శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది. అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది. అదే రామాయణం.
12 గంటలకు ఎందుకు పూజ చేయాలి?
రాముడు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. అందుకే మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఇంట్లో ఎలా జరుపుకోవాలి?
శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉదయమే లేచి, తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటాన్ని లేదా సీతారాముల విగ్రహాలను పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు (నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయి.
పానకం, వడపప్పు ఎందుకు?
భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరద్ రుతువు, వసంత రుతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధోవికాసం కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment