కమలా హారిస్ ‘అబద్ధం’పై మస్క్‌ సెటైర్‌ | Elon Musk Slams Kamala Harris Over Trump Lie | Sakshi
Sakshi News home page

ఎప్పటికి గుర్తిస్తారో?.. కమలా హారిస్ ‘అబద్ధం’పై మస్క్‌ సెటైర్‌

Published Tue, Jul 2 2024 10:30 AM | Last Updated on Tue, Jul 2 2024 10:59 AM

Elon Musk Slams Kamala Harris Over Trump Lie

అమెరికా ఉపాధ్యక్షురాలు, భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్‌పై ప్రపంచ టాప్‌ బిలీయనీర్‌ ఎలన్‌ మస్క్‌ ఎక్స్‌ వేదికగా విరుచుకుపడ్డారు. ట్రంప్‌ గనుక అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా అబార్షన్‌లపై నిషేధం విధిస్తారంటూ ఆమె ట్వీట్‌ చేశారు. అయితే అది అబద్ధం కావడం.. ఎక్స్‌ సైతం కమ్యూనిటీ నోట్‌ ఇవ్వడంతో మస్క్‌ సెటైర్‌ సంధించారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గర్భవిచ్ఛిత్తి(అబార్షన్‌) కీలకాంశంగా మారింది. బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రాట్లు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. అయితే అధ్యక్ష బరిలో రిపబ్లికన్‌ పార్టీ తరఫు అభ్యర్థి ట్రంప్‌ గనుక గెలిస్తే.. అమెరికా వ్యాప్తంగా అబార్షన్‌ రద్దు చేస్తారు అని  సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా హారిస్‌ పోస్ట్‌ చేశారు. 

 

అయితే ఆమె పోస్టుకి వెంటనే ఎక్స్‌ ‘కమ్యూనిటీ నోట్‌’ ఇచ్చింది(ఫ్యాక్ట్‌ చెక్‌ టైప్‌ ఫీచర్‌). అబార్షన్ చట్టంపై తాను సంతకం చేయబోనని ట్రంప్ పదే పదే చెప్పారు అని ఆ నోట్‌ పేర్కొంది.  దీంతో వెంటనే ఎక్స్‌ ఓనర్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. రాజకీయ నాయకులైతేనేం.. వాళ్ల సోషల్‌ మీడియా అకౌంట్లను నడిపేవాళ్లు అయితేనేం.. ఇలాంటి మాధ్యమాల్లో అబద్ధాలు ఇక మీదట పని చేయవని ఎప్పటికి గుర్తిస్తారో అంటూ పోస్ట్‌ చేశాడు. అంతేకాదు.. కమ్యూనిటీ నోట్‌ వచ్చిన హారిస్‌ పోస్టును స్క్రీన్‌ షాట్‌ ఉంచారాయన. అక్కడితో ఆగకుండా ఆమె పోస్టుకు సైతం ఆయన కామెంట్‌ చేశాడు.

 

ఇదిలా ఉంటే.. అబార్షన్‌ను నిషేధించే ఉద్దేశం తనకు లేదంటూ గత వారం అట్లాంటాలో బైడెన్‌తో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల బిగ్‌ డిబేట్‌లోనూ ట్రంప్‌ స్పష్టం చేశారు. మరోవైపు ఎక్స్‌ కమ్యూనిటీ ఫీచర్‌ను గత కొంతకాలంగా మస్క్‌ పొడుగుతూ వస్తుండడం చూస్తున్నాం. కమ్యూనిటీ నోట్‌ ఫీచర్‌ అనేది.. పరోక్షంగా ఇది తప్పుదోవ పట్టించే పోస్ట్‌ కావొచ్చని.. నిజనిర్ధారణ చేసుకోవాలని యూజర్‌కు సూచిస్తుంది. అలాగే.. యూజర్లు ఆ పోస్టులో ఆ నోట్‌ ద్వారా అభిప్రాయాలు వ్యక్తంచేసి తప్పేంటో చెప్పే అవకాశమూ ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement