సీకో హషిమొటొ, టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్
టోక్యో ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో నిన్న ఒక్కరోజే 12 మంది మహిళలు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇప్పటికే ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి 19 మంది! దీంతో బోర్డులో మహిళల శాతం 42 అయింది. (మొత్తం సభ్యులు 45 మంది). ఈ మెరుపు నియామకాలు చేపట్టింది ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీకి కొత్తగా వచ్చిన మహిళా ప్రెసిడెంట్ సీకో హషిమొటొ.
‘బోర్డు మీటింగులలో ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడతారు‘ అని కామెంట్ చేసి, ప్రెసిడెంట్ పదవి పోగొట్టుకున్న 83 ఏళ్ల యషిరొ మొరి స్థానంలోకి వచ్చిన మహిళే హషిమొటొ. ‘ఎక్కువ మాట్లాడతారు‘ అనే కామెంట్ కు తగిన సమాధానంగా ఎక్కువ మంది మహిళలను బోర్డు రూమ్ లోకి తీసుకున్న హషిమొటొ.. జెండర్ ఈక్వాలిటీ కోసం మరికొన్ని చేర్పులు కూడా ఉంటాయంటున్నారు.
టోక్యో ఒలింపిక్స్ దగ్గర పడ్డాయి. జూలై 23 నుంచి ఒలింపిక్స్, తర్వాతి నెలకే ఆగస్టు 24 నుంచి పారా ఒలింపిక్స్. ఈ రెండు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ కమిటీ ప్రెసిడెంట్ ఒక మహిళ. సీకో హషిమొటొ. ఆమె కూడా ఒకప్పుడు క్రీడాకారిణే. ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్‌లో కాంస్య పతకం సాధించారు. ఇప్పుడిక ఒలింపిక్స్ నిర్వహణ అధికారాలలో స్త్రీ సాధికారతను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కమిటీ ప్రెసిడెంట్ పదవి అకస్మాత్తుగా ఖాళీ అవడంతో గత వారమే హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చారు.
ప్రెసిడెంటుగా తన తొలి ప్రసంగంలో ఆమె చెప్పిన మాట.. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులలో మహిళల సంఖ్యను పెంచబోతున్నానని. చెప్పినట్లే మొన్న బుధవారం ఒకేసారి పన్నెండు మంది మహిళలను బోర్డు సభ్యులుగా నియమించారు హషిమొటో! బోర్డులో మొదట ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి మొత్తం ఇప్పుడు పందొమ్మిది మంది అయ్యారు. ఈ పన్నెండు మందిని చేర్చుకోవడం కోసమే బోర్డులోని మొత్తం సభ్యుల సంఖ్యను 35 నుంచి 45కు పెంచారు హషిమొటో. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. స్త్రీలపై పాత ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలకు తగిన సమాధానం కూడా అయింది!
∙∙
సీకో హషిమొటోకు ముందరి ప్రెసిడెంట్ యషిరో మొరి. నిజానికి ఆయన నేతృత్వంలోనే ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ టోక్యో ఒలింపిక్స్‌ని నిర్వహించవలసి ఉంది. మీటింగుల మీద మీటింగులు జరుగుతున్నాయి. మీడియాకు ఎప్పటికప్పుడు మీటింగులలో మాట్లాడుకున్న నిర్వహణ వివరాలు ఆయనే అందించాలి. అలా అందిస్తున్న క్రమంలోనే యషిరో మాట జారారు. ‘‘మీటింగులలో ఈ ఆడవాళ్లు ఎందుకంత ఎక్కువగా మాట్లాడతారో!’’ అని అన్నారు. అలా అనడం వివాదం అయింది. జపాన్‌లోని మహిళా కమిషన్‌లు, సంఘాలు ఆయన అలా అనడాన్ని ఖండించాయి. యూనివర్సిటీ విద్యార్థినులు యషీరో రాజీనామాను కోరుతూ ప్రదర్శనలు జరిపారు. ‘‘క్షమాపణలు చెబితే సరిపోదు, రాజీనామా చేయాల్సిందే’’ అని పట్టుపట్టారు. ప్రభుత్వానికి తలవొగ్గక తప్పలేదు. ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలోకి హషిమొటొ వచ్చారు. ఈ అధికార మార్పిడంతా వారం పది రోజుల్లోనే జరిగిపోయింది.
ఆడవాళ్లు మీటింగులలో ఎక్కువ మాట్లాడతారని అన్నందుకు జవాబుగా అన్నట్లు ఎక్కువమంది ఆడవాళ్లను బోర్డులోకి తీసుకున్నారు హషిమొటో. ‘‘వేగంగా పని చేసి, గట్టి ఫలితాలను సాధిస్తే మనం ఏమిటో రుజువు అవుతుంది’’ అని తన తొలి బోర్డు మీటింగులోనే మహిళల్ని ఉత్సాహపరిచారు హషిమొటొ. ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ ర్యాంకుల ప్రకారం స్త్రీ పురుష సమానత్వంలో జపాన్ 135 దేశాలలో 121వ స్థానంలో ఉంది. ఆ అంతరాన్ని తగ్గించడం కోసం అన్ని రంగాల బోర్డు రూమ్‌లలో మహిళల సంఖ్యను పెంచడం ఒక మార్గం అని కూడా ఫోరమ్ అభిప్రాయపడింది. ఆ విషయాన్నే చెబుతూ.. ఈ నెల 25న ఒలింపిక్ జ్యోతి తన ప్రయాణాన్ని ప్రారంభించేనాటికి బోర్డులో మరికొన్ని మార్పులు తేబోతున్నట్లు హషిమొటొ తెలిపారు. బోర్డులో ప్రస్తుతం ఏడుగురు వైస్–ప్రెసిడెంట్‌లు ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే మహిళ. బహుశా మహిళా వైస్–ప్రెసిడెంట్‌ల సంఖ్యను కూడా హషిమొటొ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆ సంగతిని శుక్రవారం వెల్లడించబోతున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment