మహిళా అర్చకురాలు పిన్నియక్కల్
ఆగమశాస్త్రంలో శిక్షితులైన మహిళలను ఆలయాల్లో అర్చకులుగా నియమించనున్నామని వారికి ప్రతి నెలా ఐదు రోజుల బహిష్టు సెలవు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై సామాజికంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోర్టు అనుమతి ఇచ్చినా గత పదేళ్లుగా అర్చకత్వం చేయడానికి పెనుగులాడుతున్న మదురై మహిళా అర్చకురాలు పిన్నియక్కల్ ఇప్పుడు వార్తల్లో ఉంది. ‘ఆలయంలో అమ్మవారు స్త్రీ రూపం. కాని ఆమెను అర్చించడానికి స్త్రీలను వద్దనడం విడ్డూరం’ అని మదురై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది.
సామాజిక న్యాయం, లైంగిక సమానత్వం అనే మాటలు ప్రతిపాదించినప్పుడు ఆదర్శనీయంగా ఉంటాయి కాని వాటిని అమలు చేయాల్సివచ్చినప్పుడు సంఘపరంగా పాతుకుపోయిన అభిప్రాయాల వల్ల, సెంటిమెంట్ల వల్ల సమస్యలు వస్తుంటాయి. చర్చ కూడా జరుగుతుంది. తమిళనాడు లో ఇప్పుడు అర్చకులుగా మహిళలను నియమించే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. ‘మాకు మహిళల నుంచి అర్చకుల ఉద్యోగాల కోసం వినతులు వస్తున్నాయి. మేము వాటిని పరిశీలిస్తున్నాం’ అని ఆ రాష్ట్ర హైందవ ఆలయాల నిర్వహణ ఇన్‌చార్జ్ మంత్రి శేఖర్‌బాబు అన్నారు.
మాతృస్వామ్యం నుంచి పురుషస్వామ్వానికి
‘మాతృస్వామ్యంలో ఆలయాల్లో అర్చకులు మహిళలే ఉండేవారు. ఆ తర్వాత ఆర్యుల రాకతో వీరి స్థానంలో పురుషులు వచ్చారు.’ అంటారు తమిళనాడుకు చెందిన సత్యభామా అమ్మయార్. ఆమె తన సాయిబాబా ట్రస్ట్ తరపున మహిళలకు అర్చకత్వంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నిజానికి దక్షణాది రాష్ట్రాలలోని కొన్ని గ్రామీణ అమ్మతల్లుల గుడులలో, గిరిజన గద్దెలలో మహిళలు అర్చకులు గా పని చేసే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. అలాంటి వాళ్లు ఉన్నారు. అయితే శాస్త్ర ప్రకారం పూజాదికాలు జరిగే ఆలయాలలో స్త్రీలు అర్చకులు గా ఉండటం సరికాదన్న అభిప్రాయం కొందరి నుంచి వినిపిస్తోంది.
‘ఇలాంటి లైంగిక మూసను మనం బద్దలు కొట్టాలి. స్త్రీ అర్చకుల విషయంలో ఎవరి నుంచైనా అభ్యంతరాలు వస్తే అవి ఎలాంటివో వాటిని ఏ విధంగా పరిగణించాలో కూడా చూస్తాం. కొన్నాళ్ల క్రితం కోర్టు ద్వారా మంగుళూరులో ఒక మహిళ అర్చకురాలిగా నియమితురాలైంది’ అని తమిళనాడు మంత్రి అన్నారు. ‘స్త్రీలకు ప్రతి నెల బహిష్టు సమయంలో అర్చనకు దూరంగా ఉండేలా ఐదు రోజుల సెలవు ఇస్తాం’ అని ఆయన అన్నారు. తమిళనాడులో అన్ని వర్గాల పురుషులు అర్చకత్వానికి యోగ్యులేనని పూర్వం కరుణానిధి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆరు ఆలయాల్లో అర్చక పాఠశాలలు తెరిచింది. వాటిలో ఒక సంవత్సరం కోర్సు చేసిన వారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం ఆలయాల్లో బ్రాహ్మణేతరులను సామాజిక సమానత్వంలో భాగంగా అర్చకులుగా నియమించనుంది. అలాగే లైంగిక సమానత్వంలో భాగంగా స్త్రీలను నియమించనుంది. అంతేకాదు తమిళంలో అర్చకత్వం చేసేవారిని ప్రోత్సహిస్తోంది.
కొనసాగుతున్న పోరాటం
ఈ సందర్భంలోనే పిన్నియక్కల్ అనే మహిళా అర్చకురాలి పోరాటం కూడా చర్చకు వస్తోంది. మదురై సమీపంలో ఉన్న ఉసిలంపట్టి అనే గ్రామంలో పిన్నియక్కల్ కుటుంబం వంశ పారంపర్యంగా అక్కడి దుర్గ ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తోంది. 2004లో పిన్నియక్కల్ తండ్రి పిన్నయ్‌తేవర్ జబ్బుపడ్డాడు. దాంతో అతని కుమార్తె పిన్నియక్కల్ రెండేళ్లపాటు అర్చకత్వం చేసింది. అప్పుడు గ్రామస్తులు అభ్యంతరం చెప్పలేదు. కాని 2006లో పిన్నయ్‌తేవర్ మరణించాక పిన్నియక్కల్‌ను ఆలయంలో రావడానికి వీల్లేదని గ్రామపెద్దలు అన్నారు. దాంతో పిన్నియక్కల్ హైకోర్టు (మదురై బెంచ్)కు వెళ్లింది. కేసును విచారించిన జస్టిస్ చంద్రు పిన్నియక్కల్ పక్షాన తీర్పు ఇచ్చారు.
‘ఆలయాల్లో కేవలం పురుషులే అర్చకత్వం నిర్వహించాలనేదానికి ఏ ప్రమాణం లేదు. స్త్రీలు కూడా ఇందుకు యోగ్యులే’ అని తీర్పు ఇచ్చారు. ‘అమ్మవారిని స్త్రీలు అర్చించేందుకు అడ్డంకులా’ అని కూడా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆ తీర్పు చాలా ప్రశంసకు పాత్రమైంది. అయితే తీర్పుల అమలు కూడా ఒక్కోసారి అంత సులువు కాదు. ఆ దుర్గ ఆలయాన్ని ఆరాధించే చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు నేటికీ పిన్నియక్కల్‌ను అర్చకురాలిగా సంపూర్ణంగా స్వీకరించలేదు.
‘అమ్మవారి ముందుకు డబ్బున్నవాళ్లు, పేదలు, పై వర్గం వారు కింది వర్గం వారు అందరూ వస్తారు. అమ్మవారు ఎవరినీ వేరు గా చూడదు. మరి అర్చకురాలిగా నన్ను ఎందుకు వేరుగా చూడటం. నేను ఇంకా నా అర్చకత్వం కోసం ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని కోర్టుల చుట్టూ తిరగాలో’ అని 59 సంవత్సరాల పిన్నియక్కల్ అంది. ప్రార్థనా స్థలాల నిర్వహణ, ఉపాధి, ఆధిపత్యం ఎన్నో ఏళ్లుగా పురుషుల చేతిలో ఉంది. ఇప్పుడు స్త్రీలు తమ న్యాయమైన వాటా కోసం గొంతెత్తుతున్నారు. మున్ముందు ఈ గొంతు ఇంకా గట్టిగా వినిపించవచ్చు.– సాక్షి ఫ్యామిలీ
చదవండి: భూ వివాదం : పూజారి సజీవ దహనం
Comments
Please login to add a commentAdd a comment