
మనమంతా నిటారుగా ఉండటానికి ఉపయోగపడే అత్యంత ప్రభావపూర్వకమైన భాగం వెన్ను. మనిషి పూర్వికులు తమ నాలుగు కాళ్ల నడక నుంచి రెండు కాళ్ల మీదికి మారిన కాలం నుంచి... శరీరం బరువును చాలావరకు తాను తీసుకుంటూ... నేటి ఆధునిక మానవుడి ఆవిర్భావం వరకు వెన్ను తాలూకు భూమిక అత్యంత కీలకం. తాను నిటారుగా మారినందున ఓ కర్రలాగా నిటారుగా మాత్రమే కాకుండా... మనిషికి అనువైన విధంగా అటు ఇటు వంగగలిగేలా, అవసరమైనప్పుడు పక్కలకు తిరగగలిగేలా, మెడను, నడుమును అటు ఇటు తిప్పగలిగేలా కూడా అత్యంత ఫ్లెక్సిబుల్‌గానూ రూపొందిన వెన్ను నిర్మాణం ఓ అత్యద్భుతమని చెప్పవచ్చు. అలాంటి అద్భుత అవయవమైన వెన్ను గురించి తెలుసుకుందాం. ఈ నెల 16న ‘వరల్డ్ స్పైన్ డే’. ఈ సందర్భంగా... వెన్ను గురించి అవగాహన కోసం ఈ కథనం.
ఈ ఏడాది ప్రపంచమంతటా విస్తరించిన ‘కరోనా’ ప్యాండమిక్ సందర్భంగా వెన్నుపైనా తీవ్రమైన ఒత్తిడి పడిందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. అందుకే వెన్నెముక ఆరోగ్యం, దాని సంరక్షణకు అవసరమైన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన పోష్చర్లు వంటి అనేక అంశాలపై అవగాహన కలిగిచేందుకు ఈ ఏడాది స్పైన్ డే థీమ్‌తో ఇచ్చిన నినాదమే ‘బ్యాక్ టు ట్రాక్’! ఈ సందర్భంగా వెన్ను గురించి, దాని ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యల గురించి తెలుసుకుందాం.
వెన్ను నిర్మాణమే ఓ అద్భుతం
వెన్నెముకలో మొత్తం 33 చిన్న చిన్న ఎముకలు ఒకదానికొకటి పూసల దండలా అమరి ఉంటాయి. అందుకే ఆ చిన్న చిన్న ఎముకలను వెన్నుపూసలంటారు. వాటి నిర్మాణం... ‘ఎస్’ ఆకృతిలో కాస్తంత ఒంపు... ఇదంతా ఓ నిర్మాణ అద్భుతం. వీటిల్లో... తల కింద... మెడ వెనక భాగంలో ఏడు ఎముకలు ఉంటాయి. వీటిని సెర్వికల్ వెర్టిబ్రే అంటారు. ఇవి తలను అటూ ఇటూ తిప్పడానికి, తల పైకెత్తడానికి, కిందికి దించడానికి కూడా సహాయపడతాయి. వీటి దిగువనే ఛాతీ వెనుక 12 ఎముకలు ఉంటాయి. వీటినే థొరాసిక్ వెర్టిబ్రే అంటారు. మన పక్కటెముకలు వీటిని అతుక్కుని ఉంటాయి. ఈ ఎముకల్లో సమస్యలు తలెత్తడం చాలా అరుదు. వీటికి దిగువ ఉండే ఐదు బరువైన ఎముకలను లంబార్ వెర్టిబ్రే అంటారు. మన శరీరం బరువులో చాలా వరకు భారాన్ని ఇవే మోస్తాయి. వీటికి దిగువ ఉండే ఐదు ఎముకలు ఒకదానికొకటి దగ్గరగా అతుక్కుని ఉంటాయి. ఈ భాగాన్నే ‘కాక్సీ’ అంటారు. ఇది ఒకానొక కాలంలో ఆధునిక మానవుల పూర్వీకులకు ఉండే తోక అవశేషంగానూ చెబుతుంటారు.
ఓ చిన్నారి పుట్టీ పుట్టగానే వెన్నుభాగం దాదాపు నిటారుగానే ఉంటుంది. కానీ చిన్నారి తన తల పైకెత్తడం మొదలుపెట్టినప్పుడు మెడ వద్ద ఉండే భాగం కాస్త వంపు తిరుగుతుంది. అలాగే... పాపాయి పాకడం నేర్చుకునేటప్పుడు తన నడుము వద్ద ఉండే భాగం కొద్దిగా వంపు తిరుగుతుంది.దాంతో వెన్నుకు ‘ఎస్’ అక్షరం లాంటి ఒంపు సమకూరుతుంది. నిజానికి సరళరేఖలా ఉండటం కంటే ఇలా ఒంపు తిరగడం వల్లనే మనిషి అనేక రకాలుగా ఒంగేలా, పనులు చేసుకోగలిగేలా వెన్నుకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ ఒంపులే వెన్నుకు షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేస్తాయి. కేవలం ఈ ఒంపులు మాత్రమే కాకుండా వెన్నులో మరికొన్ని షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి. అవే గనక లేకుంటే, వెన్నుపూసలు ఒకదానికొకటి తాకినప్పుడు రాపిడికి గురై, అరిగిపోయేవి. అవి... వెన్నుపూసల మధ్య కుషన్‌లాంటిది ఉంటుంది. దానినే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటారు. ఆ డిస్క్ మధ్యలో జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. ఈ డిస్కే మనిషికి ఎదురయ్యే అనేక కుదుపుల బారి నుంచి వెన్నుపూసలను జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఈ డిస్క్ కారణంగానే మనం వెన్నెముకను అటు ఇటు వంచగలం. మన శరీరాన్ని అటు ఇటు తిప్పగలం.
పూసల్లోని పాము నుంచి31 జతల నరాలు
మనిషిలోని వెన్నుపూసలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయినట్టుగా ఉండి... వాటి మధ్యన ఖాళీలతో ఓ సందును ఏర్పరుస్తాయి. ఆ ఖాళీలో తల నుంచి వెన్నుపూసల చివరి వరకు దాదాపు 45 సెంటీమీటర్ల వెన్నుపాము ఉంటుంది. ఈ వెన్నుపాముకూ వెన్నెముక పూసలు రక్షణ కూడా కల్పిస్తుంటాయి. పూసల దండలోని దారంలా... మనిషిలో ఓ తెల్లని వెన్నుపాము ఒక సెంటీమీటరు మందంలో ఉంటుంది. దీనికేమైనా జరగరానిది జరిగితే, మనిషి తన జీవితాంతం అవిటివాడిలా ఉండాల్సిందే. అటు ఇటు వెళ్లాలంటే వీల్‌చైర్ ఉపయోగించక తప్పదు. సున్నితమైన వెన్నుపాముకు వెన్నుపూసలు మూడు పొరల రక్షణ కల్పిస్తుంటాయి.
ఈ వెన్ను పూసల మధ్యనుండే ఖాళీల ద్వారా వెన్నుపాము నుంచి 31 జతల నరాలు దేహమంతా పాకి ఉంటాయి. వీటిలో సగం నరాలు దేహం నుంచి మెదడుకు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. మిగిలినవి మెదడు నుంచి వచ్చే వివిధ ఆదేశాలను శరీరంలోని వివిధ కండరాలకు చేరవేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడుతో ప్రమేయం లేకుండా వెన్నుపామే స్వయంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి తాలూకు చేతికి వేడి తగిలిందనుకోండి... ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేసి, అక్కణ్నుంచి ఆదేశాలు వచ్చేంత సమయాన్ని వెన్నుపాము వృథా చెయ్యదు. వెంటనే వేడి తగిలిన చెయ్యి వెన్నుకు తీసుకునేలా అసంకల్పిత చర్యలకు ఆదేశాలిస్తుంది. అలా చాలారకాల ప్రమాదాలనుంచి వెన్నుపాము మనల్ని రక్షిస్తుంది. ఇలా రక్షించే వెన్నుపాముకు మన వెన్నుపూసల ద్వారా వెన్నెముక రక్షణ కల్పిస్తుంది.
వెన్నుకు నొప్పులూ... కారణాలూ ఎన్నెన్నో
►ఈ ప్రపంచంలోని ప్రతి మనిషికీ ఏదో ఒక దశలోనైనా, కనీసం ఒక్కసారైనా ఏదో ఓ కారణంతో వెన్నునొప్పి వచ్చి తీరుతుంది. దాంతో కాపడం పెట్టించుకోవడమో, మర్దన చేయించుకోవడమో, మందులు వాడటమో చేయనివారంటూ ఎవరూ ఉండరు. అయితే చాలా సందర్భాల్లో వెన్నెముకకు నొప్పి వచ్చిందటే దానికి నేరుగా వెన్నుపూసలే కారణం కాకపోవచ్చు. ఇతరత్రా చాలా కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు... మూత్రపిండాల్లో సమస్యలు ఉన్నా, కాలేయం లేదా ప్రొస్టేట్ సరిగా పనిచేయకపోయినా, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నా వెన్నుకు నొప్పులు వస్తాయి.
►ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనా వెన్నునొప్పి రావచ్చు. ఓ వ్యక్తి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు వెన్నుకు అంటిపెట్టుకుని ఉండే కండరాలు తీవ్రంగా బిగుసుకుంటాయి. అలా రోజుల తరబడి తీవ్ర భావోద్వేగాలు కొనసాగితే బిగుసుకున్న కండరాల వల్ల వెన్నుకు నొప్పులు తప్పవు. అయితే త్వరగా భావోద్వేగాల నుంచి తేరుకుంటే నొప్పులూ తగ్గుతాయి.
►వెన్నెముక ప్రధాన ఉద్దేశం వెన్నుపామును కాపాడటం కాగా... రెండో ప్రధాన ఉద్దేశం మన శరీరాన్ని కుదుపుల నుంచి రక్షించడం, దేహానికి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం. ఈ రెండు పనులనూ డిస్క్‌లు సమర్థంగా చేస్తాయి. ఈ కారణంగా డిస్క్‌ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సహజంగానే వయసు పెరగడంతో పాటు, వాడుతున్న కొద్దీ డిస్క్‌లు కొద్దికొద్దిగా దెబ్బతింటూ వస్తాయి. ఇలా దెబ్బతినడం వల్లనే మనకు నడుమునొప్పి వస్తుంటుంది. అప్పుడప్పుడు బరువులెత్తడం వంటి ఏదైనా కారణం వల్ల డిస్క్ పగలడం (రప్చర్‌కావడం) జరగవచ్చు. డిస్క్ మధ్యలో ఉన్న జెల్లీ బయటకు వచ్చి నరాన్ని కానీ, నాడిని కానీ నొక్కేయవచ్చు. దీన్నే సయాటికా అంటారు.
ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అరుదుగా సర్జరీ కూడా అవసరం పడవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే... వెన్నునొప్పి చాలావరకు డిస్క్‌లు అరగడం వల్ల వస్తుంది. ఈ ప్రమాదాని నివారించాలంటే మన శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ముందుకు ఒంగి ఎక్కువ బరువు లేపకపోవడం, ముందుకు ఒంగి ఎక్కువ పని చేయకపోవడం అవసరం. అంతేకాదు... వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరిగే విధంగా ఫెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి. వెన్నెముకకు సపోర్ట్‌నిచే కండరాల బలాన్ని పెంచే ‘స్పైనల్ స్ట్రెంతెనింగ్ ఎక్సర్‌సైజెస్’ అనే వ్యాయామాలు చేయాలి.
►రోడ్డు ప్రమాదం వంటి యాక్సిడెంట్స్‌లో తీవ్రంగా గాయపడినప్పుడు వెన్నుపూసల మధ్య డిస్కులు తింటాయి. అలాంటి సందర్భాల్లో వెన్నుపూసలకు పెద్ద దెబ్బ తగిలితే ప్రధానంగా వాటి మధ్య కుషన్‌లా ఉన్న కార్టిలేజ్ దెబ్బతింటుంది. దాంతో అందులోని జెల్లీలాంటి పదార్థం బయటకు కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వెన్నును అంటిపెట్టుకుని ఉండే కండరాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
►కొందరిలో వెన్నుపూసలు అరిగి రాపిడికి గురై, వెన్నుపూస నుంచి బయటికి వచ్చే సయాటికా నరంపై ఒత్తిడి కలిగిస్తాయి. దేహంలో అత్యంత పొడవైన ఈ సయాటికా నరం అరిపాదాల వరకు వ్యాపిస్తుంది. దాంతో నొప్పి కూడా నడుము నుంచి అరికాళ్ల వరకు పాకుతుంది. ఒకరకంగా చూస్తే... ఈ నొప్పి జాగ్రత్త వహించాలని చెబుతూ దేహం పంపే సంకేతం అన్నమాట.
►కొందరు సోఫాల్లోనూ, కుర్చీల్లో అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా కూర్చుని తాము హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నామని అనుకుంటారు. కానీ అది వెన్నుపై భారాన్ని మరింత పెంచుతుంది. మరికొందరు నేల మీద ఉన్న బరువులను ఎత్తేటప్పుడు వెన్నును ముందుకు వంచుతారు. దానికి బదులుగా మోకాళ్లు ఒంచి, గొంతుకూర్చొని బరువులు ఎత్తితే వెన్నుపై పెద్ద భారం ఉండదు.
►అరుగుదలతో వెన్నుకు నొప్పులు వస్తాయి. కొందరికి మెడ వద్ద ఉండే వెన్నుపూసల డిస్కులు అరిగి, రాపిడికి గురైనప్పుడు నొప్పి వస్తూ, అది భుజాల్లోకి పాకుతూ చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది. అలాగే మరికొందరిలో నడుము దగ్గరి డిస్కులు అరిగి నడుమునొప్పి వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం వయసు పెరగడం అనే ముప్పు. మన వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోని ఎముకలూ బలహీనపడుతుంటాయి. అరుగుతుంటాయి. వెన్నులోని ఎముకలూ ఇందుకు మినహాయింపు కాదు. వెన్ను డిస్కులు మెత్తబడిపోతూ, వెన్నుపూసలు సాంద్రత (బోన్ డెన్సిటీ) కోల్పోతుంటాయి. వయసు మరింత పెరిగి వృద్ధాప్యంలో వెన్ను మరింతగా ఒంగిపోయి, మనిషి కిందికి కుంగిపోయినట్లుగా అనిపించడమూ సహజం. అలాంటప్పుడు భారంగా ముందుకు వంగి నడవాల్సి వస్తుంది.
ఒళ్లు పెరిగితే...నొప్పులూ పెరుగుతాయి...
నడివయసు వారిలో చాలామందిలో వెన్నునొప్పులు కనిపిస్తుంటాయి. అలాంటి నొప్పుల్లో చాలావరకు వెన్నును ఆనుకుని ఉండే కండరాలు బలహీనంగా మారడం వల్ల వచ్చేవే. కొందరు చిన్న చిన్న కదలికలతోనే సంతృప్తి చెంది తమ శరీర కదలికల కారణంగా దేహానికి వ్యాయామం సమకూరిందనుకుంటారు. దాంతో తమ వెన్ను పదిలం అని భావిస్తుంటారు. వెన్నును అంటిపెట్టుకుని దాదాపు నాలుగువందలకు పైగా కండరాలు, వెయ్యి లిగమెంట్ల వరకు ఉంటాయి. దాంతో ఎవరైనా ఓ వ్యక్తి బరువు పెరిగినా... లేదా అతడికి పొట్ట పెరిగినా... ఆ భారాన్నంతా వెన్ను మోయాల్సి వస్తుంది. అందుకే ఎత్తుకు తగినంతగానే బరువు ఉండేలా జాగ్రత్త పడుతూ, తమ దేహపు బరువు, పొట్ట పెరగకుండా చూసుకుంటే అది కేవలం శరీర ఆరోగ్యనికే కాదు వెన్ను కూడా ఆరోగ్యానికీ ఉపకరిస్తుంది.
చిన్న జాగ్రత్తలతో వెన్ను పదిలం...
కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వయసు పెరుగుతన్న క్రమంలోనూ, వెన్నును జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ∙ఎప్పుడూ మీ దేహ భంగిమను (బాడీ పోష్చర్)ను నిటారుగా ఉంచుకోవాలి. నిటారుగా నిలబడటం, వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవడం అలవాటు చేసుకోవాలి ∙వెన్నును అంటిపెట్టుకుని ఉండే కండరాలు బలహీనం కాకుండా ఉండేందుకు ప్రతిరోజూ కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి ∙వెన్నుకు వచ్చే చాలా సమస్యలు ప్రధానంగా కండరాల బలహీనత వల్లే ఎక్కువగా వస్తుంటాయి. అందుకే, కండరాలను బలోపేతం చేసేందుకు తగిన వ్యాయామాలు చేయాలి ∙కూర్చునే సమయంలోనూ కూలబడినట్లుగా కాకుండా సౌకర్యంగా ఉండేలా, వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి ∙కింది నుంచి బరువులు ఎత్తేటప్పుడు ఒంగి కాకుండా... కూర్చుని ఎత్తాలి. హడావుడిగా కాకుండా నింపాదిగా ఎత్తాలి.
Comments
Please login to add a commentAdd a comment