executive board
-
మహిళలు ఎక్కువే మాట్లాడాలి
టోక్యో ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో నిన్న ఒక్కరోజే 12 మంది మహిళలు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇప్పటికే ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి 19 మంది! దీంతో బోర్డులో మహిళల శాతం 42 అయింది. (మొత్తం సభ్యులు 45 మంది). ఈ మెరుపు నియామకాలు చేపట్టింది ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీకి కొత్తగా వచ్చిన మహిళా ప్రెసిడెంట్ సీకో హషిమొటొ. ‘బోర్డు మీటింగులలో ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడతారు‘ అని కామెంట్ చేసి, ప్రెసిడెంట్ పదవి పోగొట్టుకున్న 83 ఏళ్ల యషిరొ మొరి స్థానంలోకి వచ్చిన మహిళే హషిమొటొ. ‘ఎక్కువ మాట్లాడతారు‘ అనే కామెంట్ కు తగిన సమాధానంగా ఎక్కువ మంది మహిళలను బోర్డు రూమ్ లోకి తీసుకున్న హషిమొటొ.. జెండర్ ఈక్వాలిటీ కోసం మరికొన్ని చేర్పులు కూడా ఉంటాయంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ దగ్గర పడ్డాయి. జూలై 23 నుంచి ఒలింపిక్స్, తర్వాతి నెలకే ఆగస్టు 24 నుంచి పారా ఒలింపిక్స్. ఈ రెండు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ కమిటీ ప్రెసిడెంట్ ఒక మహిళ. సీకో హషిమొటొ. ఆమె కూడా ఒకప్పుడు క్రీడాకారిణే. ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్‌లో కాంస్య పతకం సాధించారు. ఇప్పుడిక ఒలింపిక్స్ నిర్వహణ అధికారాలలో స్త్రీ సాధికారతను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కమిటీ ప్రెసిడెంట్ పదవి అకస్మాత్తుగా ఖాళీ అవడంతో గత వారమే హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చారు. ప్రెసిడెంటుగా తన తొలి ప్రసంగంలో ఆమె చెప్పిన మాట.. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులలో మహిళల సంఖ్యను పెంచబోతున్నానని. చెప్పినట్లే మొన్న బుధవారం ఒకేసారి పన్నెండు మంది మహిళలను బోర్డు సభ్యులుగా నియమించారు హషిమొటో! బోర్డులో మొదట ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి మొత్తం ఇప్పుడు పందొమ్మిది మంది అయ్యారు. ఈ పన్నెండు మందిని చేర్చుకోవడం కోసమే బోర్డులోని మొత్తం సభ్యుల సంఖ్యను 35 నుంచి 45కు పెంచారు హషిమొటో. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. స్త్రీలపై పాత ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలకు తగిన సమాధానం కూడా అయింది! ∙∙ సీకో హషిమొటోకు ముందరి ప్రెసిడెంట్ యషిరో మొరి. నిజానికి ఆయన నేతృత్వంలోనే ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ టోక్యో ఒలింపిక్స్‌ని నిర్వహించవలసి ఉంది. మీటింగుల మీద మీటింగులు జరుగుతున్నాయి. మీడియాకు ఎప్పటికప్పుడు మీటింగులలో మాట్లాడుకున్న నిర్వహణ వివరాలు ఆయనే అందించాలి. అలా అందిస్తున్న క్రమంలోనే యషిరో మాట జారారు. ‘‘మీటింగులలో ఈ ఆడవాళ్లు ఎందుకంత ఎక్కువగా మాట్లాడతారో!’’ అని అన్నారు. అలా అనడం వివాదం అయింది. జపాన్‌లోని మహిళా కమిషన్లు, సంఘాలు ఆయన అలా అనడాన్ని ఖండించాయి. యూనివర్సిటీ విద్యార్థినులు యషీరో రాజీనామాను కోరుతూ ప్రదర్శనలు జరిపారు. ‘‘క్షమాపణలు చెబితే సరిపోదు, రాజీనామా చేయాల్సిందే’’ అని పట్టుపట్టారు. ప్రభుత్వానికి తలవొగ్గక తప్పలేదు. ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలోకి హషిమొటొ వచ్చారు. ఈ అధికార మార్పిడంతా వారం పది రోజుల్లోనే జరిగిపోయింది. ఆడవాళ్లు మీటింగులలో ఎక్కువ మాట్లాడతారని అన్నందుకు జవాబుగా అన్నట్లు ఎక్కువమంది ఆడవాళ్లను బోర్డులోకి తీసుకున్నారు హషిమొటో. ‘‘వేగంగా పని చేసి, గట్టి ఫలితాలను సాధిస్తే మనం ఏమిటో రుజువు అవుతుంది’’ అని తన తొలి బోర్డు మీటింగులోనే మహిళల్ని ఉత్సాహపరిచారు హషిమొటొ. ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ ర్యాంకుల ప్రకారం స్త్రీ పురుష సమానత్వంలో జపాన్ 135 దేశాలలో 121వ స్థానంలో ఉంది. ఆ అంతరాన్ని తగ్గించడం కోసం అన్ని రంగాల బోర్డు రూమ్‌లలో మహిళల సంఖ్యను పెంచడం ఒక మార్గం అని కూడా ఫోరమ్ అభిప్రాయపడింది. ఆ విషయాన్నే చెబుతూ.. ఈ నెల 25న ఒలింపిక్ జ్యోతి తన ప్రయాణాన్ని ప్రారంభించేనాటికి బోర్డులో మరికొన్ని మార్పులు తేబోతున్నట్లు హషిమొటొ తెలిపారు. బోర్డులో ప్రస్తుతం ఏడుగురు వైస్–ప్రెసిడెంట్లు ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే మహిళ. బహుశా మహిళా వైస్–ప్రెసిడెంట్ల సంఖ్యను కూడా హషిమొటొ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆ సంగతిని శుక్రవారం వెల్లడించబోతున్నట్లు ఆమె తెలిపారు. -
డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి
న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నియమితులయ్యారు. మే 22న ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా అధికారులు తెలిపారు. 34 మంది సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ప్రస్తుతం జపాన్‌కు చెందిన హిరోకి నకటాని ఉన్నారు. హిరోకి పదవీకాలం ముగియడంతో హర్షవర్దన్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.హర్షవర్ధన్ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. డబ్ల్యూహెచ్ఓ విధానపరమైన నిర్ణయాల్లో కార్యనిర్వాహక బోర్డు కీలక భూమిక పోషిస్తుంది. డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా భారత ప్రతినిధిని నియమించే ప్రతిపాదనకు మంగళవారం 194 దేశాల సభ్యత్వం ఉన్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ పదవికి భారత్‌ను నామినేట్ చేస్తూ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య గతేడాదే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్షవర్దన్ నియామకం లాంఛనప్రాయం అయినట్టుగా కనిపిస్తోంది. (చదవండి : డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం) -
‘పట్టు’ నిలబడేనా!
ఒలింపిక్స్‌లో చోటు కోసం స్క్వాష్‌తో రెజ్లింగ్ పోటీ బరిలో బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ కూడా నేడు ఖరారు చేయనున్న ఐఓసీ న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగు వ్యక్తిగత పతకాలు అందించిన రెజ్లింగ్ భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. 2020 ఒలింపిక్స్‌లో చేర్చాల్సిన ఒక క్రీడ కోసం బ్యూనస్ ఎయిర్స్లో ఆదివారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కానుంది. ఏ క్రీడను చేర్చాలో నిర్ణయించేందుకు ఈ సమావేశంలో ఓటింగ్ జరుగుతుంది. 2020 ఒలింపిక్స్‌లో చోటు కోసం రెజ్లింగ్‌తో పాటు స్క్వాష్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ (సంయుక్తంగా) పోటీ పడుతున్నాయి. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ఐఓసీ సూచించిన సవరణలు పాటించి రెజ్లింగ్ తమ అవకాశాలు మెరుగుపర్చుకోగా... చక్కటి టీవీ ప్రజెంటేషన్‌తో స్క్వాష్ కూడా గత ఐఓసీ సమావేశంలో ఆకట్టుకుంది. పేరుకు మూడు ఆటలు ఉన్నా ప్రధానంగా రెజ్లింగ్, స్క్వాష్ మధ్యే గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు క్రీడలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే... రెజ్లింగ్ 1900వ సంవత్సరంలో మినహా ప్రతీసారి రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో భాగమైంది. ప్రాచీన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆటగా కుస్తీకి పోటీ ఉంది. ఏడు నెలల క్రితం ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్‌ను తొలగిస్తున్నామని ఐఓసీ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఈ క్రీడలో కొత్త మార్పులతో ముందుకు వచ్చింది. ఒలింపిక్స్‌లో మహిళల కోసం కూడా మరిన్ని కేటగిరీలు పెంచేందుకు సిద్ధమైంది. దీని వల్లే రెజ్లింగ్ తుది జాబితాలో నిలిచింది. ఆరు ఖండాలకు చెందిన 177 దేశాల్లో ప్రాచుర్యంలో ఉండటం... గత లండన్ ఒలింపిక్స్‌లో 71 దేశాలు పాల్గొనడంతో పాటు 29 దేశాలకు చెందిన వారు పతకాలు గెల్చుకోవడం రెజ్లింగ్‌కు అనుకూలాంశం. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు నెజాది ఈ ఆటను కొనసాగించాలని బహిరంగంగా మద్దతు పలికారు. స్క్వాష్ ఇప్పటి వరకు స్క్వాష్ ఒలింపిక్స్‌లో లేదు. ఒలింపిక్స్‌లో చోటు పొందేందుకు గత పదేళ్లుగా పోరాడుతున్నట్లు స్క్వాష్ సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఈ ఆటకు ప్రస్తుతం 185 దేశాల్లో ఆదరణ ఉందని, కొత్త తరం ఆటగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని స్క్వాష్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రీడ ఇప్పటికీ టీవీలో గానీ, ప్రత్యక్షంగా గానీ చూసే ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందించలేకపోతోంది. ‘స్క్వాష్ ప్రతినిధులు తమ ఆట గురించి అద్భుతమై ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు రీడీ వ్యాఖ్యానించడం అనుకూల పరిణామం. భారత క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్‌లతో పాటు ఫెడరర్, ముర్రేలాంటి టెన్నిస్ దిగ్గజాలు ఈ ఆటకు మద్దతుగా నిలిచారు. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ ఒలింపిక్స్‌లో చోటు కోసం రెండు క్రీడలూ కలిసి సంయుక్తంగా పోటీ పడుతున్నాయి. ప్రపంచ బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ సమాఖ్య తమకు అవకాశం కల్పించాలంటూ బరిలో నిలిచింది. బేస్‌బాల్‌కు అమెరికాలో అమిత జనాదరణ ఉండగా, సాఫ్ట్‌బాల్‌ను 140 దేశాల్లో ఆడతారు. ఈ ఆటలో కొన్ని నిబంధనలు ఒలింపిక్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. తాము స్థానం దక్కించుకోవడం అంత సులువు కాదని సంబంధిత వర్గాలే అనుమానం వ్యక్తం చేశాయి. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ కలిసి బిడ్ వేయడం పట్ల కూడా చాలా మందిలో అసంతృప్తి ఉంది. 1996 ఒలింపిక్స్‌లో తొలి సారి ప్రవేశించిన సాఫ్ట్‌బాల్‌ను ఆ తర్వాత తొలగించారు. -
ఐఓఏకు ఎదురుదెబ్బ
బ్యూనస్ ఎయిర్స్: చార్జిషీట్ దాఖలైన వ్యక్తుల విషయంలో తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారు ఐఓఏ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందేనని మరోసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. బుధవారం జరిగిన తమ ఎగ్జిక్యూటివ్ బోర్డు (ఈబీ) సమావేశంలో పాత నిర్ణయానికే కట్టుబడి ఉండాలని తీర్మానించింది. ఆగస్టులో జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో చార్జిషీట్ దాఖలైన వ్యక్తుల విషయంలో ఐఓఏ కొన్ని సవరణలు చేసింది. రెండేళ్లకుపైగా శిక్ష పడినవారే ఎన్నికలకు దూరంగా ఉంటారని ప్రతిపాదించింది. అయితే ఎన్నికల్లో తాము ఇంతకుముందు చెప్పిన అన్ని నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిందేనని ఐఓసీ తేల్చి చెప్పింది. మాపై ఒత్తిడి తేవద్దు: ఐఓఏ న్యూఢిల్లీ: భారత చట్టాలకు లోబడే తాము ముందుకు వెళుతున్నామని భారత ఒలింపిక్ సంఘం స్పష్టం చేసింది. చార్జిషీట్ దాఖలైన వ్యక్తులు ఇక్కడ పార్లమెంట్‌కు పోటీ చేసే వె సులుబాటు ఉందని గుర్తుచేసింది. నిబంధనలు పాటించాలి: జితేంద్ర సింగ్ చార్జిషీట్ దాఖలైన వారి విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సూచనలను కచ్చితంగా పాటించాలని భారత ఒలింపిక్ సంఘానికి క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ సూచించారు. ‘మంచి పరిపాలన కోసమే ఐఓసీ ప్రయత్నిస్తోంది. కాబట్టి వారి నిబంధనలు అంగీకరిస్తే మంచిది. ఒలింపిక్ చార్టర్‌ను అనుసరించి ఐఓఏ తమ రాజ్యాంగ సవరణ చేయకపోవడం విచారకరం’ అని మంత్రి అన్నారు.