నేడు కాకినాడలో రాంషా (1924 – 1990) శత జయంతి సభ, 5 రచనా సంపుటాల ఆవిష్కరణ
రాంషా! ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ‘అభిసారిక’ పత్రిక. దాని ప్రచురణకర్తగా, సంపాద కునిగా, పాఠకుల సెక్సు సమస్య లకు, సందేహాలకు ఆత్మీయ పరిష్కారాలు, సలహాలు సూచించే ఒక పెద్ద దిక్కు జ్ఞప్తికొ స్తుంది. అంతే కాదు ఆయన ఒక కమ్యూనిస్ట్, అభ్యుదయ కవి, నాటకకర్త, సాహితీ విమర్శకుడు; కథా, నవలా రచయిత, ముద్రాపకుడు! ఇవన్నీ కలగలసిన విశేష వ్యక్తిత్వమే రాంషా!
‘రాంషా’ అసలు పేరు దర్భా వేంకటరామశాస్త్రి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో 1924 జూలై 30న జన్మించారు. కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజీలో ఎఫ్.ఎ. (నేటి ఇంట ర్మీడియెట్) చదివే రోజుల్లోనే తొలిరచన ‘శిలా ప్రతిమ’ నాటికతో పేరు తెచ్చుకుని, 1948లో చోడవరం అఖిలాంధ్ర కవి పండిత పరిషత్తు నుంచి తొలి సన్మానం పొందారు. వేంకట రామశాస్త్రికి ‘రాంషా’ అనే లేఖినీ నామం ప్రదానం చేసింది ఆ కళాశాల అధ్యాపకులైన సాహితీ మూర్తి ‘కళాప్రపూర్ణ’ నిడదవోలు వెంకటరావు!
తుర్గినేవ్ రాసిన చిన్నకథను ఆధారం చేసుకుని అల్లిన నవల – ‘కామేశ్వరి కథ’ 1948లో ప్రచురింపబడి ఎన్నో ప్రశంసల నందుకున్నది. లక్ష కాపీల వరకు ముద్రితమయింది. చరిత్రహీనుల, బాధోపహతుల జీవి తాల్ని చిత్రించిన రాంషా కథలెన్నో వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘గాంధీజీ పెట్టిన భిక్ష’, ‘ఎర్రజెండా’, ‘మత్తానయ్య మరణం’, ‘ఆడవాళ్ళ సంత’, ‘కిర్రు చెప్పులు’, ‘కారుణ్యం’ వంటి కథలు రాంషా మార్కు కథాకథన శిల్పానికి, వస్తు వైవిధ్యానికి, శైలీ విన్యాసానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. ‘లక్షింపతిగా రమ్మాయిలు’ అనే నాటకం కన్యాశుల్కం తరువాత చెప్పు కోదగ్గ నాటకంగా నాటి సమీక్షకులు పేర్కొన్నారు. కథా రచనా లక్షణాన్ని నిర్దేశిస్తూ, ‘కళలు–కథలు’ అనే విమర్శ వ్యాసాలు; అలాగే, నవల, నాటకం, కావ్యం, విమర్శవంటి సాహిత్య ప్రక్రియల మీద కూడా ప్రామాణిక వ్యాసాలు రచించారు. ‘కుళ్ళుసరుకు’ అనే ప్రబోదాత్మక సాంఘిక నాటకంలో ఒక ముఖ్య భూమికలో నటించి, నటుడిగా మరొక కోణాన్ని కూడా ఆవిష్కరించుకున్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పరిస్థితులకు రాంషా కలం జుళిపించారు. సోమసుందర్, శశాంకవంటి కవి మిత్రులతో చేయిచేయి కలిపి, కమ్యూనిస్ట్ కార్యకర్తగా శంఖం పూరించారు (1944 –1955). ప్రజా చైతన్యం ప్రజ్వలింపజేయడానికి ‘కళాకేళి – ధర్మసంగ్రామకేళి’ నినాదంతో ‘కళా కేళి ప్రచురణలు’ నెలకొల్పారు. సామ్యవాద ఉద్యమ ప్రతిధ్వనులైన ఆరుద్ర ‘త్వమేవాహం’, సోమసుందర్ ‘వజ్రాయుధం’ వంటి అగ్రశ్రేణి అభ్యుదయ కావ్యాలకి రాంషా సముచిత ప్రకాశి కలు రాసి ప్రచురించి, వాటికి అద్వితీయ ప్రాచుర్యం కల్పించారు. మరెన్నో గ్రంథాలను ప్రచురించారు.
ఉద్యమ కాలంలో ప్రభుత్వం ‘వజ్రాయుధం’ కావ్యాన్ని నిషేధించి, పుస్తకాల్ని జప్తుచేసి, ప్రచురణకర్త రాంషా మీద, ముద్రాపకుల మీద కేసులు పెట్టింది. తీవ్ర నిర్బంధ విధానంలో అభ్యుదయవాదులైన సాహిత్య కారులు, కళాకారులు చెల్లాచెదరయ్యారు. ఆ పరిస్థితుల్లో రాంషా కూడా నిలదొక్కుకోడానికి అనేక కష్టనష్టాల నెదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఆప్తమిత్రుడు ధనికొండ హనుమంతరావు కొంతకాలం నడిపి ఆపి వేసిన తన ‘అభిసారిక’ పత్రికను రాంషాకి అందించారు. ఆవిధంగా అభిసారిక పత్రికను స్వీకరించి మరో కొత్త జీవిత అధ్యాయానికి తెర తీశారు రాంషా (1960).
రాంషా నేతృత్వంలో ‘అభిసారిక’ లైంగిక విజ్ఞాన మాస పత్రిక అచిరకాలంలోనే అసంఖ్యాక పాఠకుల మన్న నలు పొంది, బహుళ ప్రచారంలోకి వచ్చింది. మూఢ విశ్వాసాలు, ఛాందస భావాలతో, అజ్ఞానంలో, అంధకారంలో అల్లాడుతున్న అనేకమంది తెలుగు పాఠకులకు అది వేగుచుక్కగా రూపొందింది. అభిసారిక పత్రిక ద్వారా శాస్త్రీయంగా ‘సెక్సు విజ్ఞానాన్ని’ పాఠకుల కందజేస్తూ, ఆత్మవిశ్వాసం కోల్పోయి, అనేక మానసిక రుగ్మతలకు లోనై, అశాంతితో, అపోహలతో, సమస్య లతో, సంతాపాలతో సతమతమవుతున్న అసంఖ్యాక వ్యక్తులకు ఆశనీ, ఆత్మస్థైర్యాన్నీ కల్పించి, ఓదార్పునీ, నైతిక బలాన్నీ, నవజీవనాన్నీ ప్రోదిచేసి, వారిని తీర్చిదిద్దే మహోద్యమంలో రాంషా విజయం సాధించారు.
ఆ కృషిలో భాగంగా 1960 నుంచి 1990 వరకు 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఉత్తమ సెక్సు విజ్ఞాన గ్రంథాలు రచించారు. అభిసారికలో ‘అడగండి చెపు తాను’ శీర్షిక ద్వారా వేనవేలమంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు సూచించారు. ‘మీట్ ది ఎడిటర్’ కార్య క్రమం ద్వారా ఆంధ్ర – ఆంధ్రేతర ప్రాంతాలు పర్యటిస్తూ సలహాలు – పరిష్కారాలు అందజేశారు.
‘వాత్సాయన కామసూత్రాలు’, ‘కొక్కోకమ్’, ‘సెక్సు సైకాలజీ’ వంటి 40కి పైగా కామ పురుషార్థ గ్రంథాలు రాశారు. అలాగే మిగతా పురుషార్థాలైన ధర్మార్థమోక్షాల అమృత సారాన్ని కూడా గౌతమ, వశిష్ఠ ధర్మసూత్రాలూ ‘జ్ఞాన వాశిష్ఠం’, ‘న్యాయ దర్శనం’, ‘సాంఖ్యమ్’, ‘వైశే షికమ్’, ‘యోగశాస్త్రం’, ‘మోక్షశాస్త్రం’, ‘కౌటిలీయ అర్థ శాస్త్రం’ వంటి గ్రంథాల రూపంలో తెలుగు వారికి సులభ గ్రాహ్యంగా అందజేశారు. 1990 ఫిబ్రవరి 8న రాజమండ్రిలో ఒక రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా మృతి చెందారు రాంషా. అది అఖిల ‘అభిసారిక’ పాఠకులకు, సాహితీ మిత్రులకు తీరని లోటు మిగిల్చింది.
– పూషా దర్భా, వ్యాసకర్త, మానసిక సెక్స్ సమస్యల నిపుణులు, ‘అభిసారిక’ పూర్వ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment