నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించాను. క్షుణ్ణంగా నేర్చుకున్నావు. ఇక ఇంటికివెళ్లి, తగిన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు.
శ్రీరామచంద్రుడి తాత అయిన రఘు మహారాజు పరిపాలిస్తున్న రోజులవి. రఘు మహారాజు పాలనలో విద్యలకు గొప్ప ఆదరణ ఉండేది. విరివిగా గురుకులాలు ఉండేవి. ప్రతి గురుకులంలోనూ వందలాదిగా శిష్యులుండేవారు. గురువుల శుశ్రూషలో గడుపుతూ, విద్యలు నేర్చుకునేవారు. పరతంతు మహాముని నడిపే గురుకులంలో కౌత్సుడనే పేదబాలకుడు కూడా విద్యాభ్యాసం చేసేవాడు. గురువును అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటూ, వేదవేదాంగాలను, సకల శాస్త్రాలనూ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కౌత్సుడి విద్యాభ్యాసం పూర్తయిన సందర్భంగా గురువు పరతంతుడు అతణ్ణి చేరబిలిచి,
‘నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పించాను. క్షుణ్ణంగా నేర్చుకున్నావు. ఇక ఇంటికివెళ్లి, తగిన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. ఎప్పటికీ స్వాధ్యాయాన్ని శ్రద్ధగా కొనసాగించు. గృహస్థాశ్రమంలో కోపతాపాలకు తావివ్వకు. త్యాగంతో కూడిన భోగమే గొప్పదని గ్రహించు. ధర్మాన్ని ఆచరించు’ అని చెప్పాడు. ‘గురువర్యా! విద్యాభ్యాస సమయంలో చేసిన దోషాలను మీరు క్షమించాలి. మీకు గురుదక్షిణ చెల్లించడం శిష్యునిగా నా కర్తవ్యం. గురుదక్షిణగా ఏం కావాలో ఆదేశించండి’ అన్నాడు కౌత్సుడు.
‘నిరుపేదవు నువ్వేమిచ్చుకుంటావు నాయనా! ఆశ్రమంలో సేవలు చేసుకుంటూ, నా శుశ్రూషలో గడిపావు కదా! అది చాలు. నీ సేవలను చాలాసార్లు మెచ్చుకున్నాను కూడా. నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు. సంతోషంగా వెళ్లిరా’ అన్నాడు గురువు పరతంతుడు. ‘గురువర్యా! దయచేసి మీరు అలా అనవద్దు. గురుదక్షిణ కోరుకోండి. తప్పక చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను’ అన్నాడు కౌత్సుడు. తనకు ఏమీ ఇవ్వనవసరం లేదని పరతంతు మహాముని పదేపదే చెప్పినా, కౌత్సుడు వినిపించుకోలేదు. గురుదక్షిణ కోరుకోవాల్సిందేనంటూ పట్టుబట్టాడు. శిష్యుడి మొండితనానికి విసిగిన గురువు ఇలా అన్నాడు:
‘నాయనా! నీకు పద్నాలుగేళ్లు పద్నాలుగు విద్యలను నేర్పించాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి, ఒక గులకరాయిని విసిరితే, ఆ రాయి ఎంత ఎత్తుకు ఎగురుతుందో అంత ఎత్తు గల పద్నాలుగు ధనరాశులు ఇవ్వు’ అన్నాడు. ‘సరే’నని గురువుకు నమస్కరించి, బయలుదేరాడు కౌత్సుడు. గురువుకు గురుదక్షిణ చెల్లించాలనే సంకల్పమే తప్ప, ఎలా చెల్లించాలో అతడికి అంతుచిక్కలేదు. రాజు తండ్రివంటి వాడంటారు. రాజును కోరుకుంటే తప్పక తనకు కావలసిన ధనరాశులు దొరుకుతాయని ఆలోచించి, రాజ దర్శనానికి బయలుదేరాడు. రఘు మహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు. అంతకుముందు రోజే రఘు మహారాజు ఒక మహాయజ్ఞం చేసి, తన వద్దనున్న ధనరాశులన్నింటినీ దానం చేశాడు. కౌత్సుడు వచ్చేసరికి రఘు మహారాజు మట్టి కుండలు ఎదుట పెట్టుకుని, సంధ్యావందనం చేస్తున్నాడు.
కౌత్సుడిని గమనించిన రఘు మహారాజు ‘నాయనా! నువ్వెవరివి? ఏ పనిమీద వచ్చావు?’ అని అడిగాడు. మహారాజు పరిస్థితిని గమనించిన కౌత్సుడు ‘అది కష్టంలే మహారాజా!’ అని నిష్క్రమించడానికి వెనుదిరిగాడు. రఘు మహారాజు అతణ్ణి వెనక్కు పిలిచాడు. ‘నా వద్దకు వచ్చి, వట్టి చేతులతో వెనుదిరగడమా? ఏం కావాలో సంశయించకుండా అడుగు. తప్పక ఇస్తాను’ అన్నాడు. కౌత్సుడు తన గురువుకు చెల్లించాల్సిన గురుదక్షిణ కోసం వచ్చానంటూ, జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ‘రేపు ఉదయమే కనిపించు. నీవు కోరిన ధనరాశులు ఇచ్చుకుంటాను’ అని కౌత్సుణ్ణి సాగనంపాడు రఘు మహారాజు.
యజ్ఞంలో చేసిన దానాల వల్ల ఖజానా ఖాళీ అయిన స్థితిలో ఏం చేయాలో పాలుపోలేదు మహారాజుకు. మంత్రులతో సంప్రదించాడు. వారి సలహాపై రాజగురువైన వశిష్ఠుని వద్దకు వెళ్లాడు. ‘తక్షణమే అంత ధనం కావాలంటే, దేవేంద్రుడిపై దండెత్తడమే మార్గం’ అని సూచించాడు.
రఘు మహారాజు దేవేంద్రుడిపై దండ్రయాత్రకు బయలుదేరాడు. ఆయన సైన్యం చేసే భేరీనాదాలకు దేవేంద్రుడి చెవులు మార్మోగాయి. దేవదూతల ద్వారా రఘు మహారాజు దండయాత్రకు వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ‘ధర్మాత్ముడైన రఘు మహారాజు ఏమి కోరి దండయాత్రకు వస్తున్నాడో కనుక్కోండి. ఆయనను కోరినది ఇచ్చి, సంధికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పండి’ అని దేవదూతలను పంపాడు.
ధనరాశులు కోరి దండయాత్రకు వచ్చినట్లు తెలుసుకున్న దేవేంద్రుడు, తక్షణమే రఘు మహారాజు కోశాగారాలన్నింటినీ ధనరాశులతో నింపివేయాలని దేవదూతలను ఆదేశించాడు. కోశాగారాలు అపార ధనరాశులతో నిండిపోయి ఉండటం గమనించిన రాజభటులు హుటాహుటిన రఘు మహారాజు వద్దకు చేరుకుని, సంగతి చెప్పారు.
యుద్ధం చేయకుండానే పని నెరవేరడంతో రఘు మహారాజు సైన్యంతో వెనుదిరిగాడు. మర్నాడు ఉదయమే వచ్చిన కౌత్సుడికి తన కోశాగారాల్లోని ధనరాశులను చూపించి, ‘నీకు కావలసిన ధనరాశులు తీసుకువెళ్లు’ అన్నాడు. కౌత్సుడు వాటిని చూసి, ‘నా గురువు పద్నాలుగు ధనరాశులే కోరుకున్నాడు. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగిలినవి నాకొద్దు’ అంటూ తన గురువు కోరినన్ని మాత్రమే ధనరాశులను తీసుకుని బయలుదేరాడు. మిగిలిన ధనరాశులను రఘు మహారాజు తిరిగి దేవేంద్రుడికి పంపేశాడు. ∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment