పరమాత్మ తత్వాన్ని గ్రహించటానికి పరమాత్మ ఙ్ఞానం అవసరం. ఙ్ఞాన సముపార్జనకు మానసిక ఏకాగ్రత ముఖ్యం. మానసిక ఏకాగ్రతకు ధ్యానం ప్రధానం. ధ్యానానికి విద్య మూలం. విద్య అంతర్ముఖ, బహిర్ముఖ ఉద్ధీపన కలుగచేస్తుంది. సక కళలకు, విద్యకు అధిదేవత శ్రీసరస్వతీదేవి. సరస్వతీ కటాక్షం లేకుండా ఎటువంటి ఙ్ఞానసముపార్జన జరుగదు. ఙ్ఞానసముపార్జన లేని జీవితం వ్యర్థమౌతుంది. సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. ఆమె వీణ ధరించి, పుస్తకం చేబూని, హంసవాహనంపై ధవళ వస్త్రాలంకరణలో, నిర్మలంగా, ప్రశాంతంగా దర్శనమిస్తుంది. ‘హంస’ను పరబ్రహ్మంగా కీర్తిస్తారు. పదకవితా పితామహుడైన అన్నమాచార్యుడు శ్రీవేంకటేశ్వరుని హంసగా అభివర్ణిస్తాడు. ‘‘దిబ్బలు వెట్టుచు దేలినదిదివో ఉబ్బునీటిపై నొక హంసా...’’ ‘‘పాలు నీరు నేర్పరచి పాలలో నోలాడె నిదె వొకహంసా...’’అంటూ సంకీర్తన ఆలపించాడు. హంసకు పాల నుండి నీటిని వేరుపరచే అద్భుతమైన శక్తివుంది. అంటే మంచిని గ్రహించి, చెడును విస్మరించటం అని దీని అర్థం.
‘సరస్వతి’ అనే పదం ‘తనను తాను తెలుసుకునే శక్తి’ అని కూడా చెప్పవచ్చును. ఈ శక్తి ఙ్ఞానులకు మాత్రమే సాధ్యం. అటువంటి ఙ్ఞానానికి, సర్వ కళలకు అధిదేవతైన శ్రీసరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమినాడు జన్మించినట్లుగా చెబుతారు. మాఘమాసం శిశిరఋతువులో వచ్చినప్పటికి, వసంతఋతువుకు స్వాగత సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజును శ్రీపంచమిగాను, మదనపంచమిగాను, వసంతపంచమిగాను కూడా జరుపుకుంటారు. సరస్వతీదేవిని బ్రహ్మే తనకు తోడుగా ఉండటానికి సృజించాడని విష్ణుపురాణంలోను, దుర్గామాత సృజించిందని దేవీభాగవతంలోను కనబడుతుంది. ఏది ఏమైనా సరస్వతిదేవి చదువుకు, ఙ్ఞానానికి అధిష్టానదేవత. అందువలన ఆ దేవి సకల చరాచర బ్రహ్మాండంలో పూజలందుకుంటోంది.
వసంతపంచమి రోజున వయోభేదం లేకుండా అందరూ సరస్వతీ పూజలు చేస్తారు. ముఖ్యంగా పిల్లలచేత పూజలు నిర్వహిస్తారు. దీనివలన వారికి మంచి విద్యాబుద్ధులు అలవడతాయని నమ్మిక. ఉదయాన్నే కాలకత్యాలునెరవేర్చుకుని, అభ్యంగన స్నాన మాచరించి, మంచి దుస్తులు ధరించాలి. ఇంటిని మామిడి ఆకులతో, పుష్పాలతో అలంకరించాలి. పూజాగృహాన్ని కూడా శోభస్కరంగా అలంకరించాలి. సరస్వతీదేవిని ఉచితాసనంపై ప్రతిష్టించి, సుగంధ ద్రవ్యంతో అభిషేకించి, చక్కని వస్త్రాలంకృతిని చేసి, తాజా పుష్పాలతోను, మంచి గంధంతోను, ధూప దీపాలతోనూ షోడశోపచారాలతో పూజ నిర్వహించాలి. పూజలో పిల్లల పుస్తకాలు, కలం మొదలగువాటిని ఉంచి పూజచేయాలి. తరువాత ఆమెకు ప్రీతిపాత్రమైన మధుర పదార్థాలను నివేదన చేసి, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించాలి. సకల విద్యలు అలవడటానికి భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేయాలి. ఇదేరోజున పిల్లల చేత అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. తోటి పిల్లలకు పలకలు, పెన్సిళ్ళు పంచిపెడతారు. ఈ విధివిధానం వలన సరస్వతీదేవి కరుణించి చల్లని చూపులతో అనుగ్రహిస్తుంది. మనదేశంలో అనేక ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రాలున్నాయి.
అదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఙ్ఞానసరస్వతీ ఆలయం, కాశ్మీరులోని శారదాదేవి ఆలయం, నల్గొండ జిల్లాలోని అడ్లూరి గ్రామంలోని సరస్వతీ ఆలయం, కర్ణాటకలోని శృంగేరిలో శ్రీ శంకరాచార్య ప్రతిష్టిత శారదా దేవీ ఆలయం మొదలైనవి ప్రధానమైనవి గా పేర్కొన వచ్చును. అశేష భక్తజనం ఈ ఆలయాలు దర్శించి, తమ తమ కోర్కెలు ఈడేర్చుకొంటున్నారు. ఈ రోజును మదన పంచమిగా రతీమన్మధులను పూజిస్తారు. దీనివలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయని నమ్మిక. దేవీనవరాత్రులలో దుర్గామాత సరస్వతీ అలంకారంలో దర్శనమిస్తుంది. సరస్వతీదేవికి శారదాదేవి, హంసవాహిని, బుద్ధిధాత్రి, వరదాయని, కౌమారి మొదలగు పేర్లున్నాయి. సరస్వతీ పురాణంలో దక్షిణామూర్తి, బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు, శ్రీరాముడు, గణపతి, కుమారస్వామి, వాల్మీకి, వ్యాసుడు, ఇంద్రుడు, సూర్యుడు, శంకరాచార్యుడు మొదలైనవారు స్తుతించిన స్తోత్రాలు కనబడతాయి. సరస్వతీదేవి కరుణతో విశేష ఙ్ఞానం, వాక్శుద్ధి, మంత్రసిద్ధి, ఙ్ఞానసిద్ధి, ధారణాసిద్ధి, మేధాసిద్ధి కలిగి సర్వత్రా జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేద్దాం.
– డా.దేవులపల్లి పద్మజ
Comments
Please login to add a commentAdd a comment