టీచర్‌, బ్యాంకు ఉద్యోగాలు వదిలేసి ఇప్పుడీ స్థాయిలో.. | Tailor Daughter Kanchan Turns 6500 Maharashtra Women Into Entrepreneurs | Sakshi
Sakshi News home page

టీచర్‌, బ్యాంకు ఉద్యోగాలు వదిలేసి ఇప్పుడీ స్థాయిలో..

Published Wed, Jan 27 2021 8:10 AM | Last Updated on Wed, Jan 27 2021 9:01 AM

Tailor Daughter Kanchan Turns 6500 Maharashtra Women Into Entrepreneurs - Sakshi

కాంచన్‌ పరులేకర్‌.. వయసు 70...  బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగం... కెరీర్‌లో ఉన్నతస్థాయి పదవి. ఆ పదవిని వద్దనుకున్నారు. నలుగురికీ  ఉపయోగపడాలనుకున్నారు. ఒక మహిళగా పేదరికాన్ని,  అడ్డంకులను దాటుకుంటూ,  టీచర్‌ స్థాయి నుంచి బ్యాంక్‌  మేనేజర్‌ స్థాయికి ఎదిగిన కాంచన్‌  చిన్నతనం నుంచి ఏదో ఒకటి సాధించాలని కలగన్నారు. మహిళలకు చేయూత  ఇవ్వాలనుకున్నారు. వారిని  పారిశ్రామికవేత్తలుగా  తీర్చిదిద్దాలనుకున్నారు.  తన కలను సాకారం చేసుకోవటం  కష్టమని తెలిసినా,  చిన్న విషయంగానే భావించిన కాంచన్‌ ప్రయాణం...

1950–60 ప్రాంతంలో... కాంచన్‌ తల్లిదండ్రులు సాంఘిక సంస్కరణలు చేపట్టడంలో ముందుండేవారు. వారిది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌. కాంచన్‌ తల్లి టైలర్, తండ్రి సామాజికవేత్త. తల్లిదండ్రుల వారసత్వం అందుకున్న కాంచన్, తన పదకొండవ ఏటే  ఒక పబ్లిక్‌ మీటింగ్‌లో ఉపన్యాసం ఇచ్చారు. ఆమె ఉపన్యాసానికి ముగ్ధులైన ప్రముఖ సంఘ సేవకుడు, ‘స్వయం సిద్ధ’ సంస్థ వ్యవస్థాపకుడు డా. వి. టి. పాటిల్‌ కాంచన్‌ను చేరదీసి చదివించారు.

పాటిల్‌ మరణించాక ఆయన ఆశయాలను కొనసాగించాలనుకున్నారు కాంచన్‌. ఆ సంస్థ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనుకున్నారు. గత 30 సంవత్సరాలుగా 6500 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేసి, తన కలను, తన తల్లిదండ్రుల ఆశయాలను, తనను పెంచిన తండ్రి ఆశలను సాకారం చేయగలిగారు కాంచన్‌.

డబ్బు విలువ తెలుసు...
తన చుట్టూ మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నవారు, నిరుపేదలు, నిరక్షరాస్యులను కూడా చూసిన కాంచన్‌ మనసు కలత చెందింది. ‘‘బడుగు బలహీన వర్గాల వారు పేదరికం కారణంగా, కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఇందుకు వ్యతిరేకంగా మా తల్లిదండ్రులు పోరాటం చేశారు. నేను కూడా వారి మార్గంలోనే నడుస్తూ, ఇటువంటి అభాగ్యులకు సరైన న్యాయం జరిగేవరకు పోరాటం చేయాలనుకుంటున్నాను. సెకండ్ హ్యాండ్‌ పుస్తకాలతో చదువు పూర్తి చేసిన నాకు డబ్బు విలువ బాగా తెలుసు’’ అంటారు కాంచన్‌.

బ్యాంకు ఉద్యోగం వదిలేసి...
తల్లిదండ్రులతో పాటు మీటింగులకి, ర్యాలీలకి వెళ్తూనే కాంచన్, ఎం. ఏ. డిప్లమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు. పది సంవత్సరాల పాటు టీచర్‌గా పనిచేశాక, బ్యాంకులో ఉద్యోగం రావటంతో అక్కడికి మారారు. అక్కడ 14 సంవత్సరాలు పనిచేశాక, బ్యాంకు మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు వారు నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలలో కాంచన్‌ పాల్గొనేవారు. అయినప్పటికీ ఇంకా తన సేవలు అవసరంలో ఉన్నవారికి విస్తృతంగా అందించాలనుకున్నారు. చేస్తున్న బ్యాంకు ఉద్యోగం విడిచిపెట్టేసి, 1992లో స్వయంసిద్ధలో పనిచేయటానికి పూనుకున్నారు.

రెండు చోట్లా రెండు రకాలుగా..
కాంచన్‌కు ఇప్పుడు రెండు విభాగాలలో పనిచేయాల్సిన అవసరం కనిపించింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు. నగరాలలో నివసించే మహిళలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణకు డబ్బు కట్టవలసి ఉంటుంది, గ్రామీణులకు ఉచితంగా నేర్పుతారు. కాంచన్‌ వార్తాపత్రికలో, ‘ఇంటి దగ్గర ఉండే మహిళలు ఆర్థిక స్వాతంత్య్రంతో జీవించండి’ అంటూ ప్రకటన వేశారు. ఆ ప్రకటన చూసి 130 మంది మహిళలు కాంచన్‌ను కలిశారు.

వారికి ఏయే రంగాలలో ఆసక్తి ఉందో అడిగి తెలుసుకున్నారు. ‘‘ఆహారం దగ్గర నుంచి హస్త కళల వరకు వివిధ రంగాలలో వారికి ఉన్న ఆసక్తి కనపరిచారు. వారి అభిరుచికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చాం. ఒక సంవత్సరం తరవాత ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాలలో కూడా అమలుచేశాం.. కాని అక్కడ వారికి ఉచితంగానే శిక్షణ ఇచ్చాం. కోల్హాపూర్‌ జిల్లాలోని చిన్న చిన్న గ్రామాలలో కోళ్ల ఫారమ్, తేనెటీగల పెంపకం, సేంద్రియ వ్యవసాయం వంటివి నేర్పించాం. మహిళలకు ఋణసదుపాయం కూడా కల్పించాం’’ అంటారు కాంచన్‌. 

వ్యాపారం కూడా తెలియదు..
‘‘బేకరీల నుంచి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వరకు, బ్యాగుల తయారీ యూనిట్స్‌ నుంచి బ్యూటీ పార్లర్‌లు, హస్త కళల వరకు అన్ని వ్యాపారాలను మహిళలు ప్రారంభించారు. మహిళలు వారి సొంత సంస్థలు స్థాపించుకునేవరకు వారికి శిక్షణ ఇస్తుంటాం. వారి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తుంటాం. కిందటి సంవత్సరం 3.5 కోట్ల బిజినెస్‌ చేశాం’’ అంటారు కాంచన్‌. ఇందులో చాలామంది మహిళలకు ఏ విధంగా వ్యాపారం చేయాలో కూడా తెలియదు.

అందుకనే ‘స్వయం సిద్ధ’లో ‘స్వయం ప్రేరక’ అనే సహకార సంస్థను స్థాపించి, వారం వారం నిర్వహించే సంతలో ప్రదర్శన పెట్టి, ఆ వస్తువులను విక్రయించటం అలవాటు చేశారు. ‘‘ఇలా ఎంతో మంది మహిళలు, ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. స్వయంగా వారిని వారు ముందకు తీసుకువెళ్తున్నారు. నెలకు అరవై వేలు సంపాదించుకునేంత ఎత్తుకు ఎదుగుతున్నారు’’ అంటూ ఆనందంగా చెబుతారు కాంచన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement