అమెరికా గత వైభవానికి దారెటు? | Ana Palacio Article On Presidential Results On America | Sakshi
Sakshi News home page

అమెరికా గత వైభవానికి దారెటు?

Published Fri, Nov 27 2020 12:42 AM | Last Updated on Fri, Nov 27 2020 12:46 AM

Ana Palacio Article On Presidential Results On America - Sakshi

భవిష్యత్తును ముందుగా దర్శించగలిగే దేశంగా దశాబ్దాలుగా ప్రపంచానికి నాయకత్వం వహించిన అమెరికా ఇప్పుడు తన కళ్లు తానే మూసుకున్న దేశంగా కనబడుతోంది. జోబైడెన్‌ అధ్యక్ష స్థానంలోకి రావడం అంటే గతంలో అమెరికా నాయకత్వం ప్రదర్శించిన ఆ గొప్ప దార్శనికత వైపు తిరిగి వెళుతున్నదని అర్థమా? పలు అంతర్జాతీయ సంస్థల్లో అమెరికా పాత్రను తిరిగి నొక్కి చెప్పడానికి బైడెన్‌ యంత్రాంగం సమాయత్తమవుతోంది. పారిస్‌ పర్యావరణ ఒప్పందంలో,  ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరతామని జో బైడెన్‌ ప్రతిన చేశారు. అయితే అంతర్గతంగా ఏర్పడిన విభజనలను, వేర్పాటుతత్వాన్ని నయం చేసుకోలేనట్లయితే, ప్రపంచ దేశాలను కూడగట్టి ఒక తాటికి తీసుకురాగలిగే అమెరికన్‌ శక్తియుక్తులు దీర్ఘకాలంలో క్షీణించిపోవడం ఖాయమనే చెప్పాలి.

నాటి అమెరికా విదేశాంగ మంత్రి మాడలైన్‌ అల్‌బ్రైట్‌ 1998లో అమెరికా సంయుక్తరాష్ట్రాల గురించి గొప్పగా నిర్వచిస్తూ, అత్యంత ఆవశ్యకమైన, వదిలివేయలేని దేశంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. ‘మనం చాలా ఉన్నతంగా నిలబడ్డాం. కాబట్టే భవిష్యత్తు కేసి ఏ ఇతర దేశాల కంటే ముందుచూపును ప్రదర్శించగలం’ అన్నారు. సరిగ్గా ఆమె ఈ ప్రసిద్ధ వ్యాఖ్య చేసి రెండు దశాబ్దాలు గడచిన తర్వాత కూడా అమెరికా ఇప్పటికీ వదిలిపెట్టలేని దేశంగానే ఉంటోంది. అయితే భవిష్యత్తును ముందుగా దర్శించగలగడం కాకుండా, తన కళ్లు మూసుకున్న దేశంగా అమెరికా ఇప్పుడు ప్రపంచానికి కనబడుతోంది. ఈ నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపు సాధించిన నేపథ్యంలో అమెరికా తలుపులు తిరిగి తెరుచుకున్నట్లే భావించవచ్చా?

ఉదారవాద అంతర్జాతీయ వ్యవస్థకు అమెరికా చాలాకాలంగా మూలస్తంభంగా నిలిచింది. 1941లో అట్లాంటిక్‌ చార్టర్‌ నిర్వచించిన విశ్వజనీన సూత్రాల ప్రాతిపదిక నుండే ఈ కొత్త అంతర్జాతీయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. జోబైడెన్‌ అధ్యక్ష స్థానంలోకి రావడం అంటే గతంలో అమెరికా నాయకత్వం ప్రదర్శించిన ఆ గొప్ప దార్శనికత వైపు అమెరికా వెళుతున్నదని అర్థమా? అవును, నిజంగానే జోబైడెన్‌ సాధిం చినది అత్యంత నిర్ణయాత్మకమైన విజయం. ఈ ఎన్నికల్లో దాదాపు 8 కోట్ల ఓట్లు గెలుచుకున్న బైడెన్‌ అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికీ సాధ్యం కాని చరిత్రను తన పేరిట లిఖించుకున్నారు. 2016లో డొనాల్డ్‌ ట్రంప్‌ సాధించినన్ని ఎలక్టోరల్‌ కాలేజి ఓట్లనే జో బైడెన్‌ కూడా గెలుచుకున్నారు. అయితే పాపులర్‌ ఓటులో హిల్లరీ క్లింటన్‌ చేతిలో ట్రంప్‌ ఓడిపోయినా, ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్ల ఆధిక్యతతోనే ట్రంప్‌ తన విజ యాన్ని చరిత్రాత్మక విజయమని అతి ఘనంగా చాటుకున్నారు.

ట్రంపిజానికి సంపూర్ణ పరాజయం కాదు
ఏరకంగా చూసినా ట్రంప్‌ ఈ ఏడాది ఎన్నికల్లో ఏడు కోట్ల 30 లక్షల ఓట్లను సాధించారు. 2016లో కంటే కోటి ఓట్లు ఎక్కువగా ట్రంప్‌ సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థి సాధించిన రెండవ అత్యధిక ఓట్లు ట్రంప్‌ ఖాతాలో చేరాయి. ఇవి ట్రంప్‌ను, ట్రంపిజాన్ని సంపూర్ణంగా తిరస్కరించిన ఎన్నికలు కావు. పైగా అధ్యక్షుడిగా ట్రంప్‌ గడిపిన కాలాన్ని దాటి ట్రంప్‌ ప్రభావం ఇంకా ముందుకు విస్తరించనుందని ఈ ఎన్నిక ప్రదర్శించింది. పైగా న్యాయస్థానాల్లో, ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేసే విషయంలో కూడా ట్రంప్‌ ఈ ఎన్నికల ఫలితాలను ఇప్పటికీ సవాలు చేస్తూనే ఉన్నారు.

కచ్చితంగా చెప్పాలంటే, సమీప భవిష్యత్తులో ట్రంప్‌ వారసత్వం అంతర్జాతీయ స్థాయిలో కూడా పూర్తిగా పతనం కాదు. అదే సమయంలో పలు అంతర్జాతీయ సంస్థల్లో అమెరికా పాత్రను తిరిగి నొక్కి చెప్పడానికి బైడెన్‌ పాలనాయంత్రాంగం తనకు తానుగా సమాయత్తమవుతోంది. ఇప్పటికే అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ పారిస్‌ పర్యావరణ ఒప్పందంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థలో తిరిగి చేరతామని ప్రతిన చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ ఉత్తరాధికార సంస్థ నియామకాలను తాము అడ్డుకోబోమని కూడా జో చెప్పారు. సభ్యుల మధ్య వివాదాలను పరిష్కరించే ఈ అప్పిలేట్‌ విభాగాన్ని అడ్డుకోకపోవడం అంటే అది జోబైడెన్‌ యంత్రాంగం ప్రదర్శిస్తున్న అత్యంత ఆచరణాత్మకమైన, ప్రతీకాత్మకమైన ప్రాధాన్యతాంశంగానే చెప్పాల్సి ఉంటుంది.

బహుముఖీన వ్యవస్థ వైపు బైడెన్‌ చేపట్టనున్న ఈ చర్యలు ఎంతో ప్రాధాన్యత కలిగినవే కావచ్చు కానీ, అంతర్జాతీయ నాయకత్వ పాత్రను పునరుద్ధరించుకునే దిశగా అమెరికా వేగంగా పావులు కదుపుతుందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇప్పటికీ తిరుగులేని ప్రపంచ సైనిక శక్తిగా, ఆర్థిక శక్తిగా, ప్రముఖ సాంస్కృతిక శక్తిగా ఉంటున్నప్పటికీ, దాని ఆధిపత్యం పూర్వ స్థాయిలో మాత్రం లేదు. అంతర్జాతీయ సంబంధాల దిశాదిశలను అమెరికా ఇంకెంతమాత్రం నిర్దేశించలేదు.

భాగస్వామ్య సవాళ్లను పరిష్కరించడం ఎలా?
ప్రపంచానికి ఉమ్మడిగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో వైవిధ్యపూరితమైన అంతర్జాతీయ పాత్రధారులను అమెరికా ఇప్పటికీ కూడగట్టుకోగలిగే స్థాయిలో ఉంటోంది. అమెరికాలో ఏకపక్ష విధానాలను కాకుండా, బహుపాక్షిక విధానాలను పునరుద్ధరించడానికి బైడెన్‌ ముందస్తుగానే హృదయపూర్వకంగా చర్యలు చేపడుతుండటం కాదనలేని వాస్తవమే. అయితే అమెరికా అంతర్గతంగా ఏర్పడిన విభజనలను, వేర్పాటుతత్వాన్ని నయం చేసుకోలేనట్లయితే, ప్రపంచ దేశాలను కూడగట్టి ఒక తాటికి తీసుకురాగలిగే అమెరికన్‌ శక్తియుక్తులు దీర్ఘకాలంలో క్షీణించిపోవడం ఖాయమనే చెప్పాలి.
 
ఆధిపత్యంతో చలాయించే అధికారం కంటే చర్చలద్వారా పరి ష్కారం కనుగొనగలగడం అనే సానుకూల శక్తి అత్యంత సూక్ష్మమైనది. సామర్థ్యత, ప్రభావం ద్వారా మాత్రమే కాదు.. నైతిక ఆధిక్యత అనేదే చాలామంది భాగస్వాములను ఆకర్షించి చట్టబద్ధంగానే ఉమ్మడి చర్యలను ప్రేరేపించగలదు. చాలామందిని సమావేశపర్చగల శక్తి కేవలం డిమాండ్లను ముందుంచడం కాకుండా ఉదారవాదానికి, బహుముఖీన పాత్రలను అంగీకరించడానికి ఒక గట్టి నమూనాగా ఉండగలదు.

ప్రపంచం ప్రస్తుతం ఆశిస్తున్న ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ వ్యవస్థ చుట్టూ అల్లుకున్న సాధికార ధ్రువం బలహీనపడుతున్నట్లయితే, (కోవిడ్‌–19 మహమ్మారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమన్వయంతో కూడిన స్పందన కరువైన నేపథ్యం ఇందుకో ఉదాహరణ) ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచం పయనిస్తున్న ప్రమాదకరమైన దిశ కొనసాగుతూనే ఉంటుంది. ఇకపోతే సహకార భావనకు ఉదాహరణగా ఇప్పుడు సైతం నిలుస్తున్న దౌత్య చర్చల ప్రాధాన్యత కూడా క్రమక్రమంగా అడుగంటిపోవడం ఖాయం.

కొందరే ఎందుకు ప్రపంచాన్ని నడిపించలేరు అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా సులభం. ఎందుకంటే ప్రపంచగతిని కొందరు వ్యక్తులు లేక నాయకులు మాత్రమే నిర్దేశించలేరు. ప్రస్తుత నేపథ్యంలో అమెరికా స్థానాన్ని తీసుకోవడానికి ఏకైక నాయకుడు కానీ, కొందరు నాయకుల సమూహం కానీ సిద్ధంగా ఉన్న వాతావరణం కనిపించడం లేదు. ఉదాహరణకు యూరోపియన్‌ యూనియన్‌ను తీసుకోండి. ఉదారవాద విలువలకు ఇదొక ప్రామాణిక శక్తిగా చాలాకాలంగా ప్రపంచస్థాయిలో తన ఉనికిని చాటుకుంది. ఉత్తేజభరితమైన, వైవిధ్యభరితమైన సంస్కృతులకు, వేగంగా పురోగమిస్తున్న పౌర సమాజాలకు, మానవ హక్కులను, న్యాయపాలనను ఎత్తిపడుతున్న మెరుగైన సంస్థాగత వ్యవస్థలకు, బహుముఖీన సంస్కృతి పట్ల నిబద్ధతకు యూరోపియన్‌ యూనియన్‌ మారుపేరుగా కొనసాగుతూ వస్తోంది. 

ప్రపంచ నాయకత్వానికి ప్రాణాధారం ఏది?
అయినప్పటికీ ప్రపంచ నాయకత్వానికి ప్రాణాధారమైన అనేక అంశాల్లో యూరోపియన్‌ యూనియన్‌ చాలావరకు తడబడుతోంది. సంకోచిస్తోంది. రాజకీయ సంకల్పబలం లేమి కారణంగా యూరప్‌ ఖండం నిరంతరాయంగా వనరులను దుర్వినియోగ పరుస్తూ వస్తోంది. దీని ఫలితంగా ప్రపంచానికి అవసరమైన భాగస్వామ్య సామర్థ్య నిర్మాణం విషయంలో విఫలమవుతోంది. దానికి అవసరమైన పరిస్థితుల సృజనలో కూడా యూరప్‌ వెనుకబడిపోతోంది. ఉదాహరణకు, యూరప్‌కు ఒక వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అత్యంత అవసరమని ఈయూ నాయకులు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతూనే ఉంటారు. కానీ అదెలా సాధ్యం అనే విషయంలో ఏ ఇద్దరు నేతలకూ సమ్మతి ఉండదు. 

మరింత ప్రాథమికంగా చూస్తే ప్రపంచానికి ఒక విశ్వసనీయమైన, నిబద్ధమైన ఉదాహరణగా వ్యవహరించదగిన స్వీయ భరోసా, పూచీ అనేవి యూరోపియన్‌ యూనియన్‌లో లేవు. దీన్ని మార్చాలంటే నిబద్ధ జీవనం అంటే ఏమిటని ఈయూ మొదటగా నిర్వచించుకోవాలి. ఈ నిర్వచనం ద్వారా మాత్రమే తన సొంత పునరుద్ధరణ నమూనాకు ప్రాతిపదిక ఏర్పడగలదు. తర్వాత సమయం, ప్రయత్నం, డబ్బు అనే అతి ముఖ్యమైన వనరుల సమీకరణకు ఈయూ అంకిత భావంతో పనిచేయాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావం చూపగలిగే సామర్థ్య నిర్మాణానికి ఇవి ఎంతగానో అవసరమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే యూరోపియన్‌ యూనియన్‌ తన నడకను ఈ మార్గంలోనే నడిచి తీరాల్సి ఉంది.

యూరోపియన్‌ యూనియన్‌ ఈ పని చేయనంతకాలం అమెరికా ప్రపంచానికి అత్యంత ఆవశ్యకమైన దేశంగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే అమెరికా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అందుకనే ప్రపంచాన్ని కూడగట్టగల శక్తిగా అమెరిగా ప్రభావితం చేయాలంటే బైడెన్‌ యంత్రాంగం బహుముఖీన వ్యవస్థ నిర్మాణం అనే ఈ లక్ష్యంమీదనే పని చేయాల్సి ఉంటుంది. అమెరికా గాయాలను మాన్పడానికి కూడా ఇదే మార్గం. ఒక్కమాటలో చెప్పాలంటే హేతుపూర్వకమైన ఐక్య అమెరికా మాత్రమే ఉన్నతంగా నిలబడుతుంది, దూరదృష్టితో ముందడుగు వేస్తుంది, ఉదారవాద అంతర్జాతీయ వ్యవస్థ గుండె చప్పుడుగా వ్యవహరించగలుగుతుంది. (గల్ఫ్‌ న్యూస్‌ సౌజన్యంతో...)       
వ్యాసకర్త: అనా పలాసియో, స్పెయిన్‌ మాజీ విదేశాంగ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement