కాంగ్రెస్‌కు ఇది కర్తవ్యమే! | Dileep Reddy Analysis On Congress Party Present Situation | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఇది కర్తవ్యమే!

Published Fri, Sep 4 2020 12:58 AM | Last Updated on Fri, Sep 4 2020 1:00 AM

Dileep Reddy Analysis On Congress Party Present Situation - Sakshi

ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత ప్రీతిష్‌నంది ఈ మధ్య ఒక ట్వీట్‌ చేశారు. ‘‘ఇప్పుడంతా కుంగి పోయింది లేదా ఆ దిశలో ఉంది. ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, ఉపాధి, జీడీపీ, జీఎస్‌టీ... అన్నిటా ఇదే స్థితి. మధ్యతరగతి కూడా అధిక పన్నుల మోతతో కుదేలయింది. కేంద్ర ప్రభుత్వం గురించి ఇకనైనా గొప్పలు చెప్పడం ఆపుదామా? విపక్షం లేదనుకోవద్దు. సంక్షు భిత సమయాలు తమ హీరోలను తామే వెదు క్కుంటాయి’’ అన్నది ఆ ట్వీట్‌ సారం!

పైకి ఇది ఎన్డీయే ప్రభుత్వ పెద్ద భారతీయ జనతాపార్టీ నాయకత్వానికి హెచ్చరికలా కనిపిస్తుంది. కానీ, దేశంలో ముఖ్య ప్రతి పక్షం కాంగ్రెస్‌ పార్టీకి ఒక చురక! దేశ ప్రజలు ఎదుర్కొనే సంక్షుభిత పరిస్థితుల నుంచి హీరోగా ఎదిగే ఏ అవకాశాన్నీ విపక్ష కాంగ్రెస్‌ అంది పుచ్చుకోవడం లేదు. అలాంటి అవకాశాల్ని సృష్టించుకోలేకపోతోంది. 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ నేడున్న దయనీయ స్థితిని పార్టీ అధినాయకత్వం తప్ప అందరూ గ్రహిస్తున్నారు. అట్టడుగు కార్యకర్త నుంచి పార్టీ సీనియర్ల వరకు అందరికీ పరిస్థితి అర్థమౌతోంది. 2014, 2019 రెండు వరుస ఓటముల తర్వాత కూడా పార్టీకి జ్ఞానోదయం అయినట్టులేదు. అందుకు అవసరమైన నిజాయితీ ఆత్మశోధనే ఇంత వరకు పార్టీలో జరుగలేదు. లభించిన ఒకటీ అరా అవకాశాల్ని కూడా నాయకత్వం జారవిడుకుంటోందనడానికి తాజా వర్కింగ్‌ కమిటీ (సీడబ్లు్యసీ) సమావేశమే నిదర్శనం. సంస్థాగత సంస్కరణలు చేపట్టేం దుకు ఓ అవకాశం కల్పించిన కీలక సమావేశాన్ని బెదిరింపులు, బ్లాక్‌ మెయిల్‌ ఎత్తుగడలతో ‘టీ కప్పులో తుఫాన్‌’గా ముగించేశారు. ఎటు పయనిస్తున్నామో తెలియని కూడలిలో నేడు కాంగ్రెస్‌ నిలబడి ఉందన్న భావన పార్టీ సగటు కార్యకర్తకు కలుగుతోంది. అయిదారు మాసాల్లో జరిగే కాంగ్రెస్‌ సంఘం అఖిల భారత (ఏఐసీసీ) భేటీలో ఏం జరుగనుందో కూడా చూచాయగా తెలిసిపోయింది! లేకపోయినా ఉన్నట్టు అంగీకరించాల్సిన దేవతా వస్త్రాల వంటిదే పార్టీలో అంతర్గత ప్రజస్వామ్యమని మరోమారు నిరూపించారు. పార్టీలో సీనియర్లుగా ‘తక్షణ చర్యలు’ కోరుతూ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది అసంతృప్తులు లేవనెత్తిన అంశాలకు ఏ గతి పట్టనుందన్నది ఆమె తీసుకోబోయే తదుపరి నిర్ణయాలతో తేలనుంది. భేటీలో రాహు ల్‌గాంధీ ప్రతిపాదించినట్టు పార్టీ రోజువారీ పనుల నిర్వహణకు ఒక కమిటీని నియమించుకునే, పార్టీ సంస్థాగత స్వరూపం మార్చుకునే అధికారం సోనియాకే కట్టిబెట్టిన నేపథ్యంలో ఆమె తదుపరి చర్యలు కీలకం. లేఖలో లేవనెత్తిన అంశాల్ని ఏకంగా చాపకిందకు నెడతారా? వాటి ఆచరణకు చిత్తశుద్ధితో నడుం కడతారా? అన్నది పార్టీ కార్యకర్త లతో పాటు దేశ ప్రజలు వేచి చూడాల్సిందే!

లేఖలో తప్పేంటో చెప్పాల్సింది!
నిజానికి సీనియర్‌ నాయకులు పార్టీ అధినేత్రికి రాసిన లేఖలోని అంశాల్ని సీడబ్లు్యసీ భేటీలో చర్చించాల్సింది. సాధ్యాసాధ్యాలపై విస్తృతాభిప్రాయం సేకరించి, సంస్కరణలు చేపట్టి ఉండాల్సింది. లేఖ రాసిన ఉద్దేశాన్ని శంకించి, సమయాన్ని తప్పుబట్టిన రాహుల్‌గాంధీ అవి తప్పని నిరూపించలేకపోయారు. ‘నొచ్చుకున్నా’నన్న సోనియా ఎందుకో వివరించలేదు! రాసిన వారి నిబద్ధతతో నిమిత్తం లేకుండా, ఆ లేఖ ఆత్మని పరిశీలిస్తే... పార్టీని బాగుచేసుకునేందుకుద్దేశించిన అంశాలే ఉన్నాయి. పూర్తికాలం అధ్యక్షులు కావాలని, సమయం వెచ్చించి అందుబాటులో ఉండాలని, అన్ని స్థాయుల్లో సంస్థాగత ఎన్నికలు జరగాలని, నిర్ణయాలు, నియామకాల్లో వికేంద్రీకరణ జర గాలని, తాత్కాలిక ఉపశమన చర్యలు, సూక్ష్మస్థాయి వ్యవహార నిర్వ హణ కాకుండా పార్టీ నియమావళికి లోబడి శ్రేణులకు స్ఫూర్తిని, నైతిక స్థయిర్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కేంద్రీకృత నాయకత్వం, ఢిల్లీ పీఠం నిర్ణయాల్ని అట్టడుగు స్థాయి వరకూ రుద్దడం వల్ల సంస్థాగతంగా పార్టీ బలహీనపడుతూ వచ్చిందన్నారు. 23 ఏళ్లుగా పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ (సీడబ్లు్యసీ)కి ఎన్నికలే లేవు! తిరుపతి (1992), కలకత్తా (1997)లో జరిగినవి కూడా నామమా త్రపు ఎన్నికలే! సోనియా రెండు దశాబ్దాల నేతృత్వంలో నియామకాలే తప్ప నామమాత్రపు ఎన్నికలు కూడా జరుగలేదు. క్లిష్ట సమయాల్లో పార్టీకి, శ్రేణులకు సీబ్లు్యసీ తగిన మార్గనిర్దేశ్యం చేయలేకపోతోందనీ లేఖలో ప్రస్తావించారు. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థి తులు, ప్రపంచంలో మరెక్కడా లేనంతగా ఎదిగి వస్తున్న యువతరం, ప్రజల ఆకాంక్షల్లోని కొత్తదనం.. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్‌ను సంస్కరించుకోవాల్సిన దశలో మూసవోసిన ముతక పద్ధ తుల్లోనే వెళుతున్నారు! భజనపరుల్నే అధినాయకత్వం ప్రోత్సహించ డాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దేశ వ్యాప్తంగా వేలాది మంది నాయకులు, లక్షలాదిగా కార్యకర్తలు, కోట్ల కొలది పార్టీ సానుభూతిపరులు... అంతకంతకు దిగజారుతున్న పార్టీ బలం, ప్రతిష్ట, విశ్వసనీయతను చూసి నీరుగారి పోతున్నారనే అభిప్రాయం అంతటా వ్యక్తమౌతోంది. 

అధికారమే తప్ప బాధ్యత పట్టదా?
సీడబ్యుసీ భేటీ ముగింపులో సోనియా మాట్లాడుతూ సంస్థాగత అంశాల్ని పార్టీ వేదికల్లోనే లేవనెత్తి చర్చించాలన్నారు. సీనియర్ల లేఖ మీడియాకు, నిజానికి అది రాసిన వాళ్లనుంచి వెల్లడయిందా? స్వీక రించిన వారి నుంచా? అన్నది ఇప్పటికీ సందేహమే! లేఖలో ‘ఎంపిక చేసిన’ అంశాలే వెల్లడయ్యాయని, పూర్తి పాఠం భేటీలో చదివి వినిపిం చాలని గులామ్‌నబీ ఆజాద్‌ డిమాండ్‌ చేయడాన్ని బట్టి ఇది సోనియా కోటరీయే పత్రికలకు వెల్లడి చేసి ఉంటుందనే అనుమానాలున్నాయి. వారలా చేయడానికి ఓ కారణం ఉండొచ్చు! లేఖలోని అంశాల్ని జీర్ణిం చుకోలేని అధినాయకత్వం, అది రాహుల్‌గాంధీని లక్ష్యం చేసుకొని సంధించినట్టు భావించే ఆస్కారముంది. పూర్తికాలపు అధ్యక్షులు కావా లనడం, సమయం వెచ్చించి అందుబాటులో ఉండాలనడం, పార్టీ శ్రేణులకు స్ఫూర్తి, నైతిక స్థయిర్యం ఇవ్వలేకపోతున్నామనడం... వంటి వన్నీ అదే భావన కలిగిస్తాయి. 2009లో కాంగ్రెస్‌ మళ్లీ గెలిచినపుడే రాహుల్‌ ప్రభుత్వంలో భాగం కావాల్సిందనే అభిప్రాయం ఉండింది. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి గత సంవత్సరం వైదొలగి ఉండాల్సింది కాదనే భావనా ఉంది. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నా సంస్థా గత నిర్ణయాల్లో నేటికీ రాహుల్‌ తన ముద్ర ఉండేలా చూస్తారు. మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో పార్టీ గెలిచినపుడు సమర్థ యువనేతలను ముఖ్యమంత్రులు చేయడంలో విఫలమయ్యారనే విమర్శ ఉంది. అందువల్లే ఒక రాష్ట్రం జారిపోగా, మరో రాష్ట్రం మునివేళ్లలో ఉంది. అపరిమిత అధికారం ఉండాలే తప్ప బాధ్యతలకు రాహుల్‌ నిలబడ రనే అభిప్రాయం పార్టీ వివిధ స్థాయి నాయకుల్లో ఉంది. ఇవన్నీ తొలగిపోయి, లేఖాస్త్రం వీగిపోవాలి. తిరిగి రాహుల్‌ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చేలా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా వ్యక్తిపూజారుల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టాలి. అందుకు ఈ లేఖ ఉపయోగపడుతుంది. సరిగ్గా సీడబ్లు్యసీ భేటీకి ముందు లేఖాంశాల్ని వెల్లడి చేయడం, సీనియర్లను తప్పుబట్టడం ద్వారా గాంధీ–నెహ్రూ కుటుంబం పట్ల వీర విధేయత చాటడానికి గొప్ప అవకాశంగా ఎత్తుగడ పన్ని ఉంటారనేది సారం. సరిగ్గా అదే జరి గింది. పలు రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీలు, ఇతర సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లేఖరు రాయడం, సందే శాలు పంపడం ఈ కోవలోదే! రాజీనామా చేస్తానన్న సోనియాను తాత్కాలిక అధినేత్రిగా కొనసాగాలని, లేదా రాహుల్‌ను ఒప్పించాలని భేటీలో వచ్చిన డిమాండ్‌ వ్యూహాత్మకమే!

ఇక ఇప్పుడేం జరుగొచ్చు...?
పరిస్థితులు అనుకూలించినపుడు ఏఐసీసీ సదస్సు జరిపించేట్టు, అప్పటివరకు అధినేత్రిగా కొనసాగేట్టు సోనియాకు పార్టీ పగ్గాలిస్తూ సీడబ్లు్యసీ తీర్మానించింది. అందుకామె అంగీకరించారు. బిహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో శాసనసభలకు ఎన్నికల దృష్ట్యా వచ్చే సంవ త్సరం మార్చి వరకు ఎప్పుడైనా ఏఐసీసీ సమావేశం జరుపొచ్చు! గాంధీ–నెహ్రూ కుటుంబం నుంచి కాక వేరొకరు నాయకత్వం వహిస్తే పార్టీ ఐక్యతకు భంగమనేది బాగా ప్రచారం చేస్తారు. పూర్తికాలం అధ్యక్ష బాధ్యతల్లో సోనియానే కొనసాగమని కోరవచ్చు. ఆమె అనా రోగ్యం దృష్ట్యా రాహుల్‌ వైపు మొగ్గే ఆస్కారం ఉంది. ససేమిరా అని రాహుల్‌ అదే పట్టుదల కనబరిస్తే, ఇక రెండో ప్రత్యామ్నాయంగా ప్రియాంకా గాంధీని కోరే అవకాశం ఉంటుంది. కానీ, రాహులే మెత్త బడ్డట్టు కనిపిస్తున్నారు. ఏమైనా ఈ ముగ్గురి మధ్యే ‘మ్యూజికల్‌ చైర్‌’ ఆట తథ్యం! ఓట్లు రాబట్టే ప్రజాకర్షణ సోనియా, రాహుల్‌లకు లేదని తేలిపోయింది.

ఇప్పటిరవకు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలకే పరిమితమైన ప్రియాంక సామర్థ్యం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఓట్ల సంగతెలా ఉన్నా, దేశవ్యాప్తంగా కనీసం పార్టీని ఐక్యంగా ఉంచాలంటే ఆ కుటుంబం చేతుల్లోనే పార్టీ పగ్గాలుండాలనే వాదన నేటికీ బలంగా ఉంది. నాయకత్వం పట్ల భిన్నాభిప్రాయం లేకపోయినా, సంస్థాగత మార్పు కోరిన అసంతుష్ట సీనియర్లను ఏం చేస్తారు? ఇదొక ప్రశ్న! ‘దురుద్దేశం’ అని రాహుల్, ‘దురదృష్టకర’మని మన్మోహన్, ‘దుర్మార్గ’ మని ఏ.కే.ఆంటోనీ, ‘శిక్షించా’లని అంబికాసోనీ, తనను ‘నొప్పించిం’ దని సోనియా సీడబ్లు్యసీ భేటీలో అభిప్రాయపడిన సందర్భంలో సీనియర్ల లేఖాస్త్రానికి ప్రతిచర్య ఎలా ఉంటుంది? పార్టీలో వారి ప్రాధాన్యత తగ్గించొచ్చు. అది పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలిచ్చే ఆస్కారం ఉంది. నిజానికి ఆ సీనియర్లలో, భూపేంద్ర సింగ్‌ హుడా వంటి ఒకరిద్దరు తప్ప ప్రజాక్షేత్రంలో పట్టున్న నాయకులెవరూ లేరు. మరి కొందరికి తమ నియోజకవర్గాల్లో మాత్రమే పట్టుంది. ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసినా... జనసమూహాల్ని ప్రభావితం చేసే సత్తాలేని సదరు సీనియర్ల డొల్లతనాన్ని ఎండగట్టే సవాల్‌కు అధినాయకత్వం సిద్ధపడుతుందా? అన్నది ప్రశ్న! అందుకు, తమ ధోరణి మార్చుకునేందుకు సిద్ధపడుతుందా? గాంధీ–నెహ్రూ కుటుంబేతరుణ్ని అధ్యక్షుడిని చేసేందుకు సాహసిస్తుందా? కాంగ్రెస్‌ను వీడిన ముఖ్య నాయకుల్ని తిరిగి వెనక్కి రప్పించి పార్టీ పరిధి విస్త రిస్తుందా? సంస్థాగత సంస్కరణలకు నడుం కడుతుందా? ఇవన్నీ ప్రశ్నలే! సమాధానం లేని ప్రశ్నలు. కాంగ్రెస్‌ పరిణామాల పట్ల ప్రజలకెందుకు ఆసక్తి? దేశంలో ఇప్పటికిదే ప్రధాన ప్రతిపక్షం కనుక! ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ తలపైనున్న ప్రభుత్వాలతో విసిగి, వద్దనుకున్నపుడు యోగ్యమైన ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుంది. కనుక కర్తవ్యం కాంగ్రెస్‌ది, ఆపై నిర్ణయం ప్రజలది.

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement