olympic organization
-
టోక్యో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులకు అనుమతి
టోక్యో: ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కేవలం జపాన్ వాసులకే పరిమితం చేశారు. అంతేకాకుండా గేమ్స్ జరిగే వేదికల కెపాసిటీలో 50 శాతం మంది ప్రేక్షకుల (అది కూడా 10 వేలకు మించకుండా)ను అనుమతించనున్నారు. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహించడం మంచిదని ఆర్గనైజర్లకు జపాన్ దేశ ప్రముఖ వైద్య సలహాదారుడు షిగెరు ఒమీ సూచించగా.. ఆ సూచనను ఆర్గనైజర్లు పట్టించుకోలేదు. ఒలింపిక్స్ జరిగే సమయంలో కరోనా కేసులు పెరిగితే అప్పుడు ప్రేక్షకులు లేకుండానే ఈవెంట్‌ను నిర్వహించేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో తెలిపారు. కరోనా కారణంగా ఈసారి ఒలింపిక్స్ క్రీడలను తిలకించేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించడం లేదు. -
మహిళలు ఎక్కువే మాట్లాడాలి
టోక్యో ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో నిన్న ఒక్కరోజే 12 మంది మహిళలు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇప్పటికే ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి 19 మంది! దీంతో బోర్డులో మహిళల శాతం 42 అయింది. (మొత్తం సభ్యులు 45 మంది). ఈ మెరుపు నియామకాలు చేపట్టింది ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీకి కొత్తగా వచ్చిన మహిళా ప్రెసిడెంట్ సీకో హషిమొటొ. ‘బోర్డు మీటింగులలో ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడతారు‘ అని కామెంట్ చేసి, ప్రెసిడెంట్ పదవి పోగొట్టుకున్న 83 ఏళ్ల యషిరొ మొరి స్థానంలోకి వచ్చిన మహిళే హషిమొటొ. ‘ఎక్కువ మాట్లాడతారు‘ అనే కామెంట్ కు తగిన సమాధానంగా ఎక్కువ మంది మహిళలను బోర్డు రూమ్ లోకి తీసుకున్న హషిమొటొ.. జెండర్ ఈక్వాలిటీ కోసం మరికొన్ని చేర్పులు కూడా ఉంటాయంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ దగ్గర పడ్డాయి. జూలై 23 నుంచి ఒలింపిక్స్, తర్వాతి నెలకే ఆగస్టు 24 నుంచి పారా ఒలింపిక్స్. ఈ రెండు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ కమిటీ ప్రెసిడెంట్ ఒక మహిళ. సీకో హషిమొటొ. ఆమె కూడా ఒకప్పుడు క్రీడాకారిణే. ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్‌లో కాంస్య పతకం సాధించారు. ఇప్పుడిక ఒలింపిక్స్ నిర్వహణ అధికారాలలో స్త్రీ సాధికారతను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కమిటీ ప్రెసిడెంట్ పదవి అకస్మాత్తుగా ఖాళీ అవడంతో గత వారమే హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చారు. ప్రెసిడెంటుగా తన తొలి ప్రసంగంలో ఆమె చెప్పిన మాట.. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులలో మహిళల సంఖ్యను పెంచబోతున్నానని. చెప్పినట్లే మొన్న బుధవారం ఒకేసారి పన్నెండు మంది మహిళలను బోర్డు సభ్యులుగా నియమించారు హషిమొటో! బోర్డులో మొదట ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి మొత్తం ఇప్పుడు పందొమ్మిది మంది అయ్యారు. ఈ పన్నెండు మందిని చేర్చుకోవడం కోసమే బోర్డులోని మొత్తం సభ్యుల సంఖ్యను 35 నుంచి 45కు పెంచారు హషిమొటో. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. స్త్రీలపై పాత ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలకు తగిన సమాధానం కూడా అయింది! ∙∙ సీకో హషిమొటోకు ముందరి ప్రెసిడెంట్ యషిరో మొరి. నిజానికి ఆయన నేతృత్వంలోనే ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ టోక్యో ఒలింపిక్స్‌ని నిర్వహించవలసి ఉంది. మీటింగుల మీద మీటింగులు జరుగుతున్నాయి. మీడియాకు ఎప్పటికప్పుడు మీటింగులలో మాట్లాడుకున్న నిర్వహణ వివరాలు ఆయనే అందించాలి. అలా అందిస్తున్న క్రమంలోనే యషిరో మాట జారారు. ‘‘మీటింగులలో ఈ ఆడవాళ్లు ఎందుకంత ఎక్కువగా మాట్లాడతారో!’’ అని అన్నారు. అలా అనడం వివాదం అయింది. జపాన్‌లోని మహిళా కమిషన్లు, సంఘాలు ఆయన అలా అనడాన్ని ఖండించాయి. యూనివర్సిటీ విద్యార్థినులు యషీరో రాజీనామాను కోరుతూ ప్రదర్శనలు జరిపారు. ‘‘క్షమాపణలు చెబితే సరిపోదు, రాజీనామా చేయాల్సిందే’’ అని పట్టుపట్టారు. ప్రభుత్వానికి తలవొగ్గక తప్పలేదు. ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలోకి హషిమొటొ వచ్చారు. ఈ అధికార మార్పిడంతా వారం పది రోజుల్లోనే జరిగిపోయింది. ఆడవాళ్లు మీటింగులలో ఎక్కువ మాట్లాడతారని అన్నందుకు జవాబుగా అన్నట్లు ఎక్కువమంది ఆడవాళ్లను బోర్డులోకి తీసుకున్నారు హషిమొటో. ‘‘వేగంగా పని చేసి, గట్టి ఫలితాలను సాధిస్తే మనం ఏమిటో రుజువు అవుతుంది’’ అని తన తొలి బోర్డు మీటింగులోనే మహిళల్ని ఉత్సాహపరిచారు హషిమొటొ. ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ ర్యాంకుల ప్రకారం స్త్రీ పురుష సమానత్వంలో జపాన్ 135 దేశాలలో 121వ స్థానంలో ఉంది. ఆ అంతరాన్ని తగ్గించడం కోసం అన్ని రంగాల బోర్డు రూమ్‌లలో మహిళల సంఖ్యను పెంచడం ఒక మార్గం అని కూడా ఫోరమ్ అభిప్రాయపడింది. ఆ విషయాన్నే చెబుతూ.. ఈ నెల 25న ఒలింపిక్ జ్యోతి తన ప్రయాణాన్ని ప్రారంభించేనాటికి బోర్డులో మరికొన్ని మార్పులు తేబోతున్నట్లు హషిమొటొ తెలిపారు. బోర్డులో ప్రస్తుతం ఏడుగురు వైస్–ప్రెసిడెంట్లు ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే మహిళ. బహుశా మహిళా వైస్–ప్రెసిడెంట్ల సంఖ్యను కూడా హషిమొటొ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆ సంగతిని శుక్రవారం వెల్లడించబోతున్నట్లు ఆమె తెలిపారు. -
ముగ్గురి వల్ల ఆ దేశం మరోసారి వార్తల్లోకెక్కింది..
భూకంపాలో, సునామీలో వస్తే తప్ప జపాన్ సాధారణంగా వార్తల్లో ఉండదు. తన మానాన తను ఉంటుంది. అయితే ఇప్పుడా జపాన్ని ముగ్గురు మహిళలు వార్తల్లోకి తెచ్చారు. ఆ ముగ్గురూ.. సికొ హషిమొటొ (56), మమొకొ నొజొ (22), నవోమి ఒసాక (23). షహిమొటో రాజకీయ నాయకురాలు. మమొకొ నొజొ విద్యార్థిని. నవొమి ఒసాక టెన్నిస్ ప్లేయర్. ఒక ఆర్డర్లో అయితే ముందుగా నవొమి ఒసాక గురించి చెప్పుకోవాలి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇవాళ ఉమెన్స్ సింగిల్ ఫైనల్స్ ఆడుతున్నారు ఆమె. అంటే ఫైనల్ వరకు వచ్చారని గొప్పగా చెప్పుకోవడం కాదు. శుక్రవారం నాడు టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ని ఓడించి మరీ ఆమె ఫైనల్స్‌కి చేరున్నారు. ఈ రోజు ఆమె తలపడుతున్నది అమెరికన్ ప్లేయర్ జెన్నిఫర్ బ్రాడీ మీద. జెన్నిఫర్ ర్యాకెట్ శక్తీ తక్కువేమీ కాదు. పైగా ఒక అమెరికన్ (సెరెనా) ని ఒసాక ఓడించినందుకు బదులుగా ఇంకో అమెరికన్ (జెన్నిఫర్) ఆమెను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలి అని యూఎస్ లోని సెరెనా అభిమానులు కోరుకుంటున్నారు. వారికంటే ఎక్కువగా.. టైటిల్‌ను ఒసాక గెలుచుకోవాలని జపాన్ క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సెరెనానే ఓడించిందంటే జెన్నిఫర్ ఎంత అనే అనుమానాలూ అమెరికాలో ఉన్నాయి. ఒసాక జపాన్ దేశస్థురాలే అయినా ఉండటం అమెరికాలోనే. సికొ హషిమొటొ ఇప్పుడిక రాజకీయ నేత హషిమొటో గానీ, విద్యార్థిని మమొకో గానీ.. ఈ ఇద్దరిలో మొదట ఎవరి గురించి చెప్పుకున్నా రెండోవారిని తక్కువ చెయ్యడం కాదు. వేర్వేరు రంగాల వారైనా ఇద్దరూ ఒకే విషయమై వార్తల్లోకి వచ్చినవారు. వయసులో పెద్ద కనుక హషిమొటోకే ప్రాధాన్యం ఇద్దాం. గురువారం ఆమె ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వం నుంచి వస్తుంది ఆ ఆర్డర్. ఇంకో ఐదు నెలల్లో జపాన్‌లో ఒలింపిక్ గేమ్స్ ఉండగా.. జరిగిన నియామకం ఇది. కమిటీకి చీఫ్‌గా ఇటీవలి వరకు ఉన్న యషిరో మొరి (83) గత శుక్రవారం ఆ పదవికి తప్పనిసరై రాజీనామా చేయవలసి వచ్చింది. జపాన్ మాజీ ప్రధాని కూడా యహిరో మొరి. ఆయనంతటి వారు రాజీనామా చేయవలసి రావడానికి కారణం.. మహిళలపై ఆయన చేసిన కామెంట్లే. ‘‘మీటింగ్స్‌లో ఈ ఆడవాళ్లు ఓవర్‌గా మాట్లాడతారబ్బా.. అదేం అలవాటో’’ అని అన్నారు ఆయన. ఆ మాటలే ఆయన పదవి మీదకు కత్తిని తెచ్చాయచి. అలా ఖాళీ అయిన ఆ సీట్లోకే హషిమొటో వచ్చారు. ప్రస్తుతం ఆమె జపాన్ కేబినెట్లో ‘ఈక్వాలిటీ మినిస్టర్’. ఆ మంత్రి బాధ్యతలకు కొంతకాలం విరామం ఇచ్చి ఒలింపిక్స్ ఏర్పాట్ల విధి నిర్వహణలో ఉండబోతున్నారు. మమొకొ నొజొ అసలు ఆ పెద్దాయన యషిరో మొరి ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్‌గా నిష్క్రమించడానికి కారణం మమొకొ నొజొ విద్యార్థిని. ‘ఆ స్థాయిలో ఉండి మహిళలపై అలాంటి కామెంట్స్ చేయడం తగని పని. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’ అని నొజొ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే లేవదీశారు.‘డోంట్ బి సైలెంట్’ అంటూ ఆన్లైన్లో లక్షా 50 వేల సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. టోక్యోలోని కియో యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం అర్థశాస్త్రం చదువుతున్నారు ఆమె. చదువే కాకుండా.. ‘నో యూత్ నో జపాన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, సామాజిక అంశాలపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు. జపాన్‌లో పురుషాధిపత్యం ఎక్కువగా ఉందని అంటున్న నొజొ.. స్త్రీ పురుష అసమానతలపై స్పందించే వారు జపాన్‌లో నానాటికీ తగ్గిపోతున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్ కమిటీ చీఫ్‌ని మార్చేలా చేయడం ద్వారా నొజొ విజయం సాధించారు. ఒలింపిక్ కమిటీకి కొత్తగా వచ్చిన హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చిన ఒక మహిళగా విజేతగా నిలిచారు. ఈరోజు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో ఒసాకా తన ప్రత్యర్థిని ఓడిస్తే అదొక విజయం అవుతుంది. ముగ్గురూ ముగ్గురే. -
ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చయింది?
ప్రపంచ క్రీడాకారుల్లో కొందరికి మధుర జ్ఞాపకాలను, కొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చి రియో ఒలింపిక్స్ చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఇలాంటి ఒలింపిక్స్ నిర్వహించాలంటే ఏ దేశానికైనా ఎంత ఖర్చవుతుంది? ఇప్పటివరకు ఏయే ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చయిందన్నది ఆసక్తికరమైన అంశం. నాలుగేళ్లకోసారి నిర్వహించే సమ్మర్ ఒలింపిక్స్‌కు సరాసరి సగటున 520 కోట్ల డాలర్లు (2015 సంవత్సరం నాటి అమెరికా కరెన్సీ లెక్కల ప్రకారం), అంటే భారత కరెన్సీలో దాదాపు 34,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, అదే వింటర్ ఒలింపిక్స్‌కు 310 కోట్ల డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 20,806 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, దానికి అనుబంధంగా పనిచేస్తున్న బిజినెస్ స్కూల్ విభాగానికి చెందిన ఆర్థిక నిపుణులు లెక్కలు వేశారు. స్టేడియాల నిర్మాణం, క్రీడాకారులకు వసతి, రవాణా సౌకర్యాలు కాకుండా కేవలం క్రీడల నిర్వహణకే ఇంత ఖర్చవుతుందని వారు తేల్చారు. ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించిన గణాంకాలు 1964 నుంచే అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు ఈ క్రీడల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో గణాంకాలు అందుబాటులో లేవు. గతంలో ప్రతి ఒలింపిక్స్‌కు అంచనాలకు మించి వంద శాతానికన్నా ఎక్కువగా ఖర్చు అవుతుండగా, గతానుభవాల రీత్యా రియో ఒలింపిక్స్ ఖర్చు అంచనాలకన్నా 50 శాతం మాత్రమే ఎక్కువ ఖర్చయింది. ఏదేమైనా ఖర్చు మాత్రం ఒక ఒలింపిక్స్ నుంచి మరో ఒలింపిక్స్‌కు పెరుగుతూనే ఉంది. 2012 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్ అత్యంత ఖరీదైనవిగా చరిత్ర సృష్టించింది. ఆ ఒలింపిక్స్‌కు 1500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 970 కోట్ల డాలర్ల ఖర్చుతో బార్సిలోనా ఒలింపిక్స్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. 1964లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌కు 28.20 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. అదే సంవత్సరం జరిగిన ఇన్స్‌బర్క్ వింటర్ ఒలింపిక్స్‌కు 2.20 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చయ్యాయి. లండన్‌లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌కు బడ్జెట్ అంచనాలకు మించి 76 శాతం ఎక్కువ నిధులు ఖర్చు కాగా, సోచిలో 2014లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌కు బడ్జెట్ అంచనాలకు మించి 289 శాతం ఎక్కువ నిధులు ఖర్చయ్యాయి. అత్యధికంగా ఖర్చయిన వింటర్ ఒలింపిక్స్‌గా అది రికార్డులకు ఎక్కింది. ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ నిర్వహణకు 460 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని తొలుత అంచనా వేశారు. కానీ దానికన్నా 51 శాతం ఎక్కువ నిధులు ఖర్చయ్యాయి. ఒలింపిక్స్ క్రీడల 'నాలెడ్జ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్' కింద గత ఒలింపిక్స్‌కు జరిగిన ఖర్చులను పంచుకోవడం ద్వారా అంచనాలకు, వాస్తవ ఖర్చులకు భారీ వ్యత్యాసం కాస్త తగ్గింది.