విచారంగా కూర్చొని ఉన్న వర్ధనమ్మను చూసి ఏమైందని అడిగింది మనవరాలు హారిక. ‘బ్యాంకు ఖాతా నుండి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను ఆ డబ్బులు డ్రా చేయలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. బ్యాంకులో అయితే భద్రంగా ఉంటాయనుకున్నా. ఇప్పుడెలా..’ అంది మనవరాలితో దిగులుగా వర్ధనమ్మ.
‘ఎవరైనా నీకు ఇంతకుముందు ఫోన్ చేశారా..’ అడిగింది హారిక. ‘బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అత్యవసరం అని చెబితే, వాళ్లు పంపిన లింక్ ఫామ్‌లో వివరాలు ఇచ్చాను. అంత కన్నా ఏమీ చేయలేదు’ అంది వర్ధనమ్మ. బామ్మ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయిందని అర్ధమై, వెటనే తగిన చర్యలు తీసుకుంది హారిక. ఆ తర్వాత బామ్మకు సైబర్ మోసగాళ్ల గురించి వివరించింది. ఇంట్లో వయసు పైబడిన వారుంటే సైబర్ మోసాగాళ్ల బారిన పడకుండా ఈ విషయాలు తప్పక తెలియజేయాల్సిన అవసరం వారి పిల్లలకు ఉంది.
సాధారణంగా జరిగే మోసాల్లో ప్రధానమైంది ఫిషింగ్
సైబర్ నేరగాళ్లు మీ డిజిటల్ సమాచార మొత్తాన్ని పొందడానికి ఆన్‌లైన్ సేవ లేదా బ్యాంక్ ఏజెంట్ల వంటి విశ్వసనీయ పరిచయాలను పెంచుకుంటారు. కొన్ని ఉదాహరణలు.. సహాయం కోసం రిక్వెస్ట్ అడుగుతారు. మీరు బహుమతిని గెలుచుకున్నారని చూపుతారు. పెన్షన్ ఫండ్ విడుదలకు కెవైసి అవసరం అంటారు. గతంలో తక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు, ఇప్పుడు రెట్టింపు ఛార్జ్ పడింది అంటారు.
గుర్తింపు చోరీ
సైబర్ దాడి చేసే వ్యక్తులు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామా, డెబిట్/ క్రెడిట్ కార్డ్ వివరాలు, యుపిఐ, పిన్ నంబర్ మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లాభాలను పొందడానికి ఈ సమాచారం సేకరిస్తారు.
దాడుల్లో రకాలు
వీటిలో తరచుగా సీనియర్ డేటింగ్, ప్రిస్క్రిప్షన్ మాత్రలు, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు, పెట్టుబడి లేదా ఛారిటీ స్కామ్‌లు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి నకిలీ ఆర్థిక సహాయ అభ్యర్థనలకు సంబంధించిన మోసాలు ఉంటాయి. చాలా మంది సీనియర్లు ఇలాంటి మోసాలకు లోనవడానికి పెద్ద కారణం ఒంటరితనం, జ్ఞానం లేకపోవడమే.
భద్రతా చిట్కాలు
►తెలియని వారి నుంచి వచ్చే ఇ–మెయిల్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన వ్యక్తుల నుండి వచ్చినవి అయినప్పటికీ, వింత లేదా ఊహించని సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇ–మెయిల్‌లు, వాట్సప్ సందేశాలు లేదా ఎసెమ్మెస్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు అన్నీ హానికరమైన ఫైల్స్‌ను కలిగి ఉండే చిన్న లింక్‌లతో
►పంపినవారు మీకు తెలిసినవారే అని దృఢపరుచుకునేవరకు ఏ లింక్‌లను ఓపెన్ చేయవద్దు. స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల నుండి ఆ మెసేజ్ వచ్చినట్లు కనిపిస్తే, వారు మీకు ఏదైనా పంపినట్లు నిర్ధారించుకోవడానికి తిరిగి వారినే సంప్రదించండి.
►అనుమానిత ఫోన్ కాల్స్, రోబోకాల్స్‌ను రిసీవ్ చేసుకోకండి. కాలర్ తాను ‘‘టెక్ సపోర్ట్‘ నుండి మాట్లాడుతున్నట్టు మీతో చెప్పవచ్చు. మీ కంప్యూటర్‌కు వైరస్ సోకిందని, రిపేర్ ఉందని మీకు తప్పుగా చెప్పవచ్చు. మీరు టాక్స్ డిఫాల్టర్ లేదా పెన్షన్ ప్రాసె సింగ్ లేదా కెవైసీ కోసం అడుగుతున్న బ్యాంక్ అధికారి అని కూడా చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ మొదలైన వాటి ప్రాసెసింగ్ అని చెప్పవచ్చు.
►మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోని పాప్‌అప్ విండోలకు ప్రతిస్పందించవద్దు లేదా దానిపై క్లిక్ చేయవద్దు. మీ కంప్యూటర్ లేదా ఫోన్‌లో ‘అత్యవసర‘ పాప్‌అప్ విండో కనిపిస్తుంది. మీ డిజిటల్ పరికరానికి రిపేర్ అవసరమని లేదా ఒక ఫోన్‌ను ఆఫర్‌లో ‘మరొక ఫోన్‌ను పొందండి’ అంటూ మీలో ఆశను కలిగిస్తాయి. మీ కంప్యూటర్ సిస్టమ్‌కి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయమని అడగవచ్చు.
►అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని వాటిని డౌన్‌లోడ్ చేసే సమయంలో సురక్షిత బ్రౌజింగ్ పద్ధతులను అనుసరించండి. మీకు తెలిసిన సీనియర్స్‌కి విశ్వసనీయ వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించమని, వారు సురక్షితమైన సైట్‌లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి httpr://(ప్యాడ్ లాక్ సింబల్) కోసం చూడాలని సలహా ఇవ్వండి.
►రెగ్యులర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు భద్రతా లోపాలను పరిష్కరించగలవు. వారి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ వంటి పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయమని సీనియర్లను ప్రోత్సహించండి.
►యాప్స్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.
►ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను (ప్రత్యేక అక్షరాలు, పెద్ద అక్షరాలు, సంఖ్యాపరమైనవి) ఉపయోగించమని వృద్ధులను ప్రోత్సహించండి. వారి పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి సులభంగా ఊహించదగిన సమాచారాన్ని ఉపయోగించవద్దు.
►తెలియని వ్యక్తులతో మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లతో రిమోట్ స్క్రీన్ షేరింగ్ చేయకండి.
►అన్ని ఇ–మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాల కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి.
మోసపోతే ఏం చేయాలంటే..
ఈ టోల్ ఫ్రీ నంబర్ 1930కి వెంటనే (ఒక గంటలోపు) ఫోన్ చేయండి. దీని ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం
ఉంటుంది. ఈ 1930 సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. దీనికి బదులుగా మీరు మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీసు అధికారుల వద్ద జరిగిన మోసం చెప్పి కంప్లయింట్ ఇవ్వచ్చు. లేదా httpr://www.cybercrime. gov.in లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
స్మార్ట్‌ఫోన్ నుండి దూరంగా ఉండాలంటే..
►మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్‌లను నిలిపి వేయండి.
►మీ పడకగది, భోజనాల గదిని స్మార్ట్‌ఫోన్ రహిత జోన్‌గా మార్చండి.
►మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి సోషల్ మీడియాను యాక్సెస్ చేయండి.
►ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడం కోసం ఆండ్రాయిడ్‌లో డిజిటల్ వెల్‌బీయింగ్ యాప్, ఐఓఎస్‌లో స్క్రీన్ టైమ్ యాప్‌ని ఉపయోగించండి.
►ప్రజలు తమ స్క్రీన్ వినియోగ సమయం పెరుగుతోందని భావిస్తే గ్రే స్కేల్ మోడ్ ఫీచర్‌ని ఉపయోగించండి
Comments
Please login to add a commentAdd a comment