
న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యానిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నియమితులయ్యారు. మే 22న ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా అధికారులు తెలిపారు. 34 మంది సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ప్రస్తుతం జపాన్‌కు చెందిన హిరోకి నకటాని ఉన్నారు. హిరోకి పదవీకాలం ముగియడంతో హర్షవర్దన్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.హర్షవర్ధన్ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. డబ్ల్యూహెచ్ఓ విధానపరమైన నిర్ణయాల్లో కార్యనిర్వాహక బోర్డు కీలక భూమిక పోషిస్తుంది.
డబ్ల్యూహెచ్‌ఓ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా భారత ప్రతినిధిని నియమించే ప్రతిపాదనకు మంగళవారం 194 దేశాల సభ్యత్వం ఉన్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. కాగా, డబ్ల్యూహెచ్‌ఓ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ పదవికి భారత్‌ను నామినేట్ చేస్తూ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య గతేడాదే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్షవర్దన్ నియామకం లాంఛనప్రాయం అయినట్టుగా కనిపిస్తోంది. (చదవండి : డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతాం)