హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు రెండు కీలకమైన రాజకీయ పరిణామాలకు అద్దంపట్టే విధంగా ఉన్నాయి. ఒకటి: అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడి తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితిని చక్కదిద్దు కునే అవకాశం, సమయం రెండూ ఆ పార్టీకి ఇంకా వున్నాయి. రెండు: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర నుంచి కాంగ్రెస్ జారిపడటం పూర్తయింది. ఇక లేచి నిలబడే అవకాశాలు లేనట్టే. ఇందుకు కారణాలున్నాయి. ఆ పాత్రలోకి ప్రవేశిం చడానికి భారతీయ జనతా పార్టీ చేపట్టిన యాత్ర విజయ వంతంగా ప్రారంభమైంది.
టీఆర్‌ఎస్ పలుకుబడి ఎందుకు తగ్గుముఖం పట్టింది? ఆ పార్టీ నాయకులు చెబుతున్నట్టు... బీజేపీ శ్రేణులు వెదజల్లిన మత విద్వేషం ప్రభావం చూపిందా? వందేళ్లలో కనీవినీ ఎరుగని వరదలు సరిగ్గా ఎన్నికలకు ముందే దాపురించడం కారణమా? పదిపదిహేను డివిజన్లను కొద్ది ఓట్ల తేడాతో కోల్పోయే విధంగా దురదృష్టం వెక్కిరించిందా? ఇటువంటి సాకులకు మాత్రమే టీఆర్‌ఎస్ విశ్లేషణ పరిమితమైతే ఆ పార్టీకి లాభం చేకూరదు. వాస్తవానికి నగరవ్యాప్తంగా రెండు పార్టీలకు పోలయిన ఓట్లు దాదాపు సమానంగానే ఉన్నాయి. కానీ టీఆర్‌ఎస్‌కే ఏడు డివిజన్లు ఎక్కువొచ్చాయి. దురదృష్టం ఎవరితో ఉన్నట్టు? టీఆర్‌ఎస్ స్కోర్ బోర్డు 56 దాకా పరుగెత్త డంతో మూడు అదనపు కారణాలు ముఖ్యపాత్రను పోషిం చాయి. ఒకటి: ఆంధ్రప్రదేశ్ సెటిలర్లు. రెండు: వామపక్ష– సెక్యులర్ ఆలోచనాపరులు, మూడు: వంద డివిజన్లలో ముస్లిం మైనారిటీలు. ఈ మూడు వర్గాలు టీఆర్‌ఎస్ పార్టీ సొంత ఓటు బ్యాంకులు కావు. పరిస్థితులకు అనుగుణంగా మారేవి. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో అవి టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. మతపరమైన ఎజెండాతో బీజేపీ సాధించిన ఓట్ల కంటే ఈ ఓట్లు తక్కువేమీ కాదు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి నియోజకవర్గాల పరిధిలోని 32 డివిజన్లలో 27 సీట్లను టీఆర్‌ఎస్ గెలుచుకోగలిగింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో కలిసి బీజేపీ కంటే లక్ష పైచిలుకు ఓట్లను టీఆర్‌ఎస్ అధికంగా సంపాదించుకోగలిగింది. పోస్ట్‌పోల్ సర్వే ద్వారా ఏ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గుచూపిందో తెలుసుకునే ప్రయత్నాన్ని ‘ఆరా’ అనే సంస్థ చేసింది. ఈ సంస్థ లెక్క ప్రకారం టీఆర్‌ఎస్‌కు అత్యధిక శాతం ఓట్లేసింది ఏపీలో టీడీపీకి వెన్నెముకగా ఉండే సామాజికవర్గమే. ఏపీ సెటిలర్లలో అన్ని సామాజికవర్గాల వారూ గులాబీ పార్టీవైపే మొగ్గుచూపినప్పటికీ టీడీపీ వెన్నెముక సామాజికవర్గం మొగ్గు మిగతా వారికంటే హెచ్చుగా ఉన్నది.
రెండు తరాల్లో జరిగిన కమ్యూనిస్టు విప్లవ పోరాటాలకు కార్యక్షేత్రంగా నిలిచిన తెలంగాణ ప్రాంతంలో ఆ ప్రభావం వల్ల వామపక్ష, లౌకిక ఆలోచనాపరుల సంఖ్య ఇప్పటికీ విస్తారంగానే ఉన్నది. కమ్యూనిస్టు పార్టీల్లో ఇప్పుడున్న సభ్యులకంటే ఈ ఆలోచనాపరుల సంఖ్య ఎన్నోరెట్లు అధికం. వీరికీ కమ్యూనిస్టు పార్టీలకూ ఎటువంటి సంబంధం ఉండదు. ఆ పార్టీల విధానా లతో పొసగదు కనుక ఇటువంటి వారంతా స్వతంత్రంగా ఉంటున్నారు. వీరిలో అత్యధికులు మొదట్లో టీఆర్‌ఎస్‌కు సహకరించినవారే. ఇటీవలికాలంలో బద్ధవ్యతిరేకులుగా మారిపోయారు. కానీ,ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రధాన వైరిపక్షంగా బీజేపీ ముందుకు రావడంతో మరో గత్యంతరం లేదన్నట్టుగా వీరంతా మళ్లీ టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపారు.
ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎంపిక చేసుకోకపోవడానికి రెండు కారణాలను వీరు చెబుతున్నారు. ఒకటి: కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి కనిపించకపోవడం, తాము కాంగ్రెస్‌కు ఓటేసినట్లయితే పరోక్షంగా బీజేపీకి మేలు జరుగుతుందని భావించడం. రెండు: కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అదే పార్టీలో కొనసాగుతారన్న గ్యారంటీ లేకపోవడం. 150 డివిజన్లున్న నగరంలో మజ్లిస్ పార్టీ 51 డివిజన్లలోనే పోటీ చేసింది. 44 చోట్ల గెలిచి తన పూర్వబలాన్ని నిలుపుకోవడమేగాక అత్యుత్తమమైన స్ట్రయిక్ రేట్‌ను సాధించింది. మజ్లిస్ పోటీ చేయని మిగిలిన 99 డివిజన్లలో కూడా ముస్లిం మైనారిటీల్లో గణనీయమైన భాగం టీఆర్‌ఎస్‌కే వేసి ఉంటారనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం ఉండదు.
ఈ రకంగా అనేక స్రవంతులు టీఆర్‌ఎస్ పార్టీకి సహకరించినా అత్తెసరు గెలుపే దక్కడానికి కారణాలేమిటో అధ్యయనం చేయవలసిన సమయం ఆ పార్టీకి ఆసన్నమైంది. వాటిని గుర్తించి చక్కదిద్దుకోగలిగితే ఇకముందు కూడా తెలంగాణ ప్రజల బెస్ట్ చాయిస్‌గా టీఆర్‌ఎస్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించి చంద్రబాబును కౌగిలించుకున్న కారణంగా చాలామంది ‘గత్యంతరం’ లేక టీఆర్‌ఎస్‌కు ఓటేశారు. బల్దియా ఎన్నికల్లో బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదగడంతో అనేకమంది ‘గత్యంతరం‘ లేక టీఆర్‌ఎస్‌కు ఓటేశారు. ఈ గత్యంతరం లేని పరిస్థితి ఎల్లకాలం ఉండకపోవచ్చు.
ఈ ఎన్నికల ఫలితాల వల్ల టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన తక్షణ ప్రమాదం ఏమీ లేదు కానీ, కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న మరో జీవి వృత్తాంతం వెలుగులోకి వచ్చింది. ఆ జీవి కాంగ్రెస్ పార్టీ. ఘనత వహించిన గతం కలిగిన ఆ పార్టీ ఇప్పుడు వెంటిలేటర్ సాయంతో ఊపిరి పీల్చుకుంటున్న వైనం బయట పడింది. ఒక గమ్యం, లక్ష్యం, వ్యూహం, సమన్వయం లేకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల కాలాన్ని ఉఫ్‌మని ఊదేసింది. ఇందుకు బాధ్యత వహించవలసింది రాష్ట్ర నాయకత్వం కాదు. మార్గ దర్శనం చేయలేని గందరగోళ స్థితిలో ఉన్న కేంద్ర నాయకత్వం. గత ఏడాదిన్నర కాలంగా ఆ పార్టీ జాతీయ ముఖచిత్రం ఎవరిదో చెప్పుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ శ్రేణులు నిస్పృహకు లోన య్యాయి.
నాయకులు, కార్యకర్తలు క్యూ కట్టి మరీ ఇతర పార్టీల్లోకి వలసపోతున్నా పట్టించుకునే దిక్కులేని అనాథలా వుంది కాంగ్రెస్ పరిస్థితి. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అతడు కచ్చితంగా పార్టీ ఫిరాయిస్తాడన్న అభిప్రాయం జనంలో ఏర్పడింది. ఈ ఒక్క అభిప్రాయం చాలు.. ఎటువంటి తటపటాయింపు లేకుండా ఆ పార్టీకి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడానికి. ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీని పూర్తిగా పోగొట్టుకున్నది. ఫిరాయింపులను ప్రోత్సహించిన టీఆర్‌ఎస్ కూడా బావుకున్నదేమీ లేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా అదే పార్టీలో కొనసాగుతున్నట్లయితే మరికొంతకాలం పాటు ఒక అర్భకపు ప్రతిపక్షంతో ఆహ్లాదకరంగా టీఆర్‌ఎస్ సహజీవనం కొనసాగేది. కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి మరో ప్రమాదకరమైన ప్రతిపక్షాన్ని గులాబీ పార్టీ ఆహ్వానించింది.
హైదరాబాద్‌లో ఎన్నికలు జరుగుతున్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా సీనియర్‌మోస్ట్ పొలిటీషియన్, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రదర్శించిన ఆంగిక, వాచికాభినయాలు సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. చేతులు విసురుతూ, రొమ్ము విరుస్తూ, కళ్లను విప్పారుస్తూ, తల ఎగరేస్తూ, సభ్యులను దుర్భాషలాడుతూ సర్రున జారిపడ్డట్టుగా స్పీకర్ పోడియం ఎదుట దభేల్‌మని కూలబడిపోయారు. గతంలో ఎక్కడా ఏ ప్రతిపక్ష నాయకుడూ ఇంతటి ‘నేలబారు’ తనాన్ని ప్రదర్శించలేదు. స్పీకర్‌ను బెదిరించడం, మీడియా సమావేశంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడడం, సభలో సంక్షేమ పథకాలపై అసత్యాలను వల్లించడం, తన సభ్యులచేత అవాస్తవాలను మాట్లాడించడం, చివరికి తన పార్టీ సభ్యుల ప్రసంగాలనే అడ్డుకోవడం.. అంతా ఒక వింతైన విచిత్ర ప్రవర్తన. చంద్రబాబు ప్రవర్తన ముందు బండి సంజయ్ ‘సర్జికల్ స్ట్రయిక్స్’ తరహా కామెంట్లు సైతం చిన్నబోయాయి.
ఎందుకని ఆయన ఆవిధంగా ప్రవర్తించారు? అసహనం, నిస్పృహ, క్రోధం, చిరాకు వంటివన్నీ ఏకకాలంలో ఆయన ముఖకవళికల్లో ముప్పిరిగొనడం ఎలా సాధ్యమైంది? కారణాలు స్పష్టం. పాతికేళ్ల కిందట ఎల్లో మీడియా సహకారంతో తాను హైజాక్ చేసి హస్తగతం చేసుకున్న పార్టీ తన కళ్లముందటే ఐసీయూలోకి చేరింది. గత తొమ్మిది నెలలుగా పార్టీలో కదలిక లేదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేదు. తానెంత ‘జూమ్’ చేసి చూసినా పార్టీ బొమ్మ కనిపించడంలేదు.
జనరంజకమైన జగన్ పరిపాలన ఫలితంగా ఏడాదిన్నర గడిచినా ఎక్కడా చిన్న ఆందోళన లేదు. రజతోత్సవాలకోసం తన పార్టీ నడిపిస్తున్న మందడం శిబిరం, దానికి పోటీగా దళితుల శిబిరం తప్ప మూడో ధర్నా రాష్ట్రంలో లేదు. భారీవర్షాల సందర్భంగా వరద నష్టాలపై ఎంత రెచ్చగొట్టినా ఒక్క రైతూ రోడ్డెక్కలేదు. తన పార్టీ జెండా ఎక్కడా ఎగర్లేదు. అనుభవజ్ఞుడు కనుక పరిస్థితి అర్ధమవుతున్నది. తన పార్టీ ఇంకెంతో కాలం బతకదు. కాకపోతే ఎల్లోమీడియా ఉన్నది.
సంపన్న వర్గాల దన్ను ఉన్నది. కనుక భౌతిక కాయాన్ని సైతం వజ్రకాయంగా కొన్నాళ్లు ప్రొజెక్ట్ చేయగలరు. కానీ వాస్తవ పరిస్థితి అధినేతకు తెలుసు, పార్టీలో పూర్వపు జవసత్వాలు ఇక కల్ల. క్లిష్ట పరిస్థితుల్లో తాను చక్రం తిప్పగలనని గతంలో ఎల్లో మీడియా నమ్మించేది. ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు. వేలికి చక్రం తొడగడం ఇప్పుడిక వేస్ట్. వ్యవస్థలను మేనేజ్ చేసే గారడీ విద్యలన్నీ ప్రజలందరికీ తెలిసిపోయాయి. తన మేనేజ్‌మెంట్ కథ చివరి మజిలీకి చేరుకుంటున్నది.
సరిగ్గా పదేళ్లు వెనక్కి వెళదాం. 2010 నవంబర్ 29. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లిగారు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ గుర్తుపై గెలిచిన పార్లమెంట్, అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కారణాలు తెలుగు ప్రజలకు తెలిసినవే. తన తండ్రి మరణవార్తను తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినవారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తానని సంతాప సభలో వారికి ఆయన మాట ఇచ్చారు. అందుకు అనుమతినివ్వాలని పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీని ఢిల్లీకి వెళ్లి మరీ అభ్యర్థించారు. అందుకు ఆమె సమ్మతించలేదు. అప్పుడామె జస్ట్ పార్టీ అధ్యక్షురాలు మాత్రమే కాదు. ఢిల్లీ మహాసామ్రాజ్య సామ్రాజ్ఞి స్థాయిలో చక్రం తిప్పు తున్నారు.
నాటి ప్రపంచంలో శక్తిమంతమైన ఐదుగురు వ్యక్తుల్లో ఒకరిగా ‘టైమ్’ మన్ననలందుకున్న స్థితిలో ఉన్నారు. అంతటి మహాసామ్రాజ్ఞి హుకుంనామా కంటే తాను సంతాప సభలో ఇచ్చిన మాటే విలువైనదిగా జగన్ భావించారు. అందుకే రాజీనామా చేశారు. ధిక్కారాన్ని సింహాసనం సహించలేదు. మూడు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఒక్క వ్యక్తిని వేటాడటానికి ఆ రెండు పార్టీలు కలిసి దిగజారకూడని లోతుల్లోకి పతనం అయ్యారు. ఫలితంగా పదేళ్లలో తెలుగునాట ఆ రెండు పార్టీల కథ చివరి దశకు చేరుకుంటున్నది. రెండు శవాలు కాలుతున్న కమురువాసన క్రమంగా వ్యాపిస్తున్నది.
-వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment