ఏ విధంగానూ తక్కువ కాదు. ఎందులోనూ.. ఎక్కువ కాదు. ఇద్దరిలా కనిపించే ఒకే ఒకరు. ఒకే మాట మీద ఉండే ఇద్దరు. మరేంటి.. పడదనీ.. వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ! సమ ఉజ్జీలంటే ఎవరికి మాత్రం.. పోరు పెట్టాలని ఉండదు? పోటీ చూడాలని ఉండదు?
వయసులో పన్నెండేళ్ల వ్యత్యాసం అక్కాచెల్లెళ్ల మధ్య ఉంటే వాళ్లు తల్లీకూతుళ్లలా ఉంటారు. అదే వ్యత్యాసం తల్లీకూతుళ్ల మధ్య ఉంటే వాళ్లు అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. ట్రంప్ భార్య మెలానియా వయసు 50 ఏళ్లు. ట్రంప్ కూతురు ఇవాంక వయసు 38 ఏళ్లు. అయితే వీళ్లు మాత్రం ప్రత్యర్థుల్లా కనిపిస్తున్నారు. ‘కనిపిస్తున్నారు’ అంటే ప్రత్యర్థులుగా ఉన్నట్లు కాదు. చూసే వారికి అనిపించడం. ఇందుకు కారణం ఉంది. ట్రంప్ ప్రస్తుత సతీమణి, మూడో భార్య మెలానియా. ట్రంప్ మొదటి భార్య కూతురు ఇవాంక. వైట్‌హౌస్‌లో ట్రంప్ తర్వాత వీళ్లిద్దరే ముఖ్యులు. మెలానియా ‘ప్రథమ మహిళ’ అయితే, ఇవాంక.. ట్రంప్ ప్రధాన సలహాదారు. రెండు కత్తులు అనుకోవచ్చా! అలా అనుకుంటే కనుక ట్రంప్‌ను ఒక ‘ఒర’ అనుకోవాలి. ట్రంప్‌ను ఒర అనుకుంటే.. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అని కూడా అనుకోవాలి. నిజానికి వీళ్లిద్దరూ ఇమడకుండానే ఉంటున్నారా, ఇమడటం లేదని ప్రపంచం అనుకుంటోందా?!
అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి ఎవరైనా తన కుటుంబంలోని ముఖ్యుల్ని తొలి ప్రసంగపు వేదిక మీదకు తీసుకొస్తారు. ‘నేషనల్ కన్వెన్షన్’ అంటారు ఆ వేదికను. ట్రంప్‌ది రిపబ్లికన్ పార్టీ కనుక అది ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’. నాలుగు రోజుల కన్వెన్షన్ చివరిరోజు.. గురువారం రాత్రి స్టేజి మీద ట్రంప్‌తోపాటు మెలానియా, ఇవాంక ఉన్నారు. ట్రంప్ తర్వాత వేదికపైకి మొదట మెలానియా చేరుకున్నారు. తర్వాత ఇవాంక వచ్చారు. ఇవాంక నవ్వుతూ వచ్చి, తల్లికి విష్ చేసి, నవ్వుతూ వెళ్లి తండ్రికి అటువైపున నిలుచున్నారు. తనకు విష్ చేసిన ఇవాంకకు మెలానియా కూడా నవ్వుతూ విష్ చేసి, ఆమె అటు వెళ్లగానే ఇటు సీరియస్‌గా ముఖం పెట్టేశారు.
‘సీరియస్‌గా కాదు.. అది ఏవగింపు’ అంటోంది మీడియా! మర్నాడు మీడియాలో, సోషల్ మీడియాలో అంతా.. మెలానియా లుక్ గురించే! ‘స్టింక్ ఐ’ అన్నారు. అయిష్టం అన్నారు, అన్ ఇన్వైటింగ్ అన్నారు.. ఏవో చాలా పేర్లు. మొత్తానికి ఆ అమ్మాయంటే ఆమెకు పడటం లేదని ప్రపంచం అంతటా ఫోకస్ అయింది. నిజమా అది! పడట్లేదని చెప్పడానికి చాలా థియరీలు ఉన్నాయి. పడుతుందని చెప్పడానికీ? అందుకు థియరీలు అక్కర్లేదు కదా. ఈ తాజా ‘స్టింక్ ఐ’ థియరీ పైన కూడా ఎప్పట్లా మెలానియా, ఇవాంక ఏమీ కామెంట్ చేయలేదు.
అమెరికన్ శ్వేతసౌథంలో గానీ, బ్రిటన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో గానీ ఏ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకోరు. నేరుగా దూషించుకోరు. వ్యంగ్యాస్త్రాలను సంధించుకోరు. బ్రిటన్ రాణి, ఆమె చిన్న మనవడు హ్యారీ భార్య మేఘన్ అలాగే ఉన్నారు. ఇక్కడ అమెరికాలో మెలానియా, ఇవాంకా కూడా ఒకరికొకరు అన్నట్లుగానే ఉన్నారు. వీళ్లమీద పుస్తకాలు రాసేవాళ్లే ఒకర్నొకరు ఇలా అన్నారని, అలా అన్నారని రాసేస్తుంటారు. ‘మెలనియా అండ్ మీ’ అని సెప్టెంబర్ 1న ఒక పుస్తకం విడుదల అవుతోంది. రాసింది మెలానియా పూర్వపు స్నేహితురాలు స్టెఫానీ విన్‌స్టన్. ఇవాంకను, ఆమె టీమ్‌ను మెలానియా ‘స్నేక్స్’ అన్నట్లు స్టెఫానీ అందులో రాశారు.
నాలుగేళ్ల క్రితం ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం లో ఉన్నప్పుడు ఇదే నేషనల్ కన్వెన్షన్‌లో మెలానియా ఇచ్చిన ప్రసంగం అచ్చు గుద్దినట్లు 2008లో మిషెల్ ఒబామా చేసిన ప్రసంగమేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వాటి గురించి మెలానియా తనతో మాట్లాడుతూ.. ‘ఇవాంక, ఆమె బృందం ఇచ్చిన టెక్స్‌ట్‌నే నేను ఆరోజు చదివాను. వాళ్లే నన్ను తప్పుదారి పట్టించారు. వాళ్లు పాములు’ అని అన్నారని స్టెఫానీ ఈ పుస్తకంలో రాశారు. మెలానియాకు, ఈ రచయిత్రికి సత్సంబంధాలు చెడిపోయాక రాయడం మొదలు పెట్టిన పుస్తకం కాబట్టి స్టెఫానీ తల్లీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని వైట్‌హౌస్ అంటోంది. అంతేకాదు.. మెలానియా, ఇవాంక రోజూ చక్కగా మాట్లాడుకుంటారని కూడా లోపలి వాళ్లు చెబుతున్నారు.
ప్రథమ మహిళగా మెలానియా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టిన నాటి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలున్నాయి అంటూ గత జూన్‌లో మార్కెట్‌లోకి వచ్చిన ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పుస్తకంలో మేరీ జోర్డాన్ అనే వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ రాశారు. వైట్‌హౌస్ లో ‘ఫస్ట్ లేడీస్’స్ ఆఫీస్’ అని ఉంటుంది. అయితే మెలానియా.. ట్రంప్ మొదటి భార్య కాదు. అలాంటప్పుడు ఆ ఆఫీస్ ఆమెది ఎలా అవుతుందని ఇవాంకా అడ్డుపుల్ల వేశారట! ఫస్ట్ లేడీస్’స్ ఆఫీస్‌ని ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీసుగా మార్పించాలని ఇవాంకా చాలా ప్రయత్నించారని, ఆ ప్రయత్నాన్ని మెలానియా సమర్థంగా ఎదుర్కొన్నారని మేరీ రాసుకొచ్చారు. పుస్తకం వచ్చి రెండు నెలలు దాటిపోయింది.
అందులోని తల్లీకూతుళ్ల సంవాదాలపై ఇప్పటివరకు ఇద్దరూ ఏమీ వ్యాఖ్యానించలేదు. ఒకళ్ల పట్ల ఒకళ్లు గౌరవంగా, బాధ్యతగానే ఉంటూ వస్తున్నారు. ఈ సంగతిని స్వయంగా స్టెఫానీ (‘మెలానియా అండ్ మీ’ రాసిన స్టెఫానీ కాదు. మెలానియా అధికార ప్రతినిధి స్టెఫానీ ఈవిడ) 2017లో ‘వ్యానిటీ ఫెయిర్’ పత్రికు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ‘వాళ్లిద్దరూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు’ అని ఆమె తెలిపారు. మరి ఈ ‘పడకపోవడం’ అనే ప్రచారం ఏమిటి? వాళ్లిద్దరి మధ్యా అలాంటిదేమైనా ఉంటే బాగుండునని ఆశిస్తున్న వాళ్లు, ఉండే ఉంటుందని ఊహిస్తున్నవాళ్లు చేస్తున్నదే.
Comments
Please login to add a commentAdd a comment