
భుక్తి కోసం ప్రతిరోజూ శ్రమించే నిరుపేదల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ‘ఆడిన మాట తప్పరు, నిన్నటి బాధితులను మర్చిపోరు, అనుకున్న పరిష్కారం అమలయ్యే వరకు నిద్రపోరు’. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి యావత్ రాష్ట్ర ప్రజల ఏకైక నినాదం ఇది. అనంతపురం నుంచి ఆముదాలవలస దాకా, చిత్తూరు నుంచి చీపురుపల్లి దాకా, కడప నుంచి కాకినాడ దాకా అభాగ్యులందరిదీ ఒకే కంఠం. మాకు అండగా నిలిచింది ఆయనే, ఆయనకు కండబలం మేమే. మా జనానికి కళ్లల్లో జ్యోతి, మా ఆత్మవిశ్వాసానికి ఆయువు ఆయనే. కారులో దారిన పోతూపోతూ కాఫీ కోసం కాకా హోటల్ వద్ద ఆపి మాట వరకు అడగండి, ‘ఎలా ఉందయ్యా జగన్ పాలన? అని. కష్టజీవులు లేని మాటలు చెప్పలేరు. కడుపులో ఆకలి తగ్గించిన నేతకు, నిర్విరామభుక్తిని కల్పించిన నాయకుడికి దండం పెడతారు. ఇదే జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనకు ప్రజల నుంచి దక్కిన యోగ్యతాపత్రం.
‘‘కష్ట జీవులకు, కర్మ వీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ... స్వస్తి వాక్యములు సంధావిస్తూ, స్వర్ణ వాద్యములు సంరావిస్తూ పదండి ముందుకు’’ అన్నాడు శ్రీశ్రీ. ఆ దారిలో, ఆ ప్రగతి శీల మార్గంలో పురోగమిస్తున్న యువ జగతి పథనిర్దేశకుడు జగన్. ఈ మాటలు ఆయన అనుయాయుల పొగడ్తల దండలు కావు. ప్రజాసమూహాల అండదండల గొంతుకలు. నిన్న గాక మొన్ననే కదా... రెండు సంవత్సరాల జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన అనంతరమే కదా! రాష్ట్రమంతా గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికలు జరిగాయి. ప్రజలేమన్నారు? పంచాయతీలేమన్నాయి? నగర పౌరులేమన్నారు? అందరిదీ ఒక్కటే తీర్పు. జై జగన్! చంద్రబాబు మోసం చేసిన అమరావతి ప్రాంతంలోనైనా, సముద్ర సాక్షిగా జ్వలించే విశాఖ పట్టణంలోనైనా, ఆత్మగౌరవానికి అంతఃపురాలైన గోదావరి సీమల్లోనైనా ఎక్కడైనా జనం మాట ఒక్కటే... వైఎస్సార్‌సీపీ జెండాకు జైకొట్టడమే. తిరుపతి దేవుని సాక్షిగా జన సందోహం ఇచ్చిన సందేశం ఒక్కటే. జగన్ మీదే నమ్మకం!
మాయ మాటలు, కుళ్ళు రాజకీయాలు, కుల రాజకీయ కుయుక్తులతో ప్రజల హృదయాలను గెలుచుకోలేమని మహానేత స్వర్గీయ వై.ఎస్. రాజశేఖరరెడ్డి చూసిన బాటలో జగన్ నడుస్తున్నారు. మాట తప్పని, మడమ తిప్పని పాలకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సంక్షేమ పథకాలను ప్రారంభించినప్పుడు అవి డబ్బులు పంచి పెట్టే కార్యక్రమాలు కావని, అవన్నీ భవిష్యత్ సామాజిక పెట్టుబడులని, సమున్నత సమాజాన్ని నిర్మించడానికి పునాదులు వేస్తాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.
విద్య, వైద్యం మీద ఈ రెండేళ్లలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించడం, స్కూళ్లలో నాడు–నేడు చేపట్టి బడులకు విద్యాకళను అద్దడంతో పాటు ఫర్నిచర్, ఫ్యాన్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయించడం వెనక ముఖ్యమంత్రి ముందుచూపు కనబడుతుంది. పేదలు, మధ్య తరగతి బతుకుదెరువుకు బాటలు వేయడానికి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి భవిష్యత్ నిర్దేశకుడిగా నిలిచారు. ఖరీదయిన వైద్యాన్ని ఉచి తంగా అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని సమూలంగా సంస్కరించి గాడిలో పెట్టారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆసుపత్రుల్లో నాడు–నేడు చేపట్టారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్, బ్లాక్‌ఫంగస్ చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించడం మిగతా రాష్ట్రాలూ అనుసరించాల్సిన మార్గం.
సొంత ఇల్లు కేవలం తలదాచుకోవడానికే కాదు, అది పేదవాడి ఆత్మగౌరవ సూచిక. అది కూడా మహిళ పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తుండటం ఇటు మహిళా సాధికారతకు, అటు ఆత్మగౌరవ సాధనకు ఉపయోగపడుతున్నాయి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకోవడం దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. దాదాపు 62 శాతం కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవి స్తున్నాయి. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సమకూర్చడంతో పాటు కౌలు రైతులకూ భరోసా ఇస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అన్ని రకాల సేవలను రైతు ఇంటి ముంగిటకు రెండేళ్లలో చేర్చిన ఘనతను ప్రభుత్వం దక్కించుకుంది. విత్తనంనుంచి అమ్మకం దాకా ఆర్బీకేలు రైతుకు అండగా నిలుస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సీఎం ఎంతగా తపన పడుతున్నారో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చెబుతాయి. ప్రత్యేకించి ఈ వర్గాల్లో మహిళలు బాగుంటే కుటుం బాలు అన్ని విధాలుగా అభ్యున్నతి చెందుతాయని భావించి, నామినేషన్ పదవులు, పనుల్లో సగం వారికి రిజర్వు చేయడం సీఎం దార్శనికతకు నిదర్శనం. రెండేళ్ల పాలన గురించి క్లుప్తంగా చెప్పడం సాధ్యం కాదు. కానీ ఒక్కమాట చెప్పగలను. ఈ రెండేళ్లలో సంక్రాంతి, ఉగాది పండుగల్లా తేదీలను ప్రకటించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు జగన్. ప్రజలు మెచ్చిన పాలనకు రెండేళ్లు పూర్తవడం కూడా పండుగే. ఇది నిజంగా పండుగ రోజే.
వ్యాసకర్త: ప్రొఫెసర్ డాక్టర్ మేరుగు నాగార్జున
ఎమ్మెల్యే, వేమూరు,
గుంటూరు జిల్లా ‘ మొబైల్ : 90004 56706
Comments
Please login to add a commentAdd a comment