ఎవరు గెలుస్తారు? డొనాల్డ్ ట్రంపా, జో బైడెనా? ఇదసలు ప్రశ్నే కాదు. ఎవరు గెలిపిస్తారు? కమలా హ్యారిసా, నిక్కీ హేలీనా? ఇదీ పాయింట్. అమెరికా భవిష్యత్తుకు.. వీళ్లే విన్నింగ్ మేట్స్!
నలభై ఏళ్ల క్రితం నాటి తెలుగు సినిమాల వాల్‌పోస్టర్ భాషలో చెప్పాలంటే కమలా హ్యారిస్, నిక్కీ హేలీల మధ్య ఇప్పుడు జరగబోతున్నది ఇద్దరు కథానాయికల మధ్య పోటీ వంటిదే. అయితే ఆ పోటీ భావన ఆ కాలంనాటి అభిమానులదే తప్ప నిజంగా అది ఆ హీరోయిన్‌ల మధ్య ఉన్న పోటీ కాదు. కమల, నిక్కీల మధ్య పోటీ కూడా అంతే. వాళ్లిద్దరినీ నిలబెట్టిన అమెరికా అధ్యక్ష అభ్యర్థులదే తప్ప, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా నిలబడిన కమల, నిక్కీలది కాదు. పౌరాణిక సినిమాల్లో జరిగే స్టార్‌వార్స్‌లో ఒకరు ఒక బాణం వేస్తే, ప్రత్యర్థి ఇంకో బాణం వేస్తారు. భుజానికి ఉండే అమ్ములపొది నుంచి ఒకరు ఒక అస్త్రం తీస్తే ప్రత్యర్థి ఇంకో అస్త్రం తీస్తారు. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపికలోనూ ఇదే జరిగింది.
మొదట జో బైడెన్ తన డెమోక్రాటిక్ పార్టీ వైస్–ప్రెసిడెంటుగా (రన్నింగ్ మేట్) భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ని ప్రకటించారు. అమెరికాలో భారత జనాభా సుమారు 50 లక్షలు. వారిలో ఓటర్ల జనాభా 10 లక్షల 20 వేలు. ఎక్కువేం కాదు. అలాగని తక్కువా కాదు. ఫలితాల ముల్లు మీద ప్రభావమైతే చూపిస్తారు. జో బైడెన్ భారతీయ ఓటర్లపైకి కమలాస్త్రాన్ని సంధించాక డొనాల్డ్ ట్రంప్‌కు సరిగ్గా అలాంటి అస్త్రమే ఒకటి అవసరం అయింది. మహిళ అయుండాలి. భారత సంతతి అయుండాలి. ఎవరు? అనూహ్యంగా నిక్కీ హేలీని స్టేజిపైకి రప్పించారు! బైడెన్‌కి దీటైన ఎత్తుగడ. చెన్నై నుంచి కమల, అమృత్‌సర్ నుంచి నిమ్రత (నిక్కీ).
కమల, నిక్కీ.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని కాదిప్పుడు. గెలిపించే దేశవాళీ శక్తి ఇద్దరిలోఎవరికి ఉందని! ఇద్దరిలో ఒకరు భారతీయు పురుషుడు అయుంటే స్త్రీ పురుషులుగా అమెరికన్ ఓటర్లు విడిపోయే అవకాశం ఉండేది. అసలు స్త్రీ పురుషులు అనుకోకుండా, డెమోక్రాటిక్, రిపబ్లికన్ అని చూడకుండా కేవలం ‘మన’ అనుకోడానికి ఇద్దరు ‘మనదేశీయులు’ అయ్యారిప్పుడు. ఇద్దరిదీ హై ప్రొఫైల్. కమల కాలిఫోర్నియా సెనెటర్. నిక్కీ ఐక్యరాజ్యసమితిలో రెండేళ్ల క్రితం వరకు అంబాసిడర్. అంతకుపూర్వం నెల రోజులపాటు సమితి భద్రతా మండలికి తాత్కాలిక అధ్యక్షురాలు. అంతకన్నా ముందు ఏడేళ్లపాటు సౌత్ కరోలినా గవర్నర్. కమల బలాలు కమలకు ఉన్నప్పటికీ, నిక్కీ ప్రత్యేకతలు నిక్కీకి ఉన్నాయి. కమల కన్నా నిక్కీ ఏడేళ్లు చిన్న. అయినప్పటికీ నిక్కీలో సొంత పార్టీలోని వారినే ప్రశ్నించగల, విమర్శించగల పరిణితి ఉంది. ట్రంప్ మీద లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వైపు కాకుండా బాధితురాలి వైపే నిలబడ్డారు నిక్కీ! ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ‘ఈయన ధోరణిని చూస్తుంటే మన నెత్తిమీదకు యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నారు’ అని బహిరంగంగానే అన్నారు.
