మనకు డయాబెటిస్ ఉందనగానే ఆ పండు తినకూడదని, ఈ కూరగాయ తినకూడదనీ రకరకాల సలహాలు చెబుతూ మనల్ని తికమకకు గురి చేసేస్తుంటారు చాలామంది. ఈ సందిగ్ధం లేకుండా డయాబెటిస్ ఉన్న వారు ఏయే పండ్లు, కూరగాయలు తినవచ్చో తెలియజేసే ప్రయత్నంలో భాగమే ఈ కథనం.
కొన్ని పండ్లు సహజ సిద్ధంగా చక్కెర పరిమాణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఇలాంటి పండ్లను తీసుకోవడం చాలా హానికరం. ముఖ్యంగా మామిడి, శీతాఫలం, సపోటా, అరటి, పైనాపిల్‌ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి.
ఎండు ఖర్జూరాలు
రోజూ కొన్ని ఎండు ఖర్జూరాలను తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు సహాయపడతాయి. అయితే వీటిని పరిమితంగానే తీసుకోవాలి.
నారింజ
సిట్రస్ జాతి ఫలాల్లో నిమ్మకాయ, నారింజ చాలా మంచివి. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేసేందుకు నారింజ ఎంతగానో ఉపకరిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే గుణం కలిగిన ఈ పండును రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
జామ
జీర్ణసంబంధిత సమస్యలకు జామ అద్భుత ఔషధం. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంచిది. జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే మధుమేహులు జామను దోరగా ఉన్నదే తీసుకోవడం మంచిది.
యాపిల్
మధుమేహం ఉన్న వారికి యాపిల్ పండు మంచిది. ఇందులో పిండిపదార్థాలతోబాటు ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మధుమేహులు యాపిల్ తీసుకోవడం మంచిది. అయితే తొక్కతోపాటు తీసుకున్నప్పుడే ప్రయోజనం.
తినవలసిన కూరగాయలు
క్యాబేజీ
డయాబెటిస్ డైట్‌లో వాడే కూరగాయల్లో అద్భుతంగా పనిచేసేది క్యాబేజీ ఒకటి. ఎక్కువగా చలికాలంలోనే దొరికే క్యాబేజీని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులోని అధిక ఫైబర్ శరీరంలోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
చిలగడ దుంప (స్వీట్ పొటాటో)
చిలగడ దుంప అని, గెణుసుగడ్డ అని, రత్నపురి గడ్డ అనీ ఇలా రకరకాలుగా పిలిచే ఈ కూరగాయను నేరుగా తినొచ్చు లేదా కూరలా వండుకొని కూడా తినొచ్చు. యాంటీ డయాబెటిక్ ఫుడ్‌గా దీనికి పేరుంది. ఇందులోని న్యూట్రిషన్లు, ఫైబర్ సహా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్‌షుగర్‌ను అదుపు చేయడంతో పాటు బరువు తగ్గించడంలో కూడా బాగా పని చేస్తుంది.
ఇంకా టమోటా, దొండ, బెండ, కాకర, బీర, సొర, పొట్ల, క్యారట్ మంచిది. బంగాళదుంపను, బీట్‌రూట్‌ను వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. ఇంచుమించు ఆకుకూరలన్నీ డయాబెటిస్‌కు మంచిదే.
(చదవండి: చక్కెర కంటే బెల్లమే ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment