గాఢాంధకారంలో ఒక వెలుగు రేఖ ఎంతో ఆశను, నమ్మకాన్ని ఇస్తుంది. సంక్షోభపు చీకటి నుంచి వెలుగు దారుల వైపు అడుగులు వేయడానికి సన్నద్ధం అవుతున్న బంగ్లాదేశ్‌కు కనిపిస్తున్న వెలుగు రేఖల్లో షర్మీన్ ఒకరు. ప్రపంచానికి ఆమె పేరు అపరిచితం కావచ్చు. బంగ్లా ప్రజలకు మాత్రం సుపరిచితం. బంగ్లాదేశ్ పునర్‌నిర్మాణానికి రాళ్లెత్తుతున్న మేధావులు, ఉద్యమకారులలో షర్మీన్ ప్రముఖురాలు. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్‌కు సహాయపడే ఉన్నత స్థాయి సలహాదారులలో షర్మీన్ ఒకరు....
‘శాంతిభద్రతలను పునరుద్ధరించడం, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించడం, సాధారణ పరిస్థితులను నెలకొల్పడం, సుపరిపాలన అందించే రోజులను తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటోంది షర్మీన్. విద్యావంతుల కుటుంబం, సామాజిక ఉద్యమాల్లో భాగమయ్యే కుటుంబంలో ఢాకాలో పుట్టింది షర్మీన్. ఆమె తండ్రి ఖాన్ సర్వర్ ముర్షీద్ ప్రఖ్యాత విద్యావేత్త. దౌత్యవేత్త, మేధావి. తల్లి నూర్జహాన్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఎన్నో సంవత్సరాలుగా బంగ్లాదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల్లో భాగం అవుతూ వస్తుంది షర్మీన్.
సామాజిక మార్పుల కోసం శ్రమించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేసిన షర్మీన్ ‘బ్రోటీ’ అనే మానవ హక్కుల, ఎన్నికల పర్యవేక్షణ బృందానికి సీయీవోగా పనిచేసింది. పారదర్శకమైన, ప్రలోభాలకు వీలులేని, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఈ సంస్థ లక్ష్యం. కళలు, సాంస్కృతిక వారసత్వం కోసం పనిచేసే ‘ఉత్తర్‌సురీ’ అనే సాంస్కృతిక కేంద్రానికి కార్యదర్శిగా పనిచేసింది.
లింగ సమానత్వం నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన సంగీతానికి మాత్రం ఎంతో కొంత సమయం కేటాయిస్తుంది షర్మీన్. 1995లో వచ్చిన ‘ముక్తీర్ గాన్’ అనే డాక్యుమెంటరీ గాయకులలో షర్మీన్ ఒకరు.
‘ఏ భేదాలు లేకుండా ప్రజలను ఏకం చేసే శక్తి సంగీతానికి ఉంది’ అంటుంది షర్మీన్. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం మాట ఎలా ఉన్నప్పటికీ సామాజిక ఉద్యమాలకు సంబంధించి షర్మీన్ ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నది. అయితే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గింది లేదు. తన ధైర్యమే తనకు రక్షగా నిలిచింది.
తాజా విషయానికి వస్తే...
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను షర్మీన్ ఖండిస్తుంది. ‘ఇవి మత కలహాలు కాదు. రాజకీయ ప్రేరేపిత దాడులు’ అంటున్న షర్మీన్ బాధితుల తరఫున నిలబడుతుంది. వారికి ధైర్యాన్ని ఇస్తోంది. ‘విషాదగతాన్ని మరచి΄ోదాం. బంగారు భవిష్యత్తుపై మాత్రమే దృష్టి పెడదాం’ అని అన్ని వర్గాల ప్రజలకు పిలుపు ఇస్తోంది షర్మీన్. ‘షర్మీన్’ అనే పేరుకు ఉన్న అర్థాలలో ‘గైడ్’ కూడా ఒకటి. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు షర్మీన్ ఖచ్చితంగా ఒక గైడ్!
‘గత ఏడాది కాలంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై మన అవగాహన తప్పుడు సమాచారంపైనే ఆధారపడి ఉంది. దాని నుంచి బయటికి రావాలి. స్థూల జాతీయ ఉత్పతి (జీడీపి) గురించి గత ΄ాలకులు చెప్పినవి నిజాలు కావు. విదేశీ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రాథమిక, మౌలిక మార్పులు జరగబోతున్నాయని మీకు హామీ ఇస్తున్నాను’ అని బంగ్లా ప్రజలను ఉద్దేశించి చెబుతోంది షర్మీన్ ముర్షిద్.
Comments
Please login to add a commentAdd a comment