను అందిస్తోంది.
‘‘నేను ఈ రికార్డును నెలకొల్పడానికి నా గురువు సుశాంత్, తల్లిదండ్రులే నాకు ప్రేరణ. నా మీద నమ్మకముంచి నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం వల్లే నేను ఈరోజు వరల్డ్ రికార్డును సాధించగలిగాను’’ అని సారా చెప్పింది.
‘‘ప్రపంచ రికార్డు హోల్డర్‌కు తండ్రినైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. యూఏఈలో ఉంటున్నప్పటికీ నేను భారతీయుడినైనందుకు ఎంతో గర్వంగా ఉంది. సారా జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని సారా తండ్రి సునీల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment