గతవారం రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న బహుముఖ సైనికదాడికి చారిత్రక కారణాలు అనేకం తోడయ్యాయి. ఏయే దేశాలు గడచిన కొన్ని దశాబ్దా లుగా ఇతర దేశాలపై దురాక్రమణకు దిగాయో పరిశీలిస్తే ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడతాయి. సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు దేశాలైన చెకొస్లొ వేకియా, హంగరీ, పోలండ్, తూర్పు జర్మనీలను దాదాపుగా ఆక్రమించి తన గుప్పిట్లో పెట్టుకుంది. కమ్యూనిస్టు చైనా కమ్యూనిస్టు వియత్నాంపై దురాక్ర మణ దాడికి దిగింది. కమ్యూనిస్టు వియత్నాం తోటి కమ్యూనిస్టు దేశమైన లావోస్‌పై దాడిచేసి అవమానకరమైన ఓటమితో వెనుదిరిగింది. రష్యా, చైనా, వియత్నాం చేస్తూవచ్చిన దురాక్రమణ దాడులు సామ్రాజ్యవాద స్వభావంతో కూడుకుని ఉన్నాయి. సోషలిజం, కమ్యూనిజం అనేవి ముసుగులు మాత్రమే. ఈ దాడుల వెనుక కీలకాంశం ఆధిపత్యం, అధికారం తెచ్చిపెట్టిన అహంకారం.
మరోవైపు చూద్దాం. వియత్నాంపై దాడి చేసిన అమెరికా కార్పెట్ బాంబింగ్ ద్వారా చరిత్ర మర్చిపోలేనంత విధ్వంసాన్ని సృష్టించింది. కానీ దివంగత వియత్నాం నేత హోచిమిన్, జనరల్ జాప్ నాయకత్వంలో వియత్నాం ప్రజలు తలపెట్టిన జాతీయవాద ప్రతిఘటనను అమెరికా అడ్డు కోలేకపోయింది. అమెరికా అధికార అహంకారంపై వియత్నాం జాతీయవాదం ఘన విజయం సాధించింది.
అఫ్గానిస్తాన్‌ను అమెరికా ఆక్రమించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు అఫ్గాన్లు అమెరికా సైన్యాన్ని ప్రతిఘటిస్తూ వచ్చారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ బేషరతుగా తన సైన్యాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించు కున్నారు. విదేశీ దురాక్రమణపై జాతీయ ప్రతిఘటన ముందు అమెరికా అగ్రరాజ్యం తలవంచింది. అలాగే, పూర్వ సోవియట్ యూనియన్ కూడా అఫ్గానిస్తాన్‌ను దురాక్రమించింది. అక్కడి స్థానిక ప్రభుత్వాన్ని దింపి తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. ఏడేళ్ల పాటు సాగిన ప్రజాపోరాటంలో చివరకు అంత పెద్ద కమ్యూనిస్టు అగ్రరాజ్యం కూడా అఫ్గాన్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
పూర్వ సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్టు సామ్రాజ్యవాద శక్తి. ముస్లిం సెంట్రల్ ఆసియన్ రిపబ్లిక్కులతోపాటు ఆర్మేనియా, బెలారుస్, ఉక్రె యిన్ కూడా రష్యన్ సామ్రాజ్యవాద పాలనకు లోబడి కమ్యూనిస్టు ప్రభుత్వా లను ఏర్పర్చాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే ఉక్రెయిన్‌కు భద్రతా మండలిలో స్థానం కావాలని యూఎస్‌ఎస్‌ఆర్ డిమాండ్ చేసింది. దీనికి ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు. అదే ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. రష్యా, దాని అధీన దేశాలు, కమ్యూనిస్టు చైనా ఒకవైపు... అమెరికా దాని మిత్రదేశాలు ఒకవైపు నిలబడి తలపడ్డాయి.
సోషలిజం, కమ్యూనిజం పేరిట కమ్యూనిస్టు శక్తులు... ప్రజాస్వామ్యం పేరిట అమెరికా, పాశ్చాత్య యూరోపియన్ దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్య ఆకాంక్షలతోటే పలుమార్లు దురాక్రమణ యుద్ధాలకు తలపడ్డాయని చరిత్ర మనకు సూచిస్తోంది.
భారతదేశం తొలినుంచి సందిగ్ధావస్థలో ఉండిపోయింది. అప్పటి సోవి యట్ యూనియన్, తర్వాత రష్యా 1950ల నుంచి భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూటమిలో చేర కుండా ఇండియాను నిలవరించడమే దీని ఉద్దేశం కావచ్చు.
అనేక సందర్బాల్లో పాకిస్తాన్, చైనాలు ఐరాస భద్రతా సమితిలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలకు వ్యతిరేకంగా యూఎస్‌ఎస్‌ఆర్, రష్యా వీటో పవర్ ఉపయోగించి ఆదుకున్న మాట వాస్తవం. తనను ఎన్నోసార్లు ఆదుకున్న రష్యాను దురాక్రమణదారుగా ఆరోపించి తప్పుపట్టడం మనదేశానికి బాధ కలిగించేదే అవుతుంది. కానీ ప్రస్తుతం చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై శక్తిమంతమైన రష్యా దురాక్రమణ దాడికి వ్యతిరేకంగా భారత ప్రజలు ఉద్వేగంతో ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నారు. అమెరికా, నాటో సభ్యదేశాలు శక్తిమంతమైన రష్యాపై విధించే ఆంక్షలు పెద్దగా పనిచేయకపోవచ్చు. అవసరమైతే ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా పుతిన్ వెనుకాడడు.
మనందరం సంక్షోభ కాలంలోనే జీవిస్తున్నాం. బలమైన చైనాతో భారత్ తలపడుతోంది. అయితే ఉక్రెయిన్, ఫిన్లాండ్‌లు అంత చిన్న దేశం కాదు. మన మిత్రదేశం, మనకు ప్రయోజనకరంగా ఉండే దేశం ఇప్పుడు దురాక్రమణ దారుగా ముద్ర పడుతున్నప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించడానికి ఎంతో వివేకం, జ్ఞానం అవసరమవుతాయి. వాస్తవానికి ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించడానికి మూల కారణం నాటో. పొరుగు దేశం నాటో కూటమిలో చేరితే తన భద్రతను కాపాడుకోవలసిన అవసరం రష్యాది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో భారత్ జాగ్రత్తగా అడుగులు వేయ వలసిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త: డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి
ఛైర్మన్, ప్రజ్ఞా భారతి
వివేకంతో వ్యవహరించాల్సిన క్షణం
Published Fri, Mar 4 2022 1:12 AM | Last Updated on Fri, Mar 4 2022 1:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment