ఎముకల క్యాన్సర్లు... ఒక అవగాహన | Understanding Bone Cancer | Sakshi
Sakshi News home page

ఎముకల క్యాన్సర్లు... ఒక అవగాహన

Published Sun, Jul 24 2022 6:21 AM | Last Updated on Sun, Jul 24 2022 6:21 AM

Understanding Bone Cancer - Sakshi

మన శరీరానికి ఒక ఆకృతినీ, ఎత్తునీ, బరువునూ నిర్ణయించేది మన ఎముకలే. అంతేకాదు... మన శరీరంలోని కీలకమైన అవయవాలను... అంటే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను వివిధ ఆకారాల్లో ఉండే ఎముకలు రక్షిస్తూ ఉంటాయి.

ఎముకల ఉపరితలం గట్టిగా ఉండి లోపల స్పాంజ్‌లా ఉంటుంది. ఎముక లోపలి గుజ్జును బోన్‌మ్యారో అంటారు. ఎర్రరక్తకణాల ఉత్పత్తి బోన్‌మ్యారో నుంచి జరుగుతుంది. వయసుపైబడే కొద్దీ మరీ ముఖ్యంగా మహిళల్లో ఎముకలు మరింత పలచగా, పెళుసుగా మారి తేలిగ్గా ఫ్రాక్చర్‌ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలా జరగడాన్ని ‘ఆస్టియో పోరోసిస్‌’ అంటారు. మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. చిన్నప్పట్నుంచి శరీరానికి ఎండ తగలనిస్తూ, క్యాల్షియం లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడితే మంచిది.

ఆస్టియోపోరోసిస్‌తో పాటు ఎముకలకు సంబంధించి బోన్‌ టీబీ, బోన్‌ క్యాన్సర్‌ వంటి సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. చాలామందిలో బోన్‌ టీబీ, బోన్‌ క్యాన్సర్‌ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల ఒకదానికి మరొకటిగా పొరబడటమూ జరుగుతుంది. ఎముకల మీద గడ్డ వచ్చే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అది క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డ అయినా, కాకపోయినా ఎముక మీద గడ్డ ఏర్పడితే ఫ్రాక్చర్స్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ.

క్యాన్సర్‌ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండటం, జ్వరం, రాత్రి చెమటలు పోయడం, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముకలు విరగడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. గడ్డ తొలిదశలో చాలా చిన్నగా కనిపించడం వల్ల ఎక్స్‌రే పరీక్షతో నిర్ధారణ సరిగా జరగకపోవచ్చు. అందుకనే లక్షణాలు కనిపించినప్పుడు సమస్యను సరిగా నిర్ధారణ చేయడానికి సీటీ, ఎమ్మారై స్కాన్‌ వంటి పరీక్షలు చేస్తారు. క్యాన్సర్‌ కాని గడ్డ అయితే గుండ్రంగా, మెల్లగా పెరుగుతుంది. క్యాన్సర్‌ కణితి అయితే ఖచ్చితమైన ఆకారం లేకుండా వేగంగా పెరుగుతుంది. కణితి కొంచెం పెద్దగా ఉంటే ఎక్స్‌రేలోనూ, చిన్నగా ఉంటే ఎమ్మారై, సీటీ స్కాన్‌లలో బయటపడుతుంది. గడ్డ ఏరకమైనదో నిర్ధారణ చేయడానికి బయాప్సీ చేస్తారు.

బోన్‌ క్యాన్సర్‌ గడ్డలలో ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్‌ సార్కోమా, కాండ్రో సార్కోమా, ఫైబ్రో సార్కోమా, కార్డోమా అనే రకాలుంటాయి. వయసు మీద ఆధారపడి ఈ గడ్డలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్‌ సార్కోమా చిన్నవయసువారిలో ఎక్కువగా కనిపిస్తే, కాండ్రో సార్కోమా మధ్యవయసు వారిలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది.

బోన్‌క్యాన్సర్స్‌ చాలావరకు సెకండరీగానే ఉంటాయి. శరీరంలో మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్‌... ఎముకలకు వ్యాప్తి చెందడం (మెటాస్టాసిస్‌) ఎక్కువగా చూస్తుంటాం. ఎముకలోనే క్యాన్సర్‌ ముందుగా రావడం కొంతవరకు అరుదుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి లంగ్, ప్రోస్టేట్‌... ఇలా మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్‌ ఎముక మీద గడ్డలాగా ముందుగా బయటపడవచ్చు.

అన్ని క్యాన్సర్‌లలో లాగానే సర్జరీ, రేడియో, కీమో థెరపీల ప్రాధాన్యత ఎముక క్యాన్సర్‌లలోనూ ఉంటుంది. క్యాన్సర్‌ గడ్డ వచ్చిన ప్రదేశాన్ని తీసివేసినప్పుడు, చిన్నగా ఉంటే సిమెంటింగ్, గ్రాఫ్టింగ్‌ వంటి పద్ధతులతో సరిచేస్తారు. ఎముక తీయవలసిన ప్రదేశం ఎక్కువగా ఉంటే బోన్‌ బ్యాంక్‌ నుంచి ఎముకను సేకరించి, వాడటం లేదా మెటల్‌ ఇంప్లాంట్స్‌ వాడటం జరుగుతుంది. క్యాన్సర్‌ కణితి పెద్దగా ఉంటే సర్జరీ కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితిని చిన్నగా చేసి, తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్‌ సర్జరీ తర్వాత కొత్తగా పెట్టిన ఇంప్లాంట్స్‌కు అలవాటు పడటానికి ఫిజియోథెరపీ, రీహేబిలిటేషన్‌ వంటి ప్రక్రియల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

ఎముకల క్యాన్సర్‌ రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే సెకండరీ బోన్‌ క్యాన్సర్స్‌ ఎక్కువ కాబట్టి మిగతా క్యాన్సర్లను ముందుగా గుర్తించి, చికిత్స తీసుకోగలిగితే ఈ క్యాన్సర్‌ను నివారించినట్లవుతుంది. క్యాన్సర్‌ వచ్చిన ఎముకలను గట్టిపరచడానికి బిస్‌పాస్ఫోనేట్స్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది.

ప్రోస్టేట్‌ క్యాన్సర్, బ్రెస్ట్‌ క్యాన్సర్, లంగ్‌ క్యాన్సర్లకు మిగతా క్యాన్సర్ల కంటే ఎక్కువగా ఎముకలకు పాకే గుణం ఉంటుంది. బోన్‌ క్యాన్సర్‌కు గురైనప్పుడు శరీరంలో క్యాల్షియం లెవెల్స్‌ కూడా పెరగవచ్చు. క్యాన్సర్‌ కణితి వల్ల నరాల మీద ఒత్తిడి ఏర్పడటం వల్ల కాళ్లలో లేదా చేతులలో బలహీనత, తిమ్మిర్లు, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తాయి.
శరీరంలో ఎక్కడైనా మార్పు కనిపించినా, లక్షణాల్లో మార్పులు కనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకుని క్యాన్సర్‌ కణాన్ని తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, డాక్టర్‌ నిర్దేశించిన కాల వ్యవధి ప్రకారం సర్జరీ తర్వాత లేదా సర్జరీకి ముందు లేదా సర్జరీ లేకుండానే అవసరమైన కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవాలి. అంతేకాదు...  శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్‌ వస్తే పక్కనుండే ఎముకలకు పాకే అవకాశం ఉన్నందున, వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా ఐదేళ్ల వరకు చెకప్స్‌ చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి.

డా. సి.హెచ్. మోహన వంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
Ph: 98480 11421

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement