ఎన్‌.ఆర్‌.ఐ భర్తల మోసం చెల్లదు | Satwinder Kaur fight to Justice for NRI victims | Sakshi
Sakshi News home page

ఎన్‌.ఆర్‌.ఐ భర్తల మోసం చెల్లదు

Published Wed, Feb 15 2023 4:13 AM | Last Updated on Wed, Feb 15 2023 4:13 AM

Satwinder Kaur fight to Justice for NRI victims  - Sakshi

పంజాబ్‌లో‘హనీమూన్‌బ్రైడ్స్‌’ అనే మాట వినిపిస్తూ ఉంటుంది.అంటే పెళ్లి చేసుకున్న ఎన్‌.ఆర్‌.ఐలుకాపురానికి తీసుకెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగాకాపురం చేసి ఆ తర్వాత పెళ్లికూతుళ్లను పుట్టింటికి తరిమేస్తారు.సత్వీందర్‌ కౌర్‌ కూడా అలాంటి బాధితురాలే.కాని ఆమె ఊరికే ఉండలేదు.లూధియానాలో ఒక సంస్థ స్థాపించిఎన్‌ఆర్‌ఐ బాధితమహిళలకు న్యాయం జరిగేలా చూసింది.న్యాయం జరగాలంటే ఏం చేయాలో కూడా చెబుతోంది.

పంజాబ్, హరియాణాలలో ఎన్‌.ఆర్‌.ఐ భర్తలు మోసం చేసిన భార్యల సంఖ్య ప్రస్తుతం ఎంత ఉంటుందో ఊహించండి. 32,000. పెళ్లి చేసుకుని ఉద్యోగాలు విదేశాలలో తెచ్చుకుని మాయమైన ఎన్‌.ఆర్‌.ఐలు కొందరైతే విదేశాల్లో ఉంటూ ఇక్కడకు వచ్చి పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేసి ఆ తర్వాత ఉడాయించిన వాళ్లు కొందరు. వీరి గురించి ఆరా తీస్తూ, ఎదురు చూస్తూ, వారిని శిక్షించాలని ప్రయత్నిస్తూ పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే ఈ వివాహితులను అక్కడ ‘హనీమూన్‌ బ్రైడ్స్‌’ అంటూ ఉంటారు. విషాదం ఏమంటే వీరి సగటు వయసు 22 నుంచి 65 వరకూ ఉండటం. ముప్పై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని విదేశాలకు పా రిపోయిన భర్తల కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఇంకా అక్కడ ఉన్నారు. వారందరికీ ఒక ఓదార్పు లూధియానాలో ‘అబ్‌ నహీ’ సంస్థను నడుపుతున్న 41 ఏళ్ల సత్వీందర్‌ సింగ్‌.

స్వయంగా బాధితురాలు
లూధియానాకు చెందిన సత్వీందర్‌ సింగ్‌ టీచర్‌గా పని చేసేది. టీచర్‌ సంబంధమే వస్తే 2009లో వివాహం చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత భర్త విదేశాలలో ఉద్యోగం వచ్చిందని జార్జియా వెళ్లాడు. అక్కడి నుంచి ఉక్రెయిన్‌ వెళ్లాడు. సత్వీందర్‌ అత్తారింటిలోనే ఉండిపోయింది. ఐదేళ్ల తర్వాత 2015లో తిరిగి వచ్చిన భర్త ఆమెను అత్తారింటి నుంచి ఒక అద్దె ఇంటికి మార్చి ఒక నెల ఉండి మళ్లీ ఉక్రెయిన్‌కు వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళతాను అనే దొంగ హామీ మీద. కాని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతోటే ‘ఇక నీకూ నాకూ సంబంధం లేదు’ అని ఫోన్‌ చేసి చెప్పేశాడు.

సత్వీందర్‌ వెంటనే అత్తామామల దగ్గరకు వెళితే వాళ్లు ముఖాన తలుపులు వేసేశారు. ఒక సంవత్సరం పా టు చేష్టలుడిగి ఉండిపోయిన సత్వీందర్‌ ఆ నిద్ర నుంచి మేల్కొని న్యాయం కోసం గట్టిగా పట్టుబట్టింది. భర్త మీద, అత్త మామల మీద సెక్షన్‌ 406, 498ల కింద కేసు పెట్టింది. కోర్టులో మెయింటెనెన్స్‌ కేసు వేస్తే నెలకు 10 వేలు మంజూరయ్యాయి. 2018లో భర్త పా స్‌పోర్ట్‌ సీజ్‌ అయ్యేలా చూసింది. ఇవన్నీ చిన్న విజయాలు కావు.

తనలాంటి వారి కోసం
ఆ సమయంలో కోర్టు దగ్గర, పోలీస్‌ స్టేషన్‌ దగ్గర తన లాంటి వివాహితలు మరికొంత మంది కనిపించేవారు సత్వీందర్‌కు. ‘ఇంతమంది ఉన్నారా... వీరందరి కోసం ఏదైనా చేయాలి’ అని ‘అబ్‌ నహీ’ సంస్థ స్ధాపించింది. చిన్న చిన్న సమావేశాలు పెట్టి ఇలాంటి బాధిత మహిళలను సమీకరించడం మొదలెట్టింది. ఈమె చేస్తున్న పని ఆ నోటా ఈ నోటా తెలిసి బాధితులు రావడం మొదలెట్టారు. అయితే ఇది అంత సులభం కాదు. పా రిపోయిన కుర్రాళ్ల కుటుంబాలు ఈమె చేసే నిరసన కార్యక్రమాలకు, పెడుతున్న కేసులకు ఆగ్రహించేవి. శాపనార్థాలు పెట్టేవి. తన్నబోయేవి. అయినా సత్వీందర్‌ జంకకుండా తన పోరాటాన్ని కొనసాగించింది.

ఎన్‌.ఆర్‌.ఐ సెల్స్‌ ద్వారా మహిళా కమిషన్‌ ద్వారా బాధితులకు మద్దతు దొరికేలా చేసేది. అంతేకాదు, జాతీయ గురుద్వారా కమిటీ ద్వారా విదేశాలలో ఉన్న గురుద్వారాలకు ఇలా పా రిపోయిన వరుల వివరాలు తెలుపుతూ తాకీదులు అందేలా చేసింది. అంటే అక్కడ ఉన్న వారి గురించి కనీసం అక్కడ ఉన్న పంజాబీలకు తెలిసేలా చేయగలిగింది. కొందరు భర్తలు ఏ దేశాల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడి లీగల్‌ సెల్స్‌కు అదే పనిగా ఈ మెయిల్స్‌ పంపి ఫిర్యాదు చేస్తుంది. విదేశాంగ శాఖకు పదే పదే వినతి చేయడం వల్ల ఆ శాఖ కూడా రంగంలో దిగి ఇలాంటి కేసులు నమోదైన భర్తల పా స్‌పోర్ట్‌ల వివరాలను సేకరించి అవసరమైతే సీజ్‌ చేసే చర్యలు చేస్తోంది.

ఇప్పటికి 700 మంది
సత్వీందర్‌ సింగ్‌ ఇప్పటికి 700 మంది వివాహితలకు ఏదో ఒక మేర న్యాయం అందేలా చేసింది. అలాగే భర్తలను విడిచిపెట్టి ఉడాయించిన భార్యల బాధితులైన 40 మంది భర్తలకు కూడా న్యాయం అందడానికి పోరాడుతూ ఉంది. ‘భార్యను విడిచి వెళ్లిపోయిన భర్తల కేసుల్లో ఇరుపక్షాలను కూచోబెట్టి సమస్య కనుక్కుంటే చాలా కేసులు విడిపోయే దాకా వెళ్లకుండా ఆపొచ్చు. కొన్నింటిలో మాత్రం మోసగాళ్లు ఉంటారు. వారికి శిక్ష పడేలా చేయాలి.’ అంటుంది సత్వీందర్‌.

సోషల్‌ మీడియా ద్వారా ఫేస్‌బుక్‌ ద్వారా బాధితులను గుర్తించి వారికి సహాయం అందేలా చేయడానికి ప్రయత్నిస్తోందామె. ‘మన పోలీసులు దేశంలో లేకుండా పోయిన వారంటే ఏమీ చేయలేము అన్నట్టు చూస్తుంటారు. కాని అలా విదేశాలకు పారిపోయిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది అనే విధంగా చర్యలు ఉంటే ఎన్‌.ఆర్‌.ఐల ఆగడాలు ఆగుతాయి’ అంటుంది సత్వీందర్‌. పంజాబ్, హరియాణాలలో అయితే సత్వీందర్‌ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు ఎందరు ఉన్నారో తెలియాల్సి ఉంది. వారి కోసం సత్వీందర్‌లాంటి వాళ్ల అవసరం తప్పక ఉంటుందని వేరే చెప్పాలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement