
ఏడుపదుల వయసు దాటాక ఇంక చేసేదేముంది అని చాలామందిలో ఒక నిరుత్సాహపూరితమైన అభి్రపాయం ఉంటుంది. కానీ, చేయాలనుకున్న పనిని చేసి చూపించాలనుకునేవారికి వయసు అనేది ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్నారు ఈ బామ్మలు. కుటుంబ జీవనంలో గృహిణిగా, తల్లిగా బాధ్యతలు అన్నీ నిర్వర్తించాక తమకంటూ ఉన్న హాబీలు ఏవైనా ఉంటే వాటిని కొనసాగిస్తుంటారు కొందరు. హాబీనే వ్యాపారంగా మార్చుకొని ఏడు పదులు దాటిన వయసులోనూ
సంపాదనపరులుగా మారినవారి నుంచి మనమూ స్ఫూర్తిని పొందుదాం.
పద్మ పరిఖా ఏడుపదులు దాటి రెండు దశాబ్దాలు అయ్యింది. సరదాగా నేర్చుకున్న క్రోషెట్ అల్లికలతో తన ఇంట్లో పిల్లలకు డ్రెస్సులు రూపొందించేది. కొన్ని రకాల షో పీసులను అల్లికతో అందంగా తయారు చేసేది. పదేళ్ల క్రితం ఆమె మనమరాలు బామ్మ వర్క్‌కు ఆదరణ కల్పించాలనుకుంది. ఆమె ్రపోత్సాహంతో పి.బి. హ్యాండ్‌మేడ్.ఔట్‌లెట్.కామ్‌ప్రారంభించింది. దీని ద్వారా వెయ్యిమంది వినియోగదారులకు పద్మ తన ఉత్పత్తులను అందజేస్తోంది. క్రోషెట్ ఉత్పత్తులను పది దేశాలకు ఎగుమతి చేసి, చేతినిండా సంపాదించడమే కాదు... సత్కారాలు పొందుతూ ‘స్వీయ సంపాదన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’ అని వేదికల మీద గర్వంగా చెబుతుంది ఈ గుజరాతీ వాసి పద్మ పరిఖా.
ఆశాపురి 50 ఏళ్లుగా స్వెట్టర్లు, మఫ్లర్లు అల్లుతోంది. కుటుంబ సభ్యులకే పరిమితమైన ఆమె తన కళను విజయవంతమైన బిజినెస్‌గా మార్చుకుంది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ అల్లికల వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ తను నివసించే ఢిల్లీలోనే పదహారు మంది ఉద్యోగులను కూడా నియమించుకుంది.
శీలా బజాజ్ 80 ఏళ్లు. ఢిల్లీ వాసి. ఆరేళ్ల క్రితం బిజినెస్ ఉమన్‌గా మారింది. మనవలు, మనవరాళ్ల కోసం స్వెట్టర్లు, మఫ్లర్లు అల్లే శీలా కరోనా సమయంలో తన అభిరుచిని విస్తృతం చేసింది. తన మొదటి సంపాదన 350 రూపాయలు అంటూ ఆనందాన్ని పంచుకునే శీలా ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది.
ఎం.ఎస్. చంద్రప్రభ నాయర్ కొన్నేళ్ల క్రితం తన తోబుట్టువులతో కలిసి పుట్టింటికి వెళ్లినప్పుడు, అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి. తిరిగి ఇంటికి వచ్చాక ఏళ్లుగా పక్కన పడేసిన కుట్లు, అల్లికల పనిని తిరిగి కొనసాగించింది. వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కానుకగా ఇచ్చింది. ఆర్డర్లు వస్తుండటంతో దానినే వ్యాపారంగా మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment