సినిమా ఉన్నంతవరకూ.. జయప్రకాశం | Special Story About Jayaprakash Reddy In Family | Sakshi
Sakshi News home page

జయప్రకాశం

Published Wed, Sep 9 2020 4:46 AM | Last Updated on Wed, Sep 9 2020 5:50 PM

Special Story About Jayaprakash Reddy In Family - Sakshi

నటుడు కాకముందు టీచర్‌ జయప్రకాశ్‌ రెడ్డి.. పిల్లలకు హోమ్‌ వర్క్‌ ఇచ్చారు. సినిమాల్లోకి వచ్చాక యాక్టర్‌ జయప్రకాశ్‌ రెడ్డి... పాత్రలు బాగా చేయడానికి హోమ్‌ వర్క్‌ చేశారు. ప్రతీ పాత్రకు హోమ్‌ వర్క్‌ ముఖ్యమనేవారు. కామెడీ–సీరియస్‌ రెండూ భిన్న ఎమోషన్లు. ఎలా కలుస్తాయి? జేపీకి కుదిరింది. రెంటినీ కలిపారు. ప్రేక్షకులను భయపెట్టారు... నవ్వించారు. తెరపై ‘ప్రతి నాయకుడి’గా కనిపించినా.. తన నటనతో ప్రతి ఇంటికి దగ్గరైన నటుడయ్యారు.

‘‘అలా అడ్డగాడిదల్లా ఖాళీగా కూర్చొని కాలయాపన చేయకపోతే, ఏదైనా నాటకం రాసి రిహార్సల్స్‌ చేసుకోవచ్చుగా’ – జయప్రకాశ్‌ రెడ్డి (జేపీ) నాటకాల్లో శ్రద్ధ పెంచుకోవడానికి దారి చూపిన తిట్టు. తిట్టింది జేపీ నాన్నగారే. సాంబిరెడ్డి (జేపీ తండ్రి)కి నాటకాలంటే పిచ్చి. నటుడు కూడా. ఇంట్లోనే విపరీతమైన ప్రోత్సాహం ఉండటంతో నాటికలు రాయడం, వేయడం వైపు అడుగులేశారు జేపీ. స్కూల్‌ రోజుల్లో రుద్రమదేవి నాటికలో అంబదేవుడు అనే సామంతరాజు వేషం వేశారు. అదే జేపీ తొలి వేషం. చిన్న పాత్ర అయినా రెండు పద్యాలు పడ్డాయి. ఆయన పద్యం పూర్తి చేసేసరికి చప్పట్లు పడ్డాయి. తొలి వేషాన్నే డిస్టింక్షన్‌లో పాసయ్యారు జేపీ.

యాస మీధ ధ్యాస
కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెలో సామ్రాజమ్మ, సాంబి రెడ్డి దంపతులకు 1945లో జన్మించారు జేపీ. సాంబిరెడ్డి పోలీస్‌ ఉద్యోగి. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీలు కావడంతో ప్రాంతానికో యాస ఉండటం, అవి గమ్మత్తుగా ఉండటం జేపీలో ఉత్సుకతను పెంచాయి. ఎక్కడికెళ్తే అక్కడి యాసను ఇట్టే పట్టేయడం అలవాటు చేసుకున్నాడు. కడప, కర్నూల్, ప్రొద్దుటూర్, అనంతపురం, గుంటూర్, నల్గొండ.. ఇలా ఉద్యోగం నిమిత్తం తండ్రికి అయిన బదిలీలన్నీ జేపీకి ఉపయోగపడ్డాయి. స్కూల్‌ చదువులన్నీ సీమ ప్రాంతంలో పూర్తి చేసిన జేపీ కాలేజీ చదువులన్నీ గుంటూరులో చేశాడు.

నాటకానికి పనికిరావు
అనంతపురంలో చదువుకునేటప్పుడు జేపీ, అతని స్నేహితుడు నాటకం వేయాలనుకున్నారు. ‘దుర్యోధన గర్వభంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ పట్టారు. ‘ఏదీ చూపించండి’ అని సైన్స్‌ మాస్టారు అడిగితే, నాటకాన్ని మొత్తం చేసి చూపించారు. ‘ఇంకోసారి నాటకం అంటే కాళ్లు విరగ్గొడతా’ అని చివాట్లు పెట్టారాయన. అవమానంగా అనిపించింది జేపీకి. మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నా, అధైర్యపడలేదు. ఎప్పటికైనా నాటకం వేసి ప్రేక్షకుల్ని అలరించాలని బలంగా నిర్ణయించుకున్నాడు జేపీ. (జయప్రకాశ్‌ మరణం తీరని లోటు: ప్రధాని మోదీ)
ఉత్తమ నటి బహుమతి
కాలేజీలో ‘స్టేజీ రాచరికం’ అనే నాటికలో వేషం వేయమని సీనియర్లు కోరితే ‘ఊ’ అన్నాడు జేపీ.  చెలికత్తె వేషం అది. అంటే అమ్మాయిగా కనిపించాలి. జేపీ చేసేశాడు. కట్‌ చేస్తే.. మరుసటి రోజు కాలేజీ నోటీస్‌ బోర్డ్‌లో ‘ఉత్తమ నటి – జయప్రకాశ్‌ రెడ్డి’ అని బహుమతుల జాబితాలో రాసుంది. ఆ తర్వాత కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో జేపీ హాజరు పడాల్సిందే అన్నట్టుగా ఉండేది. కాలేజీ స్టార్‌లా చూసేవాళ్లు. సన్నగా, పొడుగ్గా ఉండటంతో ఎక్కువగా వినోద ప్రధానంగా ఉండే పాత్రలే చేసేవాడు జేపీ. గుంటూరులోనే బీఈడీ పూర్తి చేసి టీచర్‌ ఉద్యోగంలో చేరారు. చూడ్డానికి డ్రిల్‌ మాస్టార్‌లా ఉండటంతో అందరూ ఆయన్ను డ్రిల్‌ మాస్టార్‌ అనుకున్నారు. కానీ జేపీ లెక్కల మాస్టార్‌. టీచర్‌గా మారినా నాటకాల మీద తన ఇష్టాన్ని వదులుకోలేదు. స్కూల్లో పిల్లలతో తరచూ నాటికలు వేయిస్తూ ఉండేవారు. అప్పటికి పెళ్లయింది కూడా.. ఓ బాబు పుట్టాడు. కొడుకుని తన తండ్రి దగ్గర నల్గొండలో ఉంచారు జేపీ. అలా తరచూ నల్గొండ వెళ్లడంతో అక్కడ యాసను పట్టేశారు. 

కొత్త కెరీర్‌కి అన్‌లాక్‌
జేపీ నటుడిగా మారే టర్న్‌ నల్గొండలో జరిగింది. జేపీ శిష్యుడు ఓ పత్రికను స్థాపించారు. అందులో భాగంగా ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి, దర్శకుడు దాసరి నారాయణరావును అతిథిగా ఆహ్వానించారు. జెపిని ఒక నాటకం కూడా ఆడాలన్నాడు ఆయన శిష్యుడు. సరే అనుకున్నారంతా. కానీ దాసరికి ఏదో పని ఉండి త్వరగా వెళ్లిపోవాలనుకున్నారు. ఆ విషయం తెలిసి, మైక్‌ అందుకున్న జేపీ, ‘మా నాటకాన్ని పూర్తిగా అస్వాదించి వెళ్తారనే అనుకుంటున్నాం’ అని దాసరిని లాక్‌ చేశారు. ఇది తన కొత్త కెరీర్‌ను అన్‌లాక్‌ చేస్తుందని ఆ నిమిషం జేపీకి తెలియదు. ‘భలే ఫిట్టింగ్‌ పెట్టావయ్యా. మొదటి పావుగంటా చూస్తా’ అన్నారు దాసరి. అయితే నాటకంలో నిమగ్నమై గడియారాన్ని చూసుకోవడం కూడా మర్చిపోయిన దాసరి చివరి వరకూ ఉన్నారు. ‘నువ్వుండాల్సింది సినిమాల్లో. నిన్ను సినిమాల్లోకి తీసుకెళ్తాను’ అని జేపీని అభినందించారు కూడా. వారం తిరగ్గానే రామానాయుడు స్టూడియోస్‌ నుంచి వేషం ఉందని ఫోన్‌. 
సినిమా ప్రయాణం
రామానాయుడు నిర్మించిన ‘బ్రహ్మపుత్రుడు’ (1988) సినిమాలో తొలిసారి నటుడిగా స్క్రీన్‌ మీద కనిపించారు జేపీ. ఆ తర్వాత ‘బొబ్బిలిరాజా, ప్రేమఖైదీ’ ఇలా వరుస వేషాలు వేస్తూ వచ్చారు. కానీ ఆర్థికంగా నిలదొక్కుకునేంత సంపాదన లేదు. అప్పటికి ఓ కుమార్తె కూడా ఉంది జేపీకి. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. కొన్ని అప్పులు కూడా మిగిలాయి. అరకొర సంపాదనతో బండి నడపడం కష్టమని గుంటూరు బండెక్కేశారు. టీచర్‌గా పిల్లలకు చదువు చెప్పడంలో పడిపోయారు. ఇలా నాలుగైదేళ్లు గడిచాయి. ఆ తర్వాత ఏదో పని మీద హైదరాబాద్‌లో అనుకోకుండా మళ్లీ రామానాయుడ్ని కలవడం జరిగింది. అప్పుడు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ పాత్ర ఆఫర్‌ చేశారు రామానాయుడు. అమ్రీష్‌ పురి, నానా పటేకర్‌.. ఇంకా ఎవరెవర్నో ఆ పాత్రకు అనుకున్నారు. కానీ జేపీకి కుదిరింది.

పాత్ర బాగా పండాలంటే ఏం చేయాలని ఆలోచించిన జేపీకి డైలాగులు రాయలసీమ యాసలో చెబితే ఎలా ఉంటుంది? అనిపించింది. ఆ ఆలోచన చిత్రరచయితలు పరుచూరి బ్రదర్స్‌తో పాటు అందరికీ నచ్చింది. వెంటనే సీమ ప్రాంతంలో మారుమూల ఊళ్లల్లో కొన్నిరోజులు తిరిగి యాస మీద ఇంకా పట్టు సాధించారు. తెలియని పదాలను టేప్‌ రికార్డర్‌లో రికార్డ్‌ చేసుకున్నారు. పరుచూరి సోదరులనుంచి డైలాగ్స్‌ ముందే తెప్పించుకుని వాటిని యాసలోకి మార్చుకుని, ప్రాక్టీస్‌ చేసి నటించారు జేపీ. సినిమా సూపర్‌ హిట్‌. ఆ తర్వాత ‘శ్రీరాములయ్య, సమరసింహారెడ్డి’ ఇలా వరుస హిట్లు. ఇక కెరీర్‌ బాగుందని టీచర్‌ పదవికి రాజీనామా చేసి దృష్టంతా సినిమా మీదే పెట్టాలని నిశ్చయించుకున్నారు. శ్రీను వైట్ల ప్రతి సినిమాలోనూ జేపీ పాత్ర ఉంటుంది. వాటిలో ‘ఢీ’ ఒకటి. డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకునే జేపీ ఈ సినిమాలో ఒక్క డైలాగ్‌ లేకున్నా సైగలతో ప్రేక్షకుల్ని నవ్వించారు. తెలుగులో 300కి పైనే సినిమాల్లో నటించారు. తమిళ, కన్నడ సినిమాల్లోనూ కనిపించారు జేపీ. 

గుర్తుండిపోయే పాత్రలు
‘జంబలకిడి పంబ’లో అల్లరి పిల్లాడిగా, ‘సమరసింహారెడ్డి’లో క్రూరమైన ఫ్యాక్షనిస్ట్‌గా, ‘సొంతం’లో గులాబీ అనే కామెడీ దొంగగా, ‘ఎవడిగోల వాడిది’లో టవల్‌ మీదే కనిపించే బండ్రెడ్డి.. ఇంకా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, రెడీ, కిక్, ఊసరవెల్లి, నాయక్‌ వంటి సినిమాల్లోనూ గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఇటీవల విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఆయన చివరి రిలీజ్‌.  

శివభక్తుడు
జేపీకి తెలుగు భాష అంటే ఎనలేని మమకారం. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, సామెతలు రాయడం చేసేవారు. సినిమాల్లో విలనే అయినా నిజజీవితంలో సౌమ్యుడు. అంతకుమించి శివభక్తుడు. దాదాపు 18 ఏళ్ల పాటు శివ దీక్ష చేశారు. ‘శివ ప్రకాశం’ పేరుతో ఓ ఆల్బమ్‌ చేశారు. అందులోని పాటలను ఆయనే పాడటం విశేషం. జేపీది సేవాగుణం కూడా. ఎంతోమందిని చదివించారు.

రంగస్థలం మీద గుండెపోటు వచ్చినట్లు నటిస్తే.. నిజంగా వచ్చిందా అని కంగారుపడ్డారు ప్రేక్షకులు. జీవితం అనే వేదిక మీద ఆయనకు నిజంగానే గుండెపోటు వచ్చింది. ఇది కూడా నటనే అయితే బాగుండు అని జేపీని అభిమానించేవారు కోరుకోకుండా ఉండరు. జేపీ మరణం పరిశ్రమకే కాదు నాటకానికీ తీరని లోటు. అయితే జేపీ భౌతికంగా మాత్రమే దూరమయ్యారు. తాను చేసిన పాత్రల ద్వారా ప్రకాశిస్తూనే ఉంటారు... సినిమా ఉన్నంతవరకూ జయ‘ప్రకాశం’ ఉంటుంది. 
సినిమా – నాటకం
సినిమాల్లో బిజీ నటుడిగా ఉన్నప్పటికీ జేపీ నాటకాన్ని వదలలేదు. వీలున్నప్పుడల్లా నాటకాలు వేస్తూనే ఉన్నారు. నాటకాల్ని బతికించాలని నాటకాలు వేస్తూనే ఉన్నారు. జేపీకి బాగా పేరు తెచ్చిన నాటకాల్లో ‘అలెగ్జాండర్‌’ ఒకటి. ఆ నాటకంలో సుమారు వంద నిమిషాలు ఏకపాత్రాభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు జేపీ. నాటకం క్లైమాక్స్‌లో జేపీ పాత్రకు గుండెపోటు వస్తుంది. ఆ సీన్‌ చేస్తుంటే, ప్రేక్షకుల్లో ఒకరు నిజంగా గుండెపోటు వచ్చిందేమో అనుకొని అరిచేశారట. అది ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జేపీ. ఈ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించాలనుకున్నారు. కానీ 66సార్లు మాత్రమే వేయగలిగారు. ఈ నాటకాన్ని సినిమాలానూ మలిచారు. తీరా విడుదల సమయానికి లాక్‌డౌన్‌ పడింది.
– సినిమా డెస్క్‌

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement