ఇప్పటికీ అమ్మాయంటే అలుసేనా? | Deepa Gahlot Observes On Beti Padhao Seems To Be Just An Empty Slogan | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ అమ్మాయంటే అలుసేనా?

Published Wed, Nov 10 2021 12:17 AM | Last Updated on Wed, Nov 10 2021 12:18 AM

Deepa Gahlot Observes On Beti Padhao Seems To Be Just An Empty Slogan - Sakshi

జ్యోతీబా ఫూలే దంపతులు బాలికలకు పాఠశాలల ఏర్పాటుపై 1848లోనే పోరాడారు. కానీ 173 ఏళ్ల తర్వాత కూడా మన దేశంలో 5వ తరగతితోనే వేలాదిగా బాలికలు బడి మానేస్తున్నారు. రాజస్థాన్‌ గ్రామాల్లో పాఠశాల గోడలపై ‘మా కుమారులే మా దేవుళ్లు’ అనే నినాదం రాసి ఉంటోందంటే అక్కడ అబ్బాయిలకు ఉన్న ప్రాథాన్యం అర్థమవుతుంది. పేద కుటుంబంలోని అమ్మాయిని పాఠశాలకు పంపడం ఇప్పటికీ ఒక అద్భుతమే. ఖర్చు భరించలేక పోవడంతోపాటు బాల్యవివాహాలు, ఇంటిపని, పొలాల్లో శ్రమ వంటివి బాలికా విద్యకు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. అక్షరాస్యత అంటే ఆడపిల్లలు తమ పేర్లు మాత్రమే రాయగలగడం అనే అర్థానికి పరిమితమైన చోట ‘ప్రగతి కోసం అమ్మాయిలను చదివించండి’ అనే నినాదం ట్రక్కులు, ఆటో రిక్షాల వెనుకవైపు నినాదాలుగా రాసుకోవడానికే పరిమితమవుతోంది. బడి మానేస్తున్న పుత్రికలు ‘మేము మీకు బరువా’ అంటూ యావత్‌ సమాజాన్ని నిలదీస్తున్న విషయం జాతి మర్చిపోరాదు.

కుటుంబంలోని పిల్లలందరికీ తగిన విద్య అందించకపోయినా, కనీసం అక్షర జ్ఞానంతో కూడిన ప్రాథమిక నైపుణ్యాలు తప్పక పొందాలని నగరాల్లో ఉంటున్న మనం అంగీకరిస్తాం. ఉన్నత విద్యకు అబ్బాయిని పంపాలా లేక అమ్మాయిని పంపాలా అని ఎంచుకోవలసి వచ్చినప్పుడు, ఎవరికి ఆ అవకాశం దొరుకుతుందో కూడా మనం అంచనా వేసుకోవచ్చు. గ్రామాల్లో అలా ఎంచుకునే అవకాశం కూడా ఉండదు. అక్కడి పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని పాఠశాలకు పంపుతున్నారంటే కూడా అది అద్భుతమైన విషయమనే చెప్పాల్సి ఉంది. ప్రతిక్‌ కుమార్‌ తీసిన కొత్త డాక్యుమెంటరీ ‘డ్రాపవుట్‌ డాటర్స్‌’ని వికల్ప్‌ వీక్లీ ప్రోగ్రాంలో భాగంగా ఇటీవలే ప్రదర్శించారు. రాజకీయంగా ‘ఇబ్బంది’ కలిగించే చిత్రాలను ముంబై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ డాక్యుమెంటరీ అండ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ తిరస్కరించడం మొదలైనప్పుడు వికల్ప్‌ సంస్థను 2004లో నెలకొల్పారు. ఈ లఘుచిత్రం రాజస్థాన్‌లోని ఒక గ్రామాన్ని కథాంశంగా తీసుకుంది. మహిళా అక్షరాస్యత దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉంటూ, మహమ్మారి కాలంలో ఈ శాతం దారుణంగా పడిపోయిన రాష్ట్రం రాజస్తాన్‌. ఈ గ్రామంలోని పాఠశాల గోడపై ‘మా కుమారులే మా దేవుళ్లు’ అనే నినాదం రాసి ఉంటుంది. అక్కడ మగపిల్లలకు ఎంత ప్రాధాన్యం ఉంటోందో ఈ నినాదం స్పష్టంగా సూచిస్తుంది.

బాలికలు బడి ఎందుకు మానేస్తున్నట్లు?
చాలా కుటుంబాల్లో పేదరికం, పాఠశాలకు పంపడానికి అయ్యే ఖర్చులను భరించలేకపోవడం కారణంగానే అమ్మాయిలు బడికి దూరమవుతున్నారు. ఇక హైస్కూల్‌ స్థాయిలో బాలికలు బడి మానేయడానికి, బాల్య వివాహాలు, ఇంటిపని, వ్యవసాయ శ్రమ వంటివి ఇతర కారణాలు. రాజస్థాన్‌లో బాల్య వివాహాలు సమాజం ఆమోదం పొందిన ఆచారంగా ఉంటోంది. బాలికలు మొబైల్స్‌ తీసుకెళ్లడానికి అనుమతించనందువల్ల పరీక్షలు ఎప్పుడు పెడుతున్నారు అనే మెసేజ్‌ కూడా వారికి అందకపోవడంతో ఆడపిల్లలు పరీక్షలు కూడా రాయలేకపోతున్నారు అంటే ఏం చెప్పాలి? మొబైల్స్‌ ఇస్తే ఆడపిల్లలు చెడిపోతారు అనే అభిప్రాయం రాజస్థాన్‌ గ్రామాల్లో బలంగా ఉంటోంది. మరొక అమ్మాయి ప్రమాదంలో కాలు విరగడం వల్ల తరగతి గదిలో నేలపై కూర్చోవడం కష్టమై బడి మానేసింది. ఆమెకు ఒక కుర్చీని ఏర్పర్చాలనే విషయం కూడా ఎవరూ పట్టించుకోకపోవడమే దీనికి కారణం.

ఉద్యోగాల లేమి
బాలికలకు ఉపాధి అవకాశాల కొరత ఉండటం వారు పాఠశాలకు దూరం కావడానికి ప్రధాన కారణం. తల్లితండ్రులు, కొన్ని సందర్భాల్లో భర్తలూ... అమ్మాయిలు చదువుకోవడానికి అనుమతిస్తున్నారు కానీ వారిపై తాము పెట్టిన ఖర్చు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. కాని ప్రాథమిక విద్య మాత్రమే పొందిన అమ్మాయిలు వేతనం వచ్చే ఉద్యోగాలను ఎలా పొందగలరు? అదృష్టవశాత్తూ ఏదైనా ఉద్యోగావకాశం లభించినప్పటికీ, అలా పనిచేసే మహిళల భద్రత పెనుసమస్యగా ఉంటోంది. పైగా బాలికలు బడికి పోవడానికి వారికి ఎలాంటి ప్రోత్సహకాలూ ఉండటం లేదు. పెళ్లి చేసుకోవడం, ఇంటిపట్టునే ఉండి పిల్ల లను చూసుకుంటూ ఇంటి పని చేయడం అనే తలరాత నుంచి తాము తప్పించుకునే అవకాశం లేదని గ్రహించాక చదువు పట్ల కనీస ఆసక్తి కూడా వారికి లేకుండా పోతోంది. కళాశాల విద్య పూర్తి చేసుకోవడం, ఉద్యోగావకాశాలు తలుపులు తట్టడం అంటే వీరికి పగటి కలగానే ఉంటోంది. ఒకవేళ పాఠశాలకు పంపినా, అయిదో తరగతి పూర్తి చేశాక చాలామంది బాలికలు బడి మానేస్తున్నారు. అక్షరాస్యత అంటే ఆడపిల్లలు తమ పేర్లు మాత్రమే రాయగలగడం అనే అర్థానికి పరిమితమైంది. వీటన్నింటి ఫలితంగానే దేశంలో చదువు రాని మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ‘ప్రగతికోసం అమ్మాయిలను చదివించండి’ అనే నినాదం ట్రక్కులు, ఆటో రిక్షాల వెనుకవైపు నినాదాలుగా రాసుకోవడానికే పరిమితమవుతోంది.

పంజాబ్‌లో ‘వ్యవసాయ వితంతువులు’
ఈ నెల మొదట్లోనే వికల్ప్‌ ప్రదర్శించిన మరొక పాత డాక్యుమెంటరీ చిత్రం ఇతర రాష్ట్రాలకు చెందిన కథలతో కూడి ఉంది. ‘క్యాండిల్స్‌ ఇన్‌ ద విండ్‌’ అనే పేరున్న ఈ లఘుచిత్రానికి కవిత బాయి, నందన్‌ సక్సేనా దర్శకత్వం వహించారు. భారత ధాన్యాగారంగా, హరిత విప్లవ కేంద్రంగా పేరొందిన సంపన్న రాష్ట్రం పంజాబ్‌లో రైతు వితంతువులుగా ముద్రపడిన మహిళల గురించిన చిత్రమిది. పంజాబ్‌లో వర్ణరంజితంగా కనిపించే ఆవాల పంట క్షేత్రాలను, అంతం లేకుండా సాగే భాంగ్రా డ్యాన్స్‌ని ప్రధాన స్రవంతి సినిమా పదే పదే చూపిస్తుండగా పంజాబ్‌ గ్రామాల్లో పరిస్థితి ఘోరంగా ఉంటోంది. 

మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యల గురించి మనకు తెలుసు. కానీ పంజాబ్‌ వ్యవసాయ కుటుంబాల్లో జీవితం ఇంతకు మించి మెరుగ్గా లేదు. ఇక్కడ అప్పుల బకాయిలను చెల్లించలేని పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటూ మహిళలు తమ సొంత పొలాల్లోనే పనిచేయవలసి రావడం, లేదా వ్యవసాయ కూలీలుగా మారిపోతున్న స్థితిలోకి వారిని నెడుతున్నారు. తమపై అప్పుల భారం మోస్తూ, తమ పిల్లలు, కోడళ్ల బాగోగులు చూసుకుంటా నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. నిండా మునిగిపోయి తలపైకెత్తి, అస్తిత్వం కోసం కొట్టుమిట్టాడుతున్న ఈ స్థితిని వారు టైమ్‌ పాస్‌ అనే పదంతో పిలుచుకుంటున్నారు. ముంబై యాసలో దీనికి మరొక అర్థముంది. రైతుకుటుంబాల్లోని వితంతువులకు మాత్రం ఇది జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొస్తుండటం లేదా చివరి రోజులు లెక్కబెడుతుండటం అనే అర్థంలో స్ఫురిస్తోంది. ప్రత్యేకించి రైతు మహిళలు ఇంటిపనులు మాత్రమే చేసుకునేలా పెంపకం ఉంటోంది కాబట్టి వీరికి ఉద్యోగాలు రావాలంటే తగిన విద్య ఉండదు. పంజాబ్‌లో అయితే భర్తను కోల్పోయిన వితంతువు తన భర్త సోదరుడినే పెళ్లాడాల్సిన సంప్రదాయం కూడా ఉంది. ఒక వితంతు రైతు మహిళ ఆందోళనా స్వరంతో చెప్పింది ఏమిటంటే, ‘ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రారు, అలాగని మా మానాన మమ్మల్ని శాంతంగా, ఒంటరిగా బతకనివ్వరు.’

కష్టాలను మోసుకెళ్లడమే పని
తమపై ఉన్న అప్పుల భారం తొలగాలని, తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, కాస్తంత మెరుగైన జీవితం తమకు దక్కాలని పంజాబ్‌ వితంతు రైతులు ఆశిస్తున్నారు. రాజస్థాన్‌లోలాగా పంజాబ్‌ గ్రామీణ మహిళలు ఇంట్లో పరదాలు వేసుకుని ఉండరు. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి వీరిలో కొందరు రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పల్లెల్లోని మందు షాపులను మూసేయించే కార్యక్రమాలను కూడా వీరు చేపడుతుంటారు.  తీవ్రమైన నిరాశానిస్పృహలు రాజ్యమేలుతున్న చోట కాసింత ఆశను కలిగించి, కష్టాలను తొలగించే ప్రయత్నాలకు చెందిన గాథలు ఉంటున్నాయి. బాలికలకు సైకిళ్లు అందజేసి వారు సుదూరంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. విద్య విషయంలో బాలికలకు సాయపడేందుకు ఎన్జీవోలు పనిచేస్తున్నాయి. కుమార్తెలకు మెరుగైన జీవితం కల్పిస్తున్న కుటుంబాల గాథలు కూడా వెలికివస్తున్నాయి. 

జ్యోతీబా ఫూలే, సావిత్రిబా ఫూలే దంపతులిద్దరూ 1848లోనే బాలికలకోసం పాఠశాలలు ఏర్పర్చేందుకు ఎంతగానో పోరాడిన విషయాన్ని ఇప్పుడు బడి మానేస్తున్న పుత్రికలు మనకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి 173 సంవత్సరాల తర్వాత బాలికలకు విద్య అనేది ఒక నిషిద్ధపదార్థం కాదు. కానీ స్త్రీల నిరక్షరాస్యత ఇప్పటికీ తొలగించలేకపోతున్నాం. బొట్లు, మంగళసూత్రాలపై ఆందోళనకు దిగడం కాకుండా బాలికల విద్య, ప్రగతి నినాదాలపై ఇంకా ఎక్కువగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది.
– దీపా గెహ్లాట్, కాలమిస్ట్, రచయిత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement