
ఒకసారి నలభయ్యేళ్లు వెనక్కి వెడితే... విశాఖ సాహితిలో పనిచేసిన ప్రముఖ కథారచయిత మల్లాప్రగడ రామారావు ఉద్యోగరీత్యా రాజ మహేంద్రవరం వచ్చారు. అంతలో కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.) కన్ను మూసినట్టు వార్త వచ్చింది. ఒకనాటి తెలుగువారి సాహిత్య రాజధాని అయిన రాజమహేంద్రవరంలో కొ.కు. సంతాప సభ జరగక పోవడం ఆయనకు తలవంపుగా అనిపించింది.
ఒక సాహితీ సంస్థను ఏర్పరచాలన్న వారి ఆలోచనకి మరికొందరు ఔత్సాహికులు కలిశారు. 1980 డిసెంబర్ 25న ‘సాహితీ వేదిక’ అవతరించింది. ఆ తర్వాత నాతో సహా మరెందరో చేరికతో అది మరింత వైశాల్యాన్ని తెచ్చుకుని యేడెనిమిదేళ్లు ఉనికిని చాటుకుంది.
సభ్యుల్లో అనేకమంది తలోవైపుకీ చెదిరిపోవడంతో వేదిక క్రమంగా కనుమరుగై ఒక తీపి జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 25, 26 తేదీల్లో వేదిక సభ్యులం వేదిక ప్రస్థానాన్ని పునశ్చరణ చేసుకునేందుకు కలుసుకోబోతున్నాం.
అనేక ప్రత్యేకతలున్న సంస్థ ‘సాహితీవేదిక’. అందరూ వక్తలు, శ్రోతలుగా ఉండే ఒక ప్రజాస్వామిక వేదికగా ఉండేది. భిన్న భావాలు, సిద్ధాం తాలు, ఆచరణలు, ఆకాంక్షలు ఉన్న... రచయితలూ, చదువరులతో, ‘నూరు ఆలోచనలు సంఘర్షించనీ వెయ్యి పువ్వులు వికసించనీ’ అన్నట్టుగా భావప్రకటనా స్వేచ్ఛతో ప్రభాత గౌతమిలా తళతళలాడుతుండేది. ఉత్తమ సాహిత్య ప్రమాణాలను పాటించడంలో వేదిక ఎన్నడూ రాజీపడలేదు. వామపక్షవాదులు మొదలు కొని సాంప్ర దాయవాదుల వరకూ సభ్యులుగా ఉండేవారు.
ఒకరినొ కరం సహనంగా చెవొగ్గి వినటం, గౌరవించాల్సిన విష యాల్ని గౌరవించటం, విమర్శించాల్సిన వాటిని విమర్శించే పద్ధతిని పాటించాం.
వేదిక కార్యక్రమాలు ఎంతో ఆసక్తిగొలిపేవి. వాటి కోసం ఉత్సాహంగా ఎదురు చూసే వాళ్ళం. ‘నిరుడు కురిసిన హిమ సమూహములు’ అనే విభాగం కింద వెనుకటి తరం రచయితల కథో, కవితో చదవడంతో సమావేశాన్ని ప్రారంభించేవారం.
ప్రతినెలా రెండవ ఆదివారం జరిపే ‘సమాలోచన’ కార్యక్రమంలో ఆయా విశిష్ట రచనలపై ప్రసంగ వ్యాసాలు చదివేవారం. ఉగాది రోజున సాయంత్రం ‘ఇష్ట కవితా పఠనం’లో తనకి ఇష్టమైన కవి నుండి తాము ఎన్నుకున్న కవితని గోదావరి నదీతీరంలో మెట్ల మీద కూర్చుని పఠించే వాళ్ళం.
వేదిక తొలి కథాసంకలనం ‘కథావేదిక’ను ఆర్‌ఎస్ సుదర్శనం, రెండవ కథాసంకలనం ‘కథాగౌతమి’ని కె. వాసమూర్తి, మొదటి ‘కవితావేదిక’ను గుంటూరు శేషేంద్ర శర్మ, ‘ఆర్కెష్ట్రా’ను వేగుంట మోహనప్రసాద్ ఆవిష్కరించడం వేదిక సభ్యులకి విలువైన జ్ఞాపకం. రెండవ వార్షికో త్సవ సభకు ముఖ్య అతిథిగా కాళీపట్నం రామారావు పాల్గొనటం ఓ మధురస్మృతి. నేటి పునస్సమాగమాన్ని పురస్కరించుకుని వేదిక గురించిన ఒక విశేష సంచికను, కొంతమంది సభ్యుల పుస్తకాలను ఆవిష్కరించుకోబోతున్నాం. ‘సాహితీ వేదిక’ అందమంతా తన విశాలత్వమే. అది మా తలపుల్లో గోదావరిలా నిత్యప్రవాహి.
కుప్పిలి పద్మ
వ్యాసకర్త కవయిత్రి, కథకురాలు
Comments
Please login to add a commentAdd a comment