2016 ఎన్నికల్లోనైతే ట్రంప్‌కి ఆమె మద్దతు ఇవ్వనేలేదు. సౌత్ కరోలినా గవర్నర్‌గా కూడా ఆనాడు ఆమె ట్రంప్‌ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇవేవీ ట్రంప్ పట్టించుకోలేదు. ఎన్నికల్లో తను గెలవగానే నవంబర్ 23న నిక్కీని ఐరాసకు పంపిస్తున్నట్లు ప్రకటించారు! సెనెట్‌లో వందకు 96 ఓట్లు సాధించి ఐరాసకు అర్హత సాధించారు నిక్కీ. అక్కడ రెండేళ్లు చేశాక, ఆమె విరామం కోరుకున్నప్పుడు కూడా ట్రంప్ కాదనలేదు. ‘‘కొంత గ్యాప్ తర్వాత ఆమె తన కొత్త బాధ్యతలు చేపడతారు. ఆమెకు ఇష్టమైన బాధ్యతలు’’ అని ట్రంప్ సమర్థించారు. ఈ సోమవారం జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసే బాధ్యతను నిక్కీకి అప్పగించారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సల్మాన్‌ఖాన్‌లాంటి కండల హీరో అయితే, అమెరికన్ పురుష ఓటర్లు సల్మాన్‌ఖాన్ అభిమానుల వంటి వారు. పూర్తిగా మాస్. ‘ఐ లవ్ మై అమెరికా’ టైపు. జో బైడెన్ వస్తే తన మంచితనం చేత, తన మానవత్వం చేత అమెరికాను ‘సార్వజనీన స్వదేశీయ భూభాగం’గా మార్చేస్తారన్న భయం వాళ్లలో ఉంటుంది. భారతీయులన్నా కూడా వారికి అభిమానం లేకపోవచ్చు. కానీ ఇద్దరు భారతీయులలో ఒకరిని ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు తమ హీరో నిలబెట్టిన వారికే వాళ్లు ఓట్లేస్తారు. ఇక భారతీయులు.. వాళ్లు డెమోక్రాటిక్‌లైనా, రిపబ్లికన్‌లైనా ‘సంపూర్ణ స్వజాతీయురాలికే’ ఓటేయడానికి మొగ్గు చూపవచ్చు.
కమల హాఫ్ ఇండియన్. తల్లి చెన్నై మహిళే అయినా, తండ్రి జమైకన్. నిక్కీ తల్లిదండ్రుల్దిరూ భారతీయులే. ఆ స్థాయిలో ఇంత చూడరనుకున్నా.. తేడా వస్తే అధ్యక్షుడిని కూడా కడిగేస్తుందని అమెరికన్‌లలో, అమెరికన్–ఇండియన్‌లలో ఇప్పటికే నిక్కీపై ఒక అభిప్రాయం ఉంది కనుక అది కూడా ఆమెను గెలిపిస్తుంది. తన అభ్యర్థిత్వ ప్రసంగంలో ‘‘అమెరికా రేసిస్టు దేశం’’ కాదు అని నిక్కీ తాజాగా అన్నమాట కూడా లోకల్ అమెరికన్‌లలో ఆమెకు ఓట్లు సంపాదించి పెడుతుంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వచ్చే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నిక్కీ కనిపించడానికి ఇవన్నీ కలిసి వచ్చేవే.
ప్రత్యర్థి కమలా హ్యారిస్
ఉపాధ్యక్ష పదవికి నిక్కీ హేలీ ప్రత్యర్థిగా ఉన్న కమలా హ్యారీస్ నాలుగేళ్ల తర్వాత కూడా నిక్కీ అధ్యక్ష పదవికి పోటీ ఇవ్వగల సమర్థురాలే. వ్యక్తిగతంగా నిక్కీ, కమల నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ విడిగా కమలకు కలిసొచ్చే అంశాలు వేరే ఉన్నాయి. తండ్రి జమైకన్ అయినందుకు వల్ల అమెరికాలోని ఆఫ్రికన్ సంతతి వారి ఓట్లు రెండో మాట లేకుండా కమలకే పడతాయి. మానవ హక్కుల ఉద్యమకారిణిగా కూడా కమలకు ప్రస్తుత భావోద్వేగభరిత (ఫ్లాయిడ్ హత్యోదంతం) వాతావరణంలో ప్రాధాన్యం లభించవచ్చు. బాధితులైన స్త్రీలు, పిల్లల తరఫున కేసులు వాదించే న్యాయవాదిగా అమెరికా అంతటా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. విలువలకు కట్టుబడిన రాజకీయ నాయకురాలు అని కూడా.
Comments
Please login to add a commentAdd a comment