అవి గాంధీ మహాత్ముడు మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలో అడుగు పెట్టినప్పటి రోజులు. ఓరోజు గాంధీజీ తన మిత్రుడితో కలిసి అతని కారులో ప్రయాణం చేస్తున్నారు. గాంధీజీ అలా ప్రయాణం చేయడం నచ్చని కొందరు వ్యతిరేకులు ఆయనకు అడ్డంకులు కల్పించడానికి గాను ఓ చెట్టు చాటు నుంచి కారుపై రాళ్లు రువ్వారు. రాళ్ళు కారుమీద పడగానే గాంధీజీ మిత్రుడితో కారును ఓ పక్కగా ఆపమన్నారు. అనంతరం ఆయన నెమ్మదిగా కారు లోంచి కిందకు దిగారు. చుట్టూ చూశారు. కనుచూపుమేరలో ఓ చెట్టు దగ్గర నిల్చున్న కొందరిని గాంధీజీ చూశారు. వారు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. దాంతో తిన్నగా వారి దగ్గరకు వెళ్లారు. కారు మీద రాళ్ళు విసిరిన వారు వారే అయి ఉండొచ్చని అనుకున్నారు.
వారిని సమీపించి ‘‘మీకు నా మీద కోపం ఉండొచ్చు. కాదనను. ఆ కోపం మీ వరకూ సబబే కూడా అయి ఉండొచ్చు. అది కూడా నేను కాదనను. అయితే, మీ కోపాన్ని చూడానుకుంటే రాళ్ళు నామీద విసరాలే తప్ప పాపం ఈ కారు ఏం చేసింది? అంతేకాదు, ఆ కారు కూడా నాది కాదు. నా మిత్రుడిది. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు మీ కోపాన్నినా మీద చూపండి. ఇదిగో మీముందే నిల్చున్నాను. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి, నేను మీ ముందు ఒంటరిగా నిల్చున్నాను. నన్ను మీరేమైనా చేసుకోవచ్చు. అందుకు నేనేమీ అనుకోను. కారు మీద రాళ్ళు విసరడం మాత్రం తప్పు. ఎందుకంటే అది మిమ్మల్నేమీ చెయ్యలేదు. చెయ్యదు కూడా. అయినా మీరు రాళ్లు విసరడం వల్ల అది నాశనమవుతుంది. అప్పుడు నా మిత్రుడు బాధపడతాడు. నష్టం అతనికి తప్ప నాకు కాదుగా...’’ అని గాంధీజీ చెప్పడంతో ఆయనను ఆట పట్టించాలనుకున్న వాళ్ళు గాంధీజీ మాటలకు సిగ్గుపడి తల దించుకున్నారు.
కాస్సేపు అక్కడ మౌనం తాండవించింది. అనంతరం ఆ అల్లరిమూక గాంధీజీ కాళ్ళపై పడి తమను క్షమించాలని అడిగారు. గాంధీజీ చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా వారితో కరచాలనం చేశారు. క్షమ లేకనే మనం మామూలు వాళ్లలా ఉన్నాము. క్షమాగుణం వల్లనే గాంధీజీ మహాత్ముడయ్యాడు. అందుకే క్షమ కలవాడు అందరికన్నా బలమైన వాడని సామెత.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment