మేష రాశి
ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3.
అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ద్వితీయార్ధంలో సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి సాగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు. అదే రీతిగా ట్రాన్స్‌ఫర్ కావలసిన వారు జాగ్రత్తగా ప్రయత్నించాలి.
అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజ్యులు, గురువులు, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి, అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది. గతంలో వున్న ఋణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం అంతా అనుకూలం. అవసరానికి కావలసిన కొత్త ఋణాలు కూడా బాగా అందుతాయి. ప్రతి వ్యవహారములను ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది.
నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు వుంటాయి. ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తుంటాయి. మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు. పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. కళ్లు, నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా వున్నది. వృత్తి రీత్యా అభివృద్ధి ఉన్నది. కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది.
గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే రాహువు వలన మధ్య మధ్య చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అవుతుంది. అయినా పని విజయవంతం అవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన. ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్న వారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుంచి చాలా విశేష ఫలితాలు ఉంటాయి. మే వరకు సాధారణం. రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉన్నది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి.
అశ్వని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్నా, మానసిక ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు. భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ. కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు. ఆరోగ్యశ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రవర్తన ఇతరులకు, ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి అద్భుతమైన కాలం. ఊహకు అందని అవకాశాలు వస్తుంటాయి. శుభ పుణ్యకార్యాల నిమిత్తం ప్రయాణాలు, ధనవ్యయం.
శాంతి మార్గం: రాహు సంచారం అనుకూలం లేని కారణంగా ‘దుర్గా సప్తశ్లోకీ’ పారాయణ చేయండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. రాహు శాంతికి జప దానాలు చేయించడం శ్రేయస్కరం.
ఏప్రిల్: మానసిక శారీరక శ్రమ వల్ల అశాంతి. ధైర్యంగా ఉంటారు. పుణ్యకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాల వల్ల చికాకులు. ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలకు వెళ్ళవద్దు. కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. షేర్ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ చికాకులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ కలిగినా, ఫలితం అందదు. చివరి వారంలో రవి కుజ ప్రతికూలం. ఆరోగ్యశ్రద్ధ వహించాలి.
మే: ఆర్థిక లాభాలు ఉంటాయి. అహంభావం వల్ల ఇబ్బందులు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. ఉద్యోగంలో విభేదాలు ఉన్నా, మాట నియంత్రణతో పనులు పూర్తిచేస్తారు. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. కోర్టు, స్థిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి.
జూన్: ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష రాణింపు, ఆర్థిక– వస్తు– వాహన లాభాలు ఉంటాయి. స్థానచలనం అనుకూలత ఉన్నది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల శుభం. 19వ తేదీ వరకు అశ్వనీ వారికి, 19వ తేదీ నుండి భరణీ నక్షత్రం వారికి కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితాలు శూన్యం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన సత్ఫలితాలు ఉంటాయి.
జులై: మొదటి రెండువారాల్లో మిశ్రమ ఫలితాలు. 3, 4 వారాల్లో రవి– కుజుల ప్రభావంతో కుటుంబంలో చికాకులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు, షేర్ వ్యాపారాలకు అనుకూలం. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు.
ఆగస్ట్: కుజ– బుధ– శుక్రుల అనుకూలత వలన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, భూలాభం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నరదృష్టి పెరుగుతుంది. కాలభైరవాష్టక పారాయణ మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలం.
సెప్టెంబర్: ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన– వస్తు– వాహన– గృహ లాభ సూచనలు ఉన్నాయి. శత్రు ఋణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రునికి జప దానాదులు చేయాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు ద్వితీయార్ధంలో తగ్గుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. స్నేహితులతో కలసి చేసే వ్యవహారాలు చిక్కులు సృష్టిస్తాయి. విద్యార్థులకు రైతులకు అనవసర వ్యవహారాలు ప్రాధాన్యం అందుకుంటాయి.
అక్టోబర్: ఈనెల ప్రతికూలత ఎక్కువ. విమర్శలు ఎదురవుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. వచ్చే 6 నెలలు కుజ సంచారం ప్రతికూలం. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రవి, శుక్రులకు దానం, కుజునకు విశేష శాంతి చేయాలి.
షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. అయితే నష్టాలు ఉండవు. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. నవంబర్: చతుర్థ– అష్టమాల్లో కుజ– రవుల సంచారంతో అధికశ్రమ, తక్కువ ప్రతిఫలం. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. రైతులకు మంచి సలహాలు అందుతాయి. భరణీ నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి పెంచినా, మీ తెలివితో వారిని ఆకర్షిస్తారు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి.
డిసెంబర్: అనవసర విషయాల్లో జోక్యం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి పనుల్లో ఆలస్యం. రవి, కుజ, శుక్రులకు శాంతి చేయాలి. వ్యాపారులకు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు.
జనవరి: పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనలాభం, గృహ వాహన వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, భూ కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు మంచి లాభాలు. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, కోర్టు వ్యవహారాలకు అనుకూలం.
ఫిబ్రవరి: పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగవ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం. శుక్ర, లక్ష్మీ ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులకు దూకుడు కూడదు. ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. గురువులు, శ్రేయోభిలాషులు సహకారం అందిస్తారు.
మార్చి: శ్రమకు తగిన గుర్తింపు. స్థానచలనం అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దైవదర్శనం, తీర్థస్నానం, యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment