చార్జిషీట్ దాఖలైన వ్యక్తుల విషయంలో తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
బ్యూనస్ ఎయిర్స్: చార్జిషీట్ దాఖలైన వ్యక్తుల విషయంలో తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారు ఐఓఏ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందేనని మరోసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది.
బుధవారం జరిగిన తమ ఎగ్జిక్యూటివ్ బోర్డు (ఈబీ) సమావేశంలో పాత నిర్ణయానికే కట్టుబడి ఉండాలని తీర్మానించింది. ఆగస్టులో జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో చార్జిషీట్ దాఖలైన వ్యక్తుల విషయంలో ఐఓఏ కొన్ని సవరణలు చేసింది. రెండేళ్లకుపైగా శిక్ష పడినవారే ఎన్నికలకు దూరంగా ఉంటారని ప్రతిపాదించింది. అయితే ఎన్నికల్లో తాము ఇంతకుముందు చెప్పిన అన్ని నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిందేనని ఐఓసీ తేల్చి చెప్పింది.
మాపై ఒత్తిడి తేవద్దు: ఐఓఏ
న్యూఢిల్లీ: భారత చట్టాలకు లోబడే తాము ముందుకు వెళుతున్నామని భారత ఒలింపిక్ సంఘం స్పష్టం చేసింది. చార్జిషీట్ దాఖలైన వ్యక్తులు ఇక్కడ పార్లమెంట్‌కు పోటీ చేసే వె సులుబాటు ఉందని గుర్తుచేసింది.
నిబంధనలు పాటించాలి: జితేంద్ర సింగ్
చార్జిషీట్ దాఖలైన వారి విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సూచనలను కచ్చితంగా పాటించాలని భారత ఒలింపిక్ సంఘానికి క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ సూచించారు. ‘మంచి పరిపాలన కోసమే ఐఓసీ ప్రయత్నిస్తోంది. కాబట్టి వారి నిబంధనలు అంగీకరిస్తే మంచిది. ఒలింపిక్ చార్టర్‌ను అనుసరించి ఐఓఏ తమ రాజ్యాంగ సవరణ చేయకపోవడం విచారకరం’ అని మంత్రి అన్నారు